నీ జ్ఞాపకాలను..  తలచుకుంటుంటా

సంక్రాంతి అంటే జానూకి ప్రాణం. తెల్లవారుజామునే లేచి సిద్ధమయ్యేది. కల్లాపి జల్లి ముగ్గుతో ముంగిలిలోకి వచ్చేది. తనా పనిలో ఉంటే నా కళ్లు ఆరాధనగా చూసేవి. ముగ్గు వేయడానికే దేవుడు తనని

Updated : 16 Jan 2021 01:15 IST

సంక్రాంతి అంటే జానూకి ప్రాణం. తెల్లవారుజామునే లేచి సిద్ధమయ్యేది. కల్లాపి జల్లి ముగ్గుతో ముంగిలిలోకి వచ్చేది. తనా పనిలో ఉంటే నా కళ్లు ఆరాధనగా చూసేవి. ముగ్గు వేయడానికే దేవుడు తనని పుట్టించాడేమో అన్నంత అందంగా వేసేది. ఇంధ్రధనుస్సుని భువికి దించినట్టు రంగులద్దేది. తర్వాత ఓసారి నావైపు కొంటెచూపు విసిరి ఎలా ఉందంటూ కనుసైగ చేసేది. ‘అబ్బే.. ఈసారేం బాలేదు’ అనేవాణ్ని ఏడిపించడానికి. అలిగి బుంగమూతి పెట్టేది. కలిసినప్పుడు మూగనోము పట్టేది. ‘సరదాగా అన్నానబ్బా’ అని సారీ చెబితే మళ్లీ మాటలు పోటెత్తేవి. అలా ముగ్గుల పండుగ మా ఇద్దర్ని ప్రతిసారీ మరింత దగ్గర చేసేది. అందుకే మేం ఎక్కడున్నా సంక్రాంతికి ఇంటికి చేరేవాళ్లం. సెలవుల్లో ఒకర్ని విడిచి ఒకరం ఉండలేనంత దగ్గరయ్యేవాళ్లం.
అలాంటి సం‘క్రాంతులు’ మా జీవితంలో చాలా వచ్చి వెళ్లాయి. కానీ ఈసారి సంక్రాంతి చేదు జ్ఞాపకమే. వర్షం పడ్డాక చెరిగిపోయిన ముగ్గులా నా ఆనందాల్ని చెరిపేసింది. పండక్కి ముందే ‘మా ఇంట్లో వాళ్లు పెళ్లి ఫిక్స్‌ చేశారు’ అని మెసేజ్‌ చేసింది జాను. దారం తెగిన గాలిపటంలా నిలకడ కోల్పోయింది మనసు. తర్వాత తనతో మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు. విషయమేంటో కనుక్కొమ్మని మా ఫ్రెండ్స్‌ని పురమాయించా. ‘మా రెండు కుటుంబాలకు మంచి సంబంధాలున్నాయి. ఇంట్లో మనల్ని ఒప్పుకోరేమో.. నేనూ ఒప్పించలేను. అందుకే అమ్మానాన్నలు చూసిన సంబంధం చేసుకోవాలనుకుంటున్నా’ తేల్చేసింది. పందెంలో నేలకొరిగిన కోడిలా విలవిల్లాడింది మనసు. ‘ప్రేమించే ముందు ఉన్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికి ఉండదా?’, ‘నాకు మనసిచ్చి వేరొకరితో ఎలా కాపురం చేస్తుంది?’.. ఇలాంటి సినిమా డైలాగ్‌లు ఏవేవో మదిలో మెదిలేవి. తననే తలచుకుంటూ బాధపడని రోజు లేదు. జానూతో మాట్లాడని ఒక్కోరోజు ఒక్కో యుగంలా గడుస్తోంది. ‘మళ్లీ నాకోసం అలిగితే బుజ్జగించాలని ఉంది జాను. ప్లీజ్‌ ఒక్కసారి నాకోసం అలగవు’ అని అడగాలని ఉంది. కానీ, ఏమి చేయలేని పరిస్థితి. తనని అర్థం చేసుకున్న ప్రేమ పిపాసిలాగే ఉండిపోవాలనుకున్నా. ఫోన్‌, మెసేజ్‌ చేసి విసిగించకూడదని డిసైడ్‌ అయ్యా. మనసుని రాయి చేసుకున్నా.
మేం చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు, కన్న కలలన్నింటికీ శుభం కార్డు పడిపోయింది. రాలిపోయిన పువ్వుల్లోనూ గత జ్ఞాపకాలను ఏరుకుంటూనే ఆనందంగా ఉంటా. తన ఊహల్నే ఊపిరిగా మలచుకొని శ్వాసిస్తుంటా. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ‘హ్యపీ మ్యారీడ్‌ లైఫ్‌ జాను’.

- మణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని