ప్రాణంలా ప్రేమిస్తే.. పోకిరిని చేసింది

పరాకుగా ఫేస్‌బుక్‌ బ్రౌజ్‌ చేస్తున్నా. ఓ అమ్మాయి పేరు దగ్గర నా చూపు ఆగింది. తన ఇంటిపేరుతో ఇంటర్లో నాకో ఫ్రెండ్‌ ఉండేవాడు. ‘బావా బావా’ అంటూ నా వెనకాలే తిరిగేవాడు.

Updated : 26 Mar 2022 05:00 IST

​​​​​​

రాకుగా ఫేస్‌బుక్‌ బ్రౌజ్‌ చేస్తున్నా. ఓ అమ్మాయి పేరు దగ్గర నా చూపు ఆగింది. తన ఇంటిపేరుతో ఇంటర్లో నాకో ఫ్రెండ్‌ ఉండేవాడు. ‘బావా బావా’ అంటూ నా వెనకాలే తిరిగేవాడు. ఆ ఉత్సుకతతో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పెట్టా. వెంటనే ఓకే చేసింది. వాళ్లది మా పక్క ఊరే. పైగా నా స్నేహితుడి దగ్గరి బంధువు. హైదరాబాద్‌లో స్థిరపడ్డారట. చాటింగ్‌లో చాలా విషయాలు పంచుకుంది. కొద్దిరోజుల్లోనే మా మనసులు దగ్గరయ్యాయి.

అంతకుముందే అమ్మానాన్నలు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆమె పరిచయంతో నా జీవితంలోకి పెళ్లికూతురు నడిచొచ్చినట్టు అనిపించింది. బీటెక్‌ పూర్తవగానే పెద్దల ఆమోదంతో ఒక్కటవ్వాలనుకున్నాం. కానీ ఎలా? నా ఫ్రెండ్‌ని రాయబారం నడపమన్నా. ‘మా కుటుంబాల మధ్య గొడవలున్నాయి. నేను తలదూర్చలేను’ అన్నాడు. అవకాశం కోసం ఎదురుచూడసాగా. ఇంతలో తనో ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది. ‘ఇంతకుముందే నీ సంబంధం వచ్చింది. నువ్వు ఎక్కడో దూరంగా సరిహద్దుల్లో పని చేస్తావని నాన్న వద్దన్నారు’ అంది. ఆ మాటతో మ్రాన్పడిపోయా. ‘అయినా ఫర్లేదు.. ఏదోలా మా వాళ్లని ఒప్పిస్తా. లేదంటే నీతో వచ్చేస్తా’ అనడంతో ధైర్యమొచ్చింది.

ఫోన్‌కాల్స్‌, చాటింగ్‌తో రోజురోజుకీ మా సాన్నిహిత్యం పెరుగుతోంది. ఇంక ఆలస్యం చేయకుండా అమ్మానాన్నలతో వెళ్లి సంబంధం మాట్లాడాలనుకుంటున్నా. ఈలోపే తన ఫోన్‌. ‘నన్నడక్కుండానే మా వాళ్లు ఓ సంబంధం ఫిక్స్‌ చేశారు. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరట’ అంటుంటే నా గుండెలదిరిపోయాయి. మీ ఇంటికొస్తానంటే వద్దంది. వాళ్లని ఒప్పించే పూచీ నాదని భరోసా ఇచ్చింది. ఈలోగా అమ్మకి అనారోగ్యం. సెలవుపెట్టి ఊరెళ్లాను. తిరిగి వెళ్లేటప్పుడు హైదరాబాద్‌లో దిగాను. అంతదూరం నుంచి వచ్చినా కలవడం కుదరదంది. బాగా బతిమిలాడితే రైల్వేస్టేషన్‌కి వచ్చింది. పదిహేను నిమిషాలు అన్నీ మాట్లాడుకున్నాం. అప్పుడూ మన పెళ్లి జరిగి తీరుతుందని నమ్మకంగా చెప్పింది.

రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో పోరు ఎక్కువైంది. ఇక తప్పేలా లేదని నా ప్రేమ విషయం అమ్మకి చెప్పేశా. ఒక మధ్యవర్తితో సంబంధం కోసం వాళ్లతో మాట్లాడిందట. మర్నాడే వాళ్ల నాన్న నాకు ఫోన్‌ చేశారు. ప్రేమ పేరుతో నా కూతురిని వేధిస్తున్నావంటూ తిట్టారు. ‘ఇరవై వేల జీతంతో బోర్డర్లో చచ్చే నీకు నా కూతురు కావాలా?’ అని కోపంతో ఊగిపోయారు. ఊళ్లో నా గురించి తప్పుడు ప్రచారం చేయించారు. ఎక్కడో ఏదో తేడా జరిగిందని అర్థమైంది. వెంటనే తనకి కాల్‌ చేశా. నెంబర్‌ కలవలేదు. గతంలో నమ్మకంతో నా ఫేస్‌బుక్‌, ఈమెయిల్‌.. పాస్‌వర్డ్‌లన్నీ తనకిచ్చేశా. వాటిలో మా చాటింగ్‌ హిస్టరీ మొత్తం చెరిపేసింది. అప్పుడుగానీ అర్థం కాలేదు.. నేను దారుణంగా మోసపోయానని.

సైన్యంలో పని చేస్తున్నానని ఊరిలో నాకు గౌరవం ఉండేది. ఇప్పుడు పోకిరిలా మిగిలిపోయా. తన వంచన కన్నా ఊరిలో పరువు పోయిందనే బాధే ఎక్కువైంది. పక్క ఊరిలోనే ఉన్న ఆమె పెద్దనాన్న దగ్గరికెళ్లా. మా ప్రేమ, గంటలకొద్దీ మాట్లాడుకున్నది కాల్‌ లిస్ట్‌లో చూపించా. ఆయన నమ్మారు. తమ్ముడితో మాట్లాడతానన్నారు. ఇంత జరిగినా ఆ అమ్మాయిపై కోపం రాలేదు. తను సొంతమవుతుందనే ఆశ చావలేదు. వాళ్ల పెదనాన్న అయినా మమ్మల్ని కలుపుతారనుకున్నా. కానీ విధుల్లోకి వెళ్లిన కొద్దిరోజులకే నా స్నేహితుల నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి కుదిరిందనీ. అదీ తను సంతోషంగా ఒప్పుకుందని.

నేను విఫల ప్రేమికుడినై తొమ్మిదేళ్లు గడిచాయి. తను ఎందుకలా ప్రవర్తించిందో ఇప్పటికీ అర్థం కాదు.. తను నన్ను నవ్వించేది.. కవ్వించేది.. దక్కదేమో అనుకున్న ప్రతిసారీ నేను నీ సొంతం అని ఆశలు పెంచేది. చివరికి ఒక్కసారిగా మాట మార్చి నన్ను దోషిని చేసింది. నా వ్యక్తిత్వాన్ని నవ్వులపాలు చేసింది. నీ జీతం, స్థాయి తక్కువని చెప్పినా సర్దుకుపోయేవాణ్ని. పెద్దలు ఒప్పుకోవడం లేదంటే నా దురదృష్టం అనుకునేవాణ్ని. కానీ తేనె పూసిన కత్తిలాంటి మాటలతో నా గుండె కోస్తుందని తెలుసుకోలేకపోయా.

- ఓ సైనికుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని