ఒప్పిద్దాం.. ఒక్కటవుదాం

అల్లంత దూరం నుంచి కమ్మని పరిమళం నా నాసికాపుటాలను తాకడంతో అటువైపు చూశా. ముదురు రంగు చుడీదార్‌లో ఒకమ్మాయి గాలికి ఎగరుతున్న ముంగురుల్ని సవరించుకుంటూ వస్తోంది.

Updated : 30 Jan 2021 06:30 IST

అల్లంత దూరం నుంచి కమ్మని పరిమళం నా నాసికాపుటాలను తాకడంతో అటువైపు చూశా. ముదురు రంగు చుడీదార్‌లో ఒకమ్మాయి గాలికి ఎగరుతున్న ముంగురుల్ని సవరించుకుంటూ వస్తోంది. ఆల్చిప్పల్లాంటి కళ్లు.. తీర్చిదిద్దిన కనుబొమలు.. అధరాలు సన్నగా వణుకుతున్నాయి. ‘ఎక్స్‌క్యూజ్‌ మీ.. హెచ్‌ఆర్‌ క్యాబిన్‌ ఎటువైపు’ ఎవరినో అడుగుతోంది. కనురెప్ప వేయడం మర్చిపోయా. ‘ఎంతందంగా ఉన్నావే.. ఎవరే నువ్వూ..’ లోపల ఆత్మారాముడు పాటందుకున్నాడు. నేనేకాదు.. ఆ క్షణం ఆఫీసులో సగంమంది చూపులు ఆమెపైనే ఉన్నాయి.
కొత్త జాయినింగ్‌ అట. నేనూ వచ్చి వారమైంది. కొత్త ఆఫీసు, కొత్త వాతావరణం, కొత్త ఉద్యోగలు... భలే నచ్చేశాయి. ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా ఈ అమ్మాయి. మూడ్రోజుల్లో వీకెండ్‌ వచ్చేసింది. రెండ్రోజులు భారంగా గడిచాయి. ఎప్పుడెప్పుడు ఆఫీసులో అడుగుపెడదామా.. ఎప్పుడెప్పుడు ఆమెను చూద్దామా? అనే ఆరాటమే. ఓసారి అనుకోకుండా ఇద్దరి చూపులు కలిశాయి. నేను చప్పున తలొంచుకున్నా.
నా వాలకం, దొంగచూపులు, విరహాలు సీనియర్‌ కొలీగ్‌ కమ్‌ ఫ్రెండ్‌ పసిగట్టేశాడు. ‘తన పేరు వైష్ణవి. నీలాగే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌. ఈరోజే పరిచయం చేయిస్తాలే’ అన్నాడు. ఆ మాటతో నా ఊహలకు రెక్కలొచ్చాయి. అదేరోజు మా పలకరింపులయ్యాయి. ఇద్దరం కొత్తవాళ్లం. ఇద్దరికీ పనిలో సందేహాలొచ్చేవి. ఇద్దరమే చర్చించుకునేవాళ్లం. అదేం చిత్రమో.. పనేం లేకపోయినా నా కాళ్లు తన క్యాబిన్‌ వైపు నడిచేవి. నా కళ్లు తననే వెతికేవి. తనూ అంతే.. నా ఇష్టాలకు బాగా స్పందించేది. తను పక్కనుంటే చాలు నా కష్టాలు దూదిపింజెలా తేలిపోయేవి. ఔటింగ్‌లు, పార్కులు, షికార్లు.. మరీ ఎక్కువేం లేవుగానీ.. ఒకర్ని విడిచి ఒకరం ఉండలేని స్థితికొచ్చేశాం. ఇంకేం.. కొన్నాళ్లకే ఇద్దరం పలికేశాం ఆ మూడు పదాల మిరకిల్‌ని.
ప్రేమించుకోవడానికి రెండు మనసులు చాలు. పెళ్లికి రెండు కుటుంబాల ఆమోదం కావాలి.. సినిమా డైలాగే అయినా మాకూ అదే ఇబ్బంది ఎదురైంది. ‘కుటుంబాన్ని వదులుకోవడం నాకిష్టం లేదు. వాళ్లని ఒప్పించాకే మనం పెళ్లి చేసుకుందాం.. ఏమంటావ్‌?’ అందోసారి. తను చెబుతోంది సబబే అనిపించింది. మా ఇద్దరికీ మంచి ఉద్యోగాలున్నాయి. ఒకర్నొకరం ఇష్టపడుతున్నాం. రెండు కుటుంబాలూ ఒప్పుకుంటాయనే నమ్మకం ఉండేది నాకు. కానీ మా దురదృష్టంకొద్దీ ‘లవ్‌ మ్యారేజీనా? మేమస్సలు ఒప్పుకోం’ అన్నారు. ఏం చేయాలో తెలియని అయోమయం. ముందులా దగ్గరగా ఉండలేం.. అలాగని దూరం కాలేని పరిస్థితి. ఇద్దరి మధ్యా అలకలు.. చిర్రుబుర్రులు ఎక్కువయ్యాయి. అదేసమయంలో నన్ను బెంగళూరుకు బదిలీ చేశారు. తను మొహం మాడ్చుకుంది. మా మధ్య దూరం మరింత పెరిగింది. బహుశా.. పెద్దల్ని ఒప్పించడానికి నేను పెద్దగా ప్రయత్నం చేయడం లేదని తను భావిస్తోంది కాబోలు. ఆ భావన నీ మనసులో నుంచి తుడిచెయ్‌ వైశూ. వాళ్లని ఎప్పటికైనా ఒప్పించే పూచీ నాది. ఆ ప్రయత్నంలోనే ఉన్నా. నువ్వూ నీ ప్రయత్నం మానొద్దు. మేం వాళ్ల పెద్దరికాన్ని నిలబెట్టాలనుకుంటున్నాం. అదైనా తెలుసుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం.

- వంశీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని