Published : 28 Nov 2020 00:37 IST

నేను మైనస్‌ డిగ్రీల్లో ప్రేమ ప్లస్‌ అవుతుందా?

రక్తం గడ్డ కట్టే చలిలోనూ.. ఆమె ఆలోచనలతో నాకు చెమటలు పడుతున్నాయి. నా పేరు రమేష్‌. ఇండియన్‌ ఆర్మీలో సైనికుడిని. మాది విజయనగరం. ఇప్పుడు జమ్ము-కశ్మీర్‌లో విధులు నిర్వహిసున్నా. మైనస్‌ 30 డిగ్రీల చలిలో డ్యూటీ. చుట్టూ చిమ్మ చీకటి. ఎముకలు కొరికే చలి. అనుక్షణం నా కళ్లు శత్రువుల అలికిడిని కనిపెడుతూనే ఉన్నా మనసు మాత్రం నా బంగారం జ్ఞాపకాల చుట్టూ తిరుగుతోంది. నేను ఈ రోజు గర్వంగా దేశ సేవ చేస్తున్నానంటే కారణం తనే. నాలుగేళ్లుగా తను పంచిన ప్రేమలో నాకు నేను ఎన్నో సార్లు కొత్తగా పరిచయం అయ్యా. ఇద్దరం ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు తను పంచిన ప్రేమే.. శత్రువులు ఎక్కు పెట్టిన తుపాకీలా ఏ క్షణమైనా నా గుండెల్ని చీల్చేందుకు కాచుకుని ఉంది. తను దూరంగా వెళ్లిపొమ్మంటోంది. నేను మరింత చేరువ కావాలనుకుంటున్నా. ఆశగా తన ప్రేమ కోసం.. తనతో జీవించాలనే సంకల్పంతో డ్యూటీ చేస్తున్నా.
నాలుగేళ్ల క్రితం.. బంగారం నా మనసుకు దగ్గరైంది. తన పేరు భారతి. నా ఫ్రెండు చెల్లెలు. అందం, సంస్కారం, సంప్రదాయం అన్నీ తనలోనే చూశా. అన్ని వర్ణాలు కలిసిన ఓ అందమైన ముగ్గులా.. నా ఇంటి వాకిలికి తనో అలంకరణ అవ్వాలనుకున్నా. ప్రేమిస్తున్న విషయం తనకుంటే ముందు వాళ్ల అన్నయ్యకే చెప్పా. వాడు అడ్డు చెప్పలేదు. మా ఇద్దరి ప్రేమ సంబరాలు మొదలయ్యాయి. తన రాకతో హ్యాపీనెస్‌ కేరాఫ్‌ అడ్రస్‌ కోసం వెతకడం మానేశా. ఎందుకంటే.. సంతోషానికి నేనే కేరాఫ్‌ అడ్రస్‌గా మారా. ఓ లక్ష్యాన్ని ఎంచుకుని ల్యాండ్‌మార్క్‌లా మారాలనుకున్నా. ఆర్మీకి వెళ్లా. భారత మాతకి సేవ చేస్తూ.. నా భారతి ఒడిలో సేదతీరాలనుకున్నా. కానీ, ఓ రోజు రాత్రి నేను డ్యూటీలో ఉండగా ఫోన్‌. ‘బావా.. నన్ను మా మావయ్యని పెళ్లి చేసుకోమంటున్నారు. నాకు ఇష్టం లేదు. తనో అనుమానపు పిశాచి. నాకేం చేయాలో అర్థం కావడం లేదు’ అని బంగారం ఒకటే ఏడుపు. నాకేం అర్థం కాలేదు. వాళ్ల అన్నయ్యకి విషయం చెబితే.. తనేం చేయలేనని, వాళ్ల పిన్నితో మాట్లాడమని చెప్పాడు. ఆవిడకి ఫోన్‌ చేశా. మేం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి చేసుకుంటామని చెబితే స్పందన లేదు. ఫోన్‌ పెట్టేసింది. తర్వాత ఏమైందో తెలియదు. కొన్ని రోజులకు భారతి ఫోన్‌ చేసింది. ‘ఇక నాకు ఫోన్‌ చేయకు. నేను మాట్లాడలేను’ అని స్విచ్ఛాఫ్‌ చేసింది. గుండె పగిలింది. ఊరెళ్లి మాట్లాడదాం అనుకుంటే నాకు లీవ్‌ దొరకడం లేదు. అయోమయం.. భయం! తను లేకపోతే నేను బతకలేనని కాదు. వాళ్ల మామయ్యని పెళ్లి చేసుకుని తను సంతోషం ఉండలేదని.
ప్లీజ్‌.. భారతి. ఒకసారి ఆలోచించు. మీ పిన్ని మాటలు నిన్ను ఇప్పటికి ప్రభావితం చేయొచ్చు. తర్వాత నీ లైఫ్‌కి నువ్వే జవాబుదారీ. నీ కోసం నేను ఎప్పటికీ వేచి చూస్తూనే ఉంటా. నువ్వు తీసుకునే నిర్ణయం.. నీ వందేళ్ల భవిష్యత్తు. తొందరపడి మనం కన్న కలల్ని కాటికి పంపొద్దు. నీకు నేనున్నా. వీలైనంత త్వరగా వస్తా. నువ్వు వేచి చూస్తుంటావని ఆశతో.. మన ప్రేమ విజయాన్ని కోరే ఓ సైనికుడు!

- రమేష్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని