నావెన్నెల కనుమరుగైంది!

సన్నాయి మేళాలు.. పన్నీటి జల్లులు.. పడుచుల కోలాహలం.. బంధువుల ఇంట్లో పెళ్లి సందడి భలేగా ఉంది. వీటన్నింటి మధ్యలో వీణానాదంలా నా గుండెను తాకిందో నవ్వు. తెల్ల చుడీదార్‌లో దేవకన్యలా మెరిసిపోతోంది ఆ నవ్వుని పుట్టించిన అమ్మాయి. ఎవరని ఫ్రెండ్‌ని అడిగా. ‘వెన్నెలరా! నాకు చెల్లి అవుతుంది.

Published : 05 Jun 2021 01:02 IST

సన్నాయి మేళాలు.. పన్నీటి జల్లులు.. పడుచుల కోలాహలం.. బంధువుల ఇంట్లో పెళ్లి సందడి భలేగా ఉంది. వీటన్నింటి మధ్యలో వీణానాదంలా నా గుండెను తాకిందో నవ్వు. తెల్ల చుడీదార్‌లో దేవకన్యలా మెరిసిపోతోంది ఆ నవ్వుని పుట్టించిన అమ్మాయి. ఎవరని ఫ్రెండ్‌ని అడిగా. ‘వెన్నెలరా! నాకు చెల్లి అవుతుంది. మనూరే! ఇప్పటిదాకా చూళ్లేదా?’ అన్నాడు. ఆరో తరగతి నుంచి నా చదువు హాస్టల్లోనే. పండక్కో, పబ్బానికో ఇంటికొస్తాను. పైగా వాళ్లిల్లు మాకు దూరం. ఇక చూసేదెలా? ఇప్పుడు తనూ గుంటూరులోనే చదువుతోందట. వాళ్ల కాలేజీ మాకు దగ్గరే. వాకబు చేసిన ఫ్రెండ్‌ ద్వారానే తనని పరిచయం చేసుకున్నా. ఇంజినీరింగ్‌లో ఒకే బ్రాంచ్‌ అయినా, తను నాకు జూనియర్‌. ఏ డౌట్స్‌ వచ్చినా అడగొచ్చని చెప్పా. ఫోన్‌ నంబర్లు బదిలీ అయ్యాయి. మా కబుర్ల ముందు పెళ్లి సందడి చిన్నబోయింది.
వీలైతే చాటింగ్‌, కుదిరితే ఫోన్‌ కబుర్లు నిత్యకృత్యమయ్యాయి. మాటల సందర్భంలో ఎన్నో విషయాలు తెలిశాయి. మా ఇద్దరి పొలాలు పక్కపక్కనే అని. తను తల్లిదండ్రులకి చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తుందని. ఏడెనిమిది నెలలు గడిచాక భయపడుతూనే ఐలవ్యూ చెప్పా. రెండు రోజుల తర్వాత ‘నువ్వంటే నాకూ ఇష్టమే.. కానీ, ప్రేమ పేరుతో ఓవర్‌ చేయటం, హద్దులు దాటడం నాకు నచ్చదు’ అంది. నా అభ్యర్థనను ఒప్పుకున్నందుకు పిచ్చ హ్యాపీ. తన పేరులోని వెన్నెల నా గుండె నిండా పరుచుకున్నట్టు అనిపించింది. జీవితం గురించి ఏవేవో ప్లాన్స్‌ వేసుకునేవాళ్లం.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈపాటికి ఆలుమగలం అయ్యేవాళ్లం. కానీ ఓ సంఘటన నా తలరాత మార్చేసింది. సంక్రాంతి సెలవుల్లో నాన్నతో కలిసి పొలం వెళ్లా. మిరప తోటకి నీళ్లు పెడుతున్నాం. ఏదో ఫోన్‌ వస్తే నాన్న ఇంటికెళ్లాడు. కాసేపటికి, ‘ఓయ్‌.. నీళ్లు పక్క పొలంలోకి పోతుంటే చూసుకోవా’ అని అటు నుంచి వెన్నెల నాన్న అరుచుకుంటూ వచ్చారు. ‘సారీ.. చూసుకోలేదండీ.. నాన్న ఇంటికెళ్లాడు’ అన్నాను. ‘నా పొలం పూతమీదుంది. అది రాలిపోతే ఎంత నష్టం. చేతగానోళ్లు చేతగానట్టు ఉండాలి. ఇలాంటి పనులెందుకు?’ అని అరుస్తూ మీదకొచ్చారు. నన్ను అంటే ఫర్వాలేదు.. మా నాన్ననీ చులకన చేసినట్టు అనిపించింది. ఆ క్షణం ఆవేశం ఆపుకోలేక ఆయన గుండెల మీద చెయ్యేసి వెనక్కి నెట్టాను. కిందపడ్డ ఆయన పైకి లేచి నా చెంప మీద కొట్టారు. ఏం చేస్తున్నానో తెలియని ఆవేశంలో నేనూ దవడ మీద బలంగా కొట్టాను. నోట్లోంచి రక్తం. తిడుతూ వెళ్లిపోయారు. విషయం తెలిసి మావయ్యతో కలిసి నాన్న వచ్చాడు. చేసిన పనికి నన్ను తిట్టాడు. ‘వాళ్లు కేసు పెడితే పిల్లాడి భవిష్యత్తు పాడవుతుంది. ముందు మనమే కేసు పెడితే బలంగా ఉంటుంది’ అన్నాడు మావయ్య. మరబొమ్మలా పోలీసు రిపోర్టు మీద సంతకం చేశాను. తర్వాత అరెస్టులు, ఊళ్లో గొడవలు, పెద్దల సలహాతో కేసు వాపస్‌ తీసుకోవటాలు... చాలా జరిగాయి. ఓరోజు వెన్నెల ఫోన్‌చేసి ‘నేను నీకు పడిపోయానని చులకన కదా! అందుకే మా నాన్న మీద చెయ్యి చేసుకున్నావ్‌. అసలు నువ్వు మనిషివేనా? జీవితంలో నీ ముఖం చూడను’ అని పెట్టేసింది. ఆ క్షణం ఏం జరిగిందో, ఎందుకలా చేశానో అని ఎన్నిసార్లు నచ్చజెప్పాలని చూసినా ఫలితం లేదు. నా ఫ్రెండ్‌తో చెప్పిస్తే ‘మా నాన్నని కొట్టిన వాణ్ని నా జీవితంలోకి ఎలా ఆహ్వానిస్తాను? లైఫ్‌లాంగ్‌ అదే గుచ్చదా?’ అందట. అప్పట్నుంచి మేం మళ్లీ కలుసుకోలేకపోయాం. తర్వాత తనకి హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఏదేమైనా నా తొందరపాటు, ఆవేశం ఇష్టపడిన అమ్మాయిని దూరం చేసింది. మరీ ముఖ్యంగా వయసుకి గౌరవం ఇవ్వకుండా పెద్దాయనపై చెయ్యి చేసుకున్నానన్న అపరాధ భావం వెంటాడుతోంది. ఇది చదివాకైనా నన్ను క్షమిస్తుందని ఆశిస్తున్నాను.                                                 

- సిద్ధు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని