జాలి వద్దు ప్రియతమా...!

ఇంటర్‌ మొదటిరోజు. భయంభయంగా కాలేజీలో అడుగుపెట్టా. ‘హాయ్‌’ చొరవగా చేయందించింది సంధ్య. నా అభిప్రాయాలకు జిరాక్స్‌ కాపీలా ఉండేది. అందుకే త్వరగా

Published : 17 Oct 2020 19:03 IST

ఇంటర్‌ మొదటిరోజు. భయంభయంగా కాలేజీలో అడుగుపెట్టా. ‘హాయ్‌’ చొరవగా చేయందించింది సంధ్య. నా అభిప్రాయాలకు జిరాక్స్‌ కాపీలా ఉండేది. అందుకే త్వరగా కలిసిపోయాం. తన ద్వారా రవి పరిచయమయ్యాడు. క్యాంటీన్‌, క్యాంపస్‌, బయట షికార్లు ఎక్కడైనా మేమే. కొన్నాళ్లకి సంధ్య నాన్నకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యింది. మా తనువు నుంచి ఓ భాగం విడిపోయినట్టు విలవిల్లాడాం. అప్పట్నుంచి రవికి నేను, నాకు రవి అన్నట్టు ఉండేవాళ్లం.

బీటెక్‌లో ఇద్దరం ఒకే కాలేజీలో చేరాం. సెకండియర్‌లో సీనియర్‌లయ్యాం కదా.. బాగా రెచ్చిపోయేవాళ్లం. క్లాసు బోర్‌ కొడితే క్యాంటీన్‌.. అదీ నచ్చకపోతే సినిమా. మేం ప్రేమికులమంటూ పుకార్లు బయల్దేరాయి. గోడల మీద రాతలు కూడా. ‘వీ డోంట్‌ కేర్‌’ అనుకునేవాళ్లం.

ఎందుకో తెలియదుగానీ రాన్రాను రవి వేరే అమ్మాయిని చూసినా, చొరవగా మాట్లాడినా నాకు నచ్చేది కాదు. గొడవ పడేదాన్ని, తిట్టేదాన్ని. వాడే వచ్చి సారీ చెప్పేవాడు. క్షమించమని బతిమాలేవాడు. తనలా నా చుట్టూ తిరుగుతుంటే భలేగా అనిపించేది.

క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఎంపికయ్యా. జాబ్‌ బెంగళూరులో. ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నాకు రవి అంటే ఇష్టమని చెప్పాలనిపించేది. కానీ వాడికి నాపై ఆ ఫీలింగ్‌ ఉందో, లేదోనని అనుమానం. మరోవైపు ‘మంచి మ్యాచ్‌ వచ్చింది. నువ్వు సరేనంటే ఓకే చెబుదాం’ అందోరోజు అమ్మ. వాడి అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని పెళ్లి ఫిక్స్‌ అయిందని చెప్పా. కంగ్రాట్స్‌ చెప్పి ‘ఎవరే ఈ కోతిని భరించేది’ అన్నాడు. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆఖరికి ధైర్యం చేసి అడిగేశా. ‘నువ్వే చేసుకోవచ్చు కదరా. నిన్నొదిలి నేనెక్కడికీ వెళ్లనవసరం లేద’ని. ‘ఏంటే ఇంత షాకిచ్చావు. నిన్ను ఎప్పుడూ ఓ ఫ్రెండ్‌లాగే భావించా’ అన్నాడు. దుఃఖం పొంగుకొచ్చింది.

అమ్మానాన్నలు చూసిన అబ్బాయితో నా పెళైపోయింది. రవి ఎంబీఏలో చేరాడు. పెళ్లైయ్యాక తనపై ఆశలు పెట్టుకోవడం మంచిది కాదని మనసుకు నచ్చజెప్పుకున్నా. పైగా నా భర్త నన్ను బాగా చూసుకునేవారు. కొన్నాళ్లకి మాకు పాప పుట్టింది. జీవితం హ్యాపీగా గడిచిపోతోంది. రవితో మాటలు తగ్గించాను. తను ఎంబీఏ పూర్తిచేసి ఉద్యోగం రావడంతో లండన్‌ వెళ్లిపోయాడని తెలిసింది. నాకు చెప్పలేదని చాలా బాధపడ్డా.

సాఫీగా సాగిపోతున్న నా జీవితంలో పెద్ద కుదుపు. పాపకి నాలుగేళ్ల వయసున్నప్పుడు ఓ ప్రమాదంలో మా ఆయన చనిపోయారు. నేను ఒంటరిదాన్నైపోయా. మనసు రాయి చేసుకొని పాపని, ఉద్యోగాన్ని చూసుకుంటూ మొండిగా బతకడం అలవాటు చేసుకున్నా. ఈసమయంలోనే అనుకోని అతిథిలా పలకరించాడు రవి. ఓ స్నేహితురాలి పెళ్లిలో కలిశాడు. నా బెస్టీ కనిపించేసరికి గుండెలోని బాధనంతా వెళ్లగక్కేశా. బాగా ఓదార్చాడు. మళ్లీ ఫోన్లు మొదలయ్యాయి. పాత రోజులు గుర్తొచ్చాయి. మాటలు, కష్టసుఖాలు పంచుకోవడంతోనే సరిపుచ్చుకుంటే బాగుండేది. వాడు నన్ను పెళ్లి చేసుకుంటాననే ప్రపోజల్‌ తీసుకొచ్చి అయోమయంలో పడేశాడు. రవి పరిచయం, సాన్నిహిత్యం నాకెప్పుడూ సంతోషమే. కానీ ఈసారి సంతోషం కలగడం లేదు. తను నన్ను జాలిపడి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అందుకే నో చెప్పా. ఇప్పటికీ బతిమాలుతూనే ఉన్నాడు. అయినా మనసు అంగీకరించట్లేదు. నేను నా భర్తని మనస్ఫూర్తిగా స్వీకరించా. నా తొలిప్రేమ రవితోనే. కానీ కలిసి బతకడానికి ఒకరికి ప్రేమ ఉంటే సరిపోదు. ఇద్దరికీ ఉండాలి. నీకు నాపై ఉన్నది ప్రేమ కాదు.. జాలి మాత్రమే రవి. నాకు జాలి వద్దు నేస్తమా. మనం మంచి స్నేహితులుగా ఉండిపోదాం.

-జ్యోతి

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని