తనువంతా కనులై.. నిరీక్షిస్తున్నా!

ఫ్రెండ్‌ వేణు కోసం నరసాపురం గోదారి తీరాన ఎదురు చూస్తున్నా. ఆకాశాన్ని అందుకోవాలని ఎగసెగిసిపడుతున్న అలలు.. అల్లంత దూరాన నది మధ్యలో నిశ్చలంగా సాగుతున్న పడవలు..

Updated : 19 Dec 2020 07:04 IST

ఫ్రెండ్‌ వేణు కోసం నరసాపురం గోదారి తీరాన ఎదురు చూస్తున్నా. ఆకాశాన్ని అందుకోవాలని ఎగసెగిసిపడుతున్న అలలు.. అల్లంత దూరాన నది మధ్యలో నిశ్చలంగా సాగుతున్న పడవలు.. ఆ అందమైన దృశ్యాన్ని చూస్తూ కూర్చున్నా. ఆరోజు దీపావళి. అందరి స్టేటస్‌లలోనూ శుభాకాంక్షల వెల్లువే. అలా చూస్తుండగా దూరం నుంచి అమ్మాయిల నవ్వులు. చూద్దామని పుష్కరఘాట్‌ సమీపించా. తొలిప్రేమ సినిమాలో కీర్తిరెడ్డిలా చిచ్చుబుడ్డీల వెలుగుల్లో నన్నో అమ్మాయి ఆకర్షించింది. చెమ్కీల డ్రెస్‌తో, ముంగురుల్ని సవరించుకుంటుంటే తన ముఖం మతాబును మించి వెలిగిపోతోంది. పైన నీలాకాశం.. పక్కన హోరుమంటున్న నదీ సమీరాలు.. ఎదురుగా నిండు జాబిలిలా తను. నా మనసు వశం తప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి?
ఎలాగైనా తనతో మాట కలపాలని ఆత్రంగా ఉంది. కానీ ఎలా? గబగబా వేణుగాడికి ఫోన్‌ చేశా. ఆ అమ్మాయి గురించి చెప్పి నా ఆశ వివరించా. ‘రేయ్‌.. నువ్వేనా? ఇలా అడుగుతోంది. అమ్మాయిలంటేనే ఆమడ దూరం పరుగెత్తుతావ్‌. ఇప్పుడేంటిలా?’ వాడి ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. అయినా ఆమెతో ఎలాగైనా మాట్లాడిస్తానని భరోసా ఇచ్చాడు. అన్నట్టుగానే ఓరోజు తన దగ్గరికి తీసుకెళ్లాడు. నా గుండె వేగం రెట్టింపైంది. నోరు తడారిపోతోంది. అయినా అరువు తెచ్చుకున్న ధైర్యంతో ‘హాయ్‌.. నా పేరు శివ. నీ పేరేంటి?’ అని నోరు పెగిల్చా. అయితే ఏంటట? నువ్వెవరసలు? అన్నట్టుగా ముఖం చిట్లించింది. మొదటి ప్రయత్నం ఫెయిల్‌. అయినా వెనక్కి తగ్గలేదు. కొద్దిరోజులకే తనకు నచ్చేలా ఓ మంచి పనిచేసి ఆమె దృష్టిలో పడ్డా. ఆపై ఒకరికొకరం పేర్లు చెప్పుకున్నాం. నవ్వులు పంచుకున్నాం. ‘ఇదే ప్లేస్‌లో రేపు కలుద్దాం. బై’ అనుకున్నాం.
మరుసటి రోజు కోసం ఆ రాత్రంతా జాగారమే చేశా. మాటిచ్చినట్టుగానే తనొచ్చింది. నా కళ్లకి, మనసుకి పండగ. అది మొదలు. మాటలు ఇచ్చిపుచ్చుకున్నాం. అభిప్రాయాలు పంచుకున్నాం. ఆఖరికి మనసులూ తర్జుమా అయ్యాయి. కొన్నాళ్లకు మేం ఆ ఊరిని విడిచి వెళ్లాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే తను బెంగళూరులో బీటెక్‌ ఫైనలియర్‌. నేను చెన్నైలో ఎంటెక్‌. మమ్మల్ని కలిపిన దీపావళికి, ఆ ఊరికి థ్యాంక్స్‌ చెప్పి భారంగా పయనమయ్యాం. వెళ్లేముందు ఒక ప్రామిస్‌ చేసుకున్నాం. మేం ఎక్కడున్నా, ఏ పొజిషన్‌లో ఉన్నా ప్రతి దీపావళికి నరసాపురం గోదావరి తీరాన కలుసుకోవాలని.
మరుసటి ఏడాది కలుసుకున్నాం. కబుర్లు చెప్పుకున్నాం. ఇద్దరి కళ్లలో కోటి కాంతులు. కానీ ఈ దీపావళికి తను రాలేదు. అమావాస్య చీకట్లు నా జీవితాన్ని ఆవరించాయి. తర్వాత తన రాక కోసం, మాట కోసం ఎంత ప్రయత్నించానో! ఫోన్‌ నాట్‌ రీచబుల్‌. మెయిల్‌కి రిప్లై లేదు. మెసెంజర్‌లో కనిపించదు. ‘తను ఏ ఎన్నారైనో పెళ్లి చేసుకుని విదేశాల్లో విహరిస్తుంటుంది. నువ్వే ఇంకా పిచ్చివాడిలా వెతుకుతున్నావ్‌’ అని ఫ్రెండ్స్‌ కోప్పడ్డారు. కానీ తనలా చేయదని నా నమ్మకం. నన్ను కలుసుకోవడానికి తప్పకుండా వస్తుందని నా మనసు చెబుతోంది. సాత్వికా.. నీ మాట, నీ చూపు నన్ను తాకిన రోజే నాకు నిజమైన దీపావళి. తొందరలోనే నా కళ్లెదుట నిల్చొని నా జీవితంలో వెలుగులు నింపుతావని ఆశిస్తున్నాను.

- శివ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని