తొందరపడ్డా.. కానీ!

జూబ్లీ వరుసకి మరదలు. అల్లరి పిల్ల. టామ్‌ అండ్‌ జెర్రీలా ఉండేవాళ్లం. పరీక్షల్లో తక్కువ మార్కులొస్తే మా అమ్మకి చెప్పి చీవాట్లు పెట్టించేది.

Published : 02 Jan 2021 00:54 IST

జూబ్లీ వరుసకి మరదలు. అల్లరి పిల్ల. టామ్‌ అండ్‌ జెర్రీలా ఉండేవాళ్లం. పరీక్షల్లో తక్కువ మార్కులొస్తే మా అమ్మకి చెప్పి చీవాట్లు పెట్టించేది. నేనేమైనా అంటే క్లాసులో టీచర్లకు ఫిర్యాదు చేసేది. కానీ మా మధ్య ఎన్ని గొడవలు జరిగినా వెంటనే కలిసిపోయి ఆడుకునేవాళ్లం. కొన్నేళ్లకు జూబ్లీని వేరే స్కూళ్లో చేర్పించారు.
ఇంటర్లో ఫ్రెండ్స్‌ అందరూ ప్రేమలో పడిపోయారు. నేను తప్ప. నాకు ఎవరూ నచ్చేవాళ్లు కాదు. అప్పుడు గుర్తొచ్చింది జూబ్లీ. వాళ్ల కాలేజీలో చదివే ఓ ఫ్రెండ్‌ని అడిగా. ‘తనేం మారలేదు. చిన్నప్పటిలాగే చలాకీగా ఉంది’ అన్నాడు. నేను ఊహల్లోకి వెళ్లిపోయా. తనే నా డ్రీమ్‌గాళ్‌ అని ఫిక్సయ్యా.
ఓరోజు తన నెంబర్‌ కనుక్కొని ‘హాయ్‌’ అన్నా. పేరు చెప్పకుండానే చాట్‌ చేశా. రిప్లై వచ్చిన ప్రతిసారీ మనసు మబ్బుల్లో తేలిపోయేది. చివరికి నేనెవరో చెప్పి కొన్నాళ్లకు ప్రపోజ్‌ చేశా. ‘ఈ ప్రేమా, గీమా వద్దు.. మనం మంచి ఫ్రెండ్స్‌లా ఉందాం’ అంది. గుండె నిండా తనే ఉంటే స్నేహంతో ఎలా సరిపెట్టుకోను? అదే మాటంటే ‘అయితే మాట్లాడ్డమే మానెయ్‌’ అంది. నాకు షాక్‌.
ఎగ్జామ్స్‌ అయ్యాక తనూరొస్తుందని తెలిసింది. సర్‌ప్రైజ్‌ చేద్దామని స్టేషన్‌కి వెళ్లా. వాళ్ల నాన్నతోపాటు దిగింది. నన్ను చూసి నోరెళ్లబెట్టింది. పలకరింపులయ్యాయి. ‘జూబ్లీని నీ బైక్‌పై ఇంటికి తీసుకెళ్లరా’ అన్నారు వాళ్ల నాన్న. రానంది. సర్లెమ్మని లగేజీ తీసుకొని వచ్చేశాను. అప్పట్నుంచి మామధ్య మాటలు పోటెత్తాయి.
ఉద్యోగం కోసం నేను బెంగళూరు వెళ్లాను. అప్పుడు తను బీటెక్‌ ఫైనలియర్‌. ఓరోజు ఫోన్‌ చేసి ‘నేనంటే నీకు ఎందుకంత ఇష్టం, నా గురించి నీకేం తెలుసు?’ అనడింది సడెన్‌గా. ఎంతిష్టమో.. ఎందుకిష్టమో.. విడమరచి చెప్పా. ‘కానీ.. నన్ను మా మేనత్త కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు. నన్ను మర్చిపో ప్లీజ్‌’ అంది. నా చేత ప్రేమ, పెళ్లి మాటలు మాన్పించడానికే తనలా అబద్ధం చెబుతోందని అనిపించేది. అదే తేల్చుకుందామని ఓరోజు బెంగళూరు నుంచి నేరుగా వాళ్ల కాలేజీకెళ్లిపోయా. రాత్రంతా అక్కడే ఎదురుచూశా. మావాళ్లకి ఫోన్‌ చేసి చెప్పింది. అంతా నన్ను తిట్టారు.
ఎప్పటికైనా నన్ను, నా ప్రేమను అర్థం చేసుకుంటుందని ఎదురుచూడసాగా. కానీ ఓ సంఘటన నా ఆశని చిదిమేసింది. ఓరోజు నా ఫ్రెండ్‌ జూబ్లీ గురించి చెడుగా చెప్పాడు. తనేంటో నాకు తెలుసని వాడిని తిట్టాను. ఆ విషయం అంతటితో వదిలేసినా బాగుండు. మావాడు ఇలా అన్నాడని జూబ్లీకి ఫోన్‌ చేసి చెప్పాను. తను రివర్స్‌ అయ్యింది. నన్ను, వాడిని కలిపి తిట్టింది. ఇంకోసారి ఫోన్‌ చేయొద్దని వార్నింగ్‌ ఇచ్చింది.
జూబ్లీ.. నీమీద ప్రేమ, అభిమానం చూపించాలనే తాపత్రయంలో కొన్ని తొందరపాటు పనులు చేశా. అవి నిన్ను బాధ పెట్టి ఉండొచ్చు. వాటికి మనస్ఫూర్తిగా క్షమాణలు కోరుతున్నా. కానీ నీపై నాకున్న ఇష్టం, అభిమానం స్వచ్ఛమైనవి. గౌరవమూ ఉంది. ఇప్పటికైనా అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా.

- యన్‌.ఎ.పి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని