పెంచినా.. ముంచినా.. అలవాట్లే!

కుర్రకారు అంటేనే కుదురుగా ఉండే రకం కాదు. వాళ్లకి ఎన్ని సరదాలో.. అన్ని అలవాట్లు. అందులో కొన్ని కెరియర్‌, ఆరోగ్యాన్ని పెంచేవి అయితే మరిన్ని ముంచేసేవి. అవేంటి? వాటి నుంచి బయటపడే దారేంటి?

Updated : 22 Apr 2023 00:42 IST

కుర్రకారు అంటేనే కుదురుగా ఉండే రకం కాదు. వాళ్లకి ఎన్ని సరదాలో.. అన్ని అలవాట్లు. అందులో కొన్ని కెరియర్‌, ఆరోగ్యాన్ని పెంచేవి అయితే మరిన్ని ముంచేసేవి. అవేంటి? వాటి నుంచి బయటపడే దారేంటి?

పొద్దున పడక దిగినప్పటి నుంచి రాత్రి కునుకు మానుకొని మరీ సెల్‌ఫోన్లు, గ్యాడ్జెట్లతోనే సహజీవనం చేసే యూత్‌ చాలానే. ఇంకొందరు రకరకాల కారణాలతో చాలా ఆలస్యంగా బెడ్‌ ఎక్కుతుంటారు. ఇది ప్రమాదకరం. తరచూ ఇలా చేస్తే మెదడు చురుకుదనం తగ్గుతుంది. అజీర్ణ సమస్యలొస్తాయి. మానసిక ఇబ్బందులు మొదలవుతాయి. ఇవన్నీ తగ్గించుకోవాలంటే.. వేళకి నిద్ర తప్పనిసరి.

కొందరు ఒకేసమయంలో రకరకాల పనులు చేస్తుంటారు. ఈ హడావుడి కారణంగా చిరాకు మొదలవుతుంది. ఈ మల్టీటాస్కింగ్‌తో కార్టిజోల్‌ అనే ఒత్తిడి హార్మోన్‌ అధికంగా విడుదలవుతుంటుంది. దీంతో ఒక్కోసారి జీవనశైలే మారిపోతుంది. మానసిక సమస్యలు తలెత్తుతాయి. ప్రశాంతత కావాలనుకుంటే ఒకే సమయంలో ఒకే పని చేయడం ఉత్తమం.

మనిషి ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం అవసరం. కానీ అస్తమానం అదేపనిగా కసరత్తులు చేయడమూ అంత మంచిదేం కాదంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే అధిక దాహం, శ్వాసకోశ సమస్యలు వస్తాయంటున్నారు.  

గేమ్స్‌ ఆడటం, సినిమాలు చూడటం, అధిక పనివేళలు.. కారణం ఏదైనా యువత టీవీ, కంప్యూటర్‌ తెరలకు అతుక్కుపోతున్నారు. ఇవి ఊబకాయం, హృద్రోగ సమస్యలు, మధుమేహంలాటి జబ్బులకు కారణం అవుతున్నాయి. మెడ, నడుమునొప్పి సరేసరి. సాధ్యమైనంతగా తెర సమయం తగ్గించడం, మధ్యమధ్యలో విరామం తీసుకోవడమే పరిష్కారం.

పిజ్జాలు, బర్గర్లు తినడం.. స్టైల్‌గా కూల్‌డ్రింక్‌ తాగడం.. చిప్స్‌ ప్యాకెట్లను లాగించడం.. ఇలా ఉంటేనే యూత్‌ అనుకుంటారు కొందరు. మరికొందరైతే ఆకలి లేకున్నా ఏదో ఒకటి లోపలికి తోసేస్తూనే ఉంటారు. ఇది మన జీర్ణ వ్యవస్థని దెబ్బ కొట్టేస్తుంది. లివర్‌ మీద భారం పెంచుతుంది.దీనికి ఒక్కటే పరిష్కారం వేళకి తినడం. అనవసరంగా కాకుండా.. ఆకలైనప్పుడే భుజించడం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని