అవన్నీ గోడలకే పరిమితమా?

మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. నా చిన్నతనమంతా ఆర్థిక సమస్యలతోనే గడిచిపోయింది. నాన్నకు కుటుంబ బాధ్యతలు ఎంతమాత్రం

Updated : 02 May 2020 00:20 IST

మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. నా చిన్నతనమంతా ఆర్థిక సమస్యలతోనే గడిచిపోయింది. నాన్నకు కుటుంబ బాధ్యతలు ఎంతమాత్రం పట్టవు. ఆడపిల్లలను చదివించడం వృథా.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసి పంపాలనేవాడు. ఆ మాటలు విన్నప్పుడుల్లా భయం వేసేది. నేను వెళ్లే బస్సులో.. మా స్కూల్‌ గోడలపైనా ‘స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం’ అని రాసున్న రాతల్ని చెరిపేయాలి అనిపించేది. నా పుట్టుకకు కారణమైన నాన్నే ఇలా ఆలోచిస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి నా బాధ? పదోతరగతి తర్వాత పెళ్లి చేస్తానంటే నాన్నతో గొడవపడి కాలేజీలో చేరాను. స్నేహితులందరూ కలిసి నా ఫీజులు కట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. వాళ్లలో కొందరు అబ్బాయిలూ ఉన్నారు. నాన్న వల్ల పోగొట్టుకున్న ధైర్యం.. నా స్నేహితులు చూపిన సాయంతో కాస్త చిగురించింది. ఎన్ని అవాంతరాలు వచ్చినా చదువే లోకంగా భావించి పీజీ పూర్తిచేశాను. ప్రముఖ సంస్థలో ఉద్యోగాన్నీ సంపాదించాను. చెల్లెలి చదువు బాధ్యతనూ నేనే తీసుకున్నాను. నాన్నలో కాస్త మార్పు కనిపించినందుకు సంతోషపడే లోపే.. మరో చిన్నచూపు నా ఉద్యోగ జీవితంలో ప్రవేశించింది. అది మా మేనేజర్‌ రూపంలో.. నా పని నేను చేసుకుని వెళితే ఆయనకు నచ్చడం లేదు. చిన్నతనం నుంచీ నా స్వభావమే అంత. నాకిచ్చిన పనిని నిబద్ధతతో పూర్తి చేయడం. సమయం చిక్కితే పుస్తకాలు చదవడం. ఆ లైఫ్‌స్టైలే నేను కోరుకున్న జీవితాన్ని నాకిచ్చింది. ఆఫీసులో నాతో పాటు పని చేసే సహోద్యోగుల్లా నేను ఎప్పుడూ ఆయనతో ముచ్చట్లు పెట్టను. పని విషయంలో ఏదైనా సందేహం ఉంటే తప్ఫ

కానీ, ఆఫీస్‌ వర్క్‌ కల్చర్‌ నేను అనుకున్నట్టు లేదు. ఎదుటివాళ్ల మీద ఉన్నవీ, లేనివీ కల్పించి చెప్పే వాళ్లనే కొందరు పై స్థాయి వాళ్లు గుర్తించే పరిస్థితి నా కళ్ల ముందు ఉంది. సందర్భం దొరికితే చాలు. టీఎల్స్‌, పాజెక్టు మేనేజర్‌లను పొగడడం నేను ప్రతి సమావేశంలోనూ చూస్తున్నా. మా మేనేజర్‌ అయితే అలాంటి వాళ్లని నెత్తిన పెట్టుకుని చూసుకోవడం నాకు వింతగా అనిపించింది. నాకేమో ఉన్న విషయాన్ని తప్ప మరోటి మాట్లాడడం రాదు. పైగా.. మా మేనేజర్‌ నిజంగా మంచి వ్యక్తిత్వం ఉన్న వారైతే పొగిడేదాన్నేమో. ఆయన సంకుచిత స్వభావం నాకు బాగా తెలుసు. ఆడుతూ.. పాడుతూ పని చేసుకెళ్లే వాళ్లంటే ఆయనకు అసలు నచ్చదు. ముఖ్యంగా అమ్మాయిలు. మా టీమ్‌లో ఉన్నదే ముగ్గురం అమ్మాయిలం. ఏదో ఒక విషయంలో అవకాశం చిక్కితే చాలు. మమ్మల్నే లక్ష్యంగా చేసుకుని చిన్నచూపు చూసేవాడు. నా విషయంలో అయితే ఇంకాస్త ఎక్కువే స్పందిస్తాడు. ఎన్ని బాధలున్నా నా ముఖంపై చిరునవ్వు చెరగనిచ్చేదాన్ని కాదు. ఎప్పుడూ మొహం మాడ్చుకుని కూర్చోవడం నాకు నచ్చదు, చేతకాదు కూడా.

ఓ రోజు నాకు అప్పగించిన పనిని మధ్యలో వదిలి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నేను ఇంటికి వెళ్లకపోతే మా చెల్లి నాకు దక్కేది కాదు. ఇంట్లో నాన్నకీ, చెల్లికీ మధ్య గొడవ. తనకేమో ఇంజినీరింగ్‌ చేయాలని.. నాన్నేమో చాలా ఖర్చు అవుతుంది వద్దని. ఉన్న అరకొర సంపాదనతో ఇంకెన్నాళ్లు చదివి లోకాన్ని ఉద్ధరిస్తావ్‌. మీ ఇద్దరికీ పెళ్లి చేసి పంపేస్తేగానీ నా గుండెలపై గుది బండ దిగదు అంటూ నన్ను కూడా కలిపేశాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. నాన్న చేయి చేసుకునే సరికి తట్టుకోలేక నాకు మెసేజ్‌ పెట్టింది. ‘అక్కా.. క్షమించు. నాకు బతకడం ఇష్టం లేదు’ అని. నేను ఆఫీసు నుంచి వెళ్లే సరికి గది తలుపులు బిగించుకుంది. నేను వెళ్లి బతిమాలితేగానీ ఆ తలుపులు తెరుచుకోలేదు. నన్ను పట్టుకుని ఏడ్చేసింది. వయసులో చిన్నది. నేనేమో అమ్మలా చూసుకునే అక్కని. పైగా.. అది చచ్చేంత పిరికిది కాదు. ఎందుకంటే.. నేను తన ముందే అవన్నీ దాటుకుని వచ్ఛా ఆ రోజు నేను ఆఫీసు పని మధ్యలో వదిలి వెళ్లిన విషయం మా మేనేజర్‌కి చెప్పలేదు. మరుసటి రోజు నన్ను అనరాని మాటలు అన్నాడు. కనీసం నేను ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అని అడిగే కామన్‌సెన్స్‌ కూడా ఆయనికి లేనందుకు జాలేసింది. నిలబడే ఉన్నా. ఆయన ఫోన్‌ రింగ్‌ అయ్యింది. లిఫ్ట్‌ చేసి.. ‘ఇంట్లో నీతో.. ఇక్కడ నీలాంటి మరి కొందరితో. ఎందుకూ పనికిరారు మీరంతా..’ అని ఫోన్‌ కట్‌ చేశాడు. ఫోన్‌ చేసింది వాళ్లావిడే అని నాకు అర్థమయ్యింది. ఆయన క్యాబిన్‌ నుంచి కెఫెటీరియా వైపు నడిచా. వెళ్తూ డెస్క్‌లలో చూస్తే.. నాలా ఎంతో మంది అమ్మాయిలు వారి పనుల్లో తలమునకలై ఉన్నారు. అందరి ముఖాల్లో నవ్వే. అచ్చం నాలాగే.. కానీ, ఆ నవ్వుల వెనక లెక్కకందని ఎన్నో చిన్నచూపులు ఉన్నాయో!! అయినా.. మేం పోరాడతాం. మా ఉనికి కోసం కాదు. మా కలలు.. ఆశల కోసం.. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. మా నాన్న లాంటి ఎంతో మంది నాన్నలకీ.. మా మేనేజర్‌ లాంటి ఎంతో మంది బాస్‌లకీ.. ఇది మనసులోని మాట!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని