Updated : 02 Jul 2022 06:57 IST

నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!

రెండు మనసులు.. రెండు కుటుంబాలే కాదు.. ఒక్కోసారి మంచి మనసున్న మిత్రుడు అండగా ఉంటేనే రెండు జీవితాలు నిలబడతాయి.

లంచ్‌ చేసి సహోద్యోగులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నా. ‘హాయ్‌.. మీరు మనీషా ఫ్రెండ్‌ కదూ.. తను మీ గురించి ఎప్పుడూ చెబుతుంటుంది. నేనూ మీతో ఓసారి మాట్లాడా.. గుర్తు పట్టారా?’ ఒకతను నా ముందుకొచ్చి లొడలొడా వాగుతున్నాడు. పైగా మాస్క్‌ ఒకటి. నా ముఖంలో అయోమయం, చిరాకు గమనించాడేమో.. ‘జీవితం, కరోనాకి ముందు.. కరోనా తర్వాతలా తయారైంది’ అంటూ మాస్కు తీసి ఓ నవ్వు నవ్వాడు. అప్పుడు వెలిగింది లైటు. తను కుమార్‌. మూడేళ్ల కిందట ఓ ఇనిస్టిట్యూట్‌లో పరిచయం. ప్రతి మాటకీ, సందర్భానికీ.. సినిమా డైలాగులు జోడించి జోకులు పేల్చేవాడు. కనికట్టు చేసినట్టు అందర్నీ తనచుట్టూ తిప్పుకునేవాడు. అలాంటి తను మా ఆఫీసులోనే చేరడం నాకు హ్యాపీ.
ఆరోజు ఉమెన్స్‌ డే. పొద్దునే శుభాకాంక్షలు చెప్పి ‘నువ్వు డ్రాయింగ్స్‌ బాగా వేస్తావటగా.. వాటిని చూసే భాగ్యం నాకెప్పుడు కలుగుతుంది?’ అన్నాడు. నా క్లిప్స్‌ మొత్తం చూపించా. ‘వావ్‌.. చూడ్డానికి మామూలుగా ఉంటావుగానీ, నువ్వో కళాకారిణివి. నిన్నెవరు పెళ్లి చేసుకుంటారోగానీ అదృష్టవంతుడు’ అంటుంటే పొంగిపోయా.
కుమార్‌ది సాయం చేసే గుణం. తనవాళ్ల కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. తను పెళ్లి మాటెత్తగానే నాక్కొంచెం ధైర్యం కలిగింది. క్లాస్‌మేట్‌ దినేష్‌తో నా ప్రేమ కథనంతా వివరించా. ఇంట్లోవాళ్లు మా ప్రేమను అంగీకరించే పరిస్థితి లేదు. నువ్వే సాయం చేయాలన్నా. ‘మీ అమ్మానాన్నల్ని ఒప్పించి, మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది’ అంటూ అభయమిచ్చాడు. మా ఖర్మకొద్దీ ఈలోపే కరోనా లాక్‌డౌన్‌ వచ్చిపడింది. వర్క్‌ఫ్రమ్‌ హోం మొదలైంది. దినేష్‌ని కలవడం తగ్గింది. నా ఫోన్‌కాల్స్‌, చాటింగ్‌ మావాళ్లు పసిగట్టారు.. నిలదీశారు. దినేష్‌నే పెళ్లాడతానన్నా. వేరే కులమంటూ తిట్టారు. ఇంట్లోనే బంధించారు. వేరే సంబంధం తెచ్చారు. పద్నాలుగేళ్ల ప్రేమ వదులుకోవడం ఇష్టం లేదు. అయినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఆ సమయంలో కుమార్‌కి ఫోన్‌ చేశా. కలవలేదు. ఊరెళ్లాడని స్నేహితులు చెప్పారు. ఈలోపు లాక్‌డౌన్‌ ఎత్తేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆఫీసు తెరిచారని అబద్ధం చెప్పి ఇంట్లోంచి బయటపడ్డా. ఓ ఫ్రెండ్‌ గదిలో తల దాచుకున్నా. కరోనా పీక్‌ స్టేజ్‌కి చేరడంతో నా దగ్గరికి రావడానికి ఎవరూ సాహసం చేయలేదు. మరోవైపు పేరెంట్స్‌ నన్ను వెతుకుతున్నారని తెలిసింది. ఒంటరి అయిపోయాననే బాధ ఉండేది. ఆ సమయంలో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు కుమార్‌. ‘నువ్వు ఇష్టపడ్డవాడితో పెళ్లి చేస్తానని గతంలో మాటిచ్చా. దాన్ని తప్పను’ అని ధైర్యం చెప్పాడు. రక్త సంబంధీకులు కాదనుకున్న వేళ.. పెద్దలా మారి మా పెళ్లి జరిపించాడు. మేం కుదురుకునేదాకా తోడున్నాడు.
కాలం కరిగేకొద్దీ పంతాలు, పట్టింపులు సడలిపోతాయంటారు. మా విషయంలో అదే జరిగింది. అమ్మానాన్నలూ కరిగిపోయారు. మాపై కోపం తగ్గి.. నన్ను దూరం చేసుకోలేక.. ఇంటికి రమ్మన్నారు. ఇలాంటి రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు మాకో పాప. జీవితం జాలీగా గడిచిపోతోంది. కానీ మా జీవితాన్ని నిలబెట్టిన కుమార్‌ జాడ లేదు. ‘ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లో ఉంది. ప్రేమికులందరికీ మీరు రోల్‌మోడల్స్‌లా ఉండాలి’ అని తను చెప్పిన మాటలే చివరివి. స్నేహితుల ద్వారా ప్రయత్నించినా కాంటాక్ట్‌ దొరకలేదు. ఉద్యోగం మానేశాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఆ స్నేహితుడే లేకపోతే... నేను ప్రేమించినవాడు నా మనసులోనే ఉండేవాడు.. నా జీవితంలో కాదు. ‘కుమార్‌.. ఇప్పుడున్న నా జీవితం, ఆనందానికి నువ్వే కారణం.. ఇది చెప్పాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఎక్కడున్నా ఒక్కసారి స్పందించు’.         

 - రాజీ


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని