నువ్వేమి చేశావు నేరం..నిన్నెక్కడంటింది పాపం!

దసరా అంటే సెలవులు.. సంతోషాలు.. పిండివంటలు.. స్నేహితులతో బాతాఖానీ. ఇప్పుడో? ఆ పండగ గుర్తొస్తేనే నా కంట చెమ్మ చేరుతుంది.

Updated : 16 Jul 2022 07:13 IST

దసరా అంటే సెలవులు.. సంతోషాలు.. పిండివంటలు.. స్నేహితులతో బాతాఖానీ. ఇప్పుడో? ఆ పండగ గుర్తొస్తేనే నా కంట చెమ్మ చేరుతుంది.

విజయదశమికి ముందు. మా గ్యాంగ్‌ అంతా ఊరి బయటకి చేరాం. అక్కడో పెద్ద చింత తోపు. ఆ చెట్ల కింద విశాలమైన స్థలం. అక్కడే క్రికెట్‌ మొదలెట్టాం. బౌలింగ్‌కి సిద్ధమవుతుంటే.. ఘల్లుఘల్లుమంటూ పట్టీల శబ్దం. ఆ వైపు చూశా. కోటేరు ముక్కు.. నక్షత్రాల్లాంటి కళ్లు.. వాలుజడతో ఓ అమ్మాయి. తనని చూడగానే నా గుండె జారిపోయింది. అలా నోరెళ్లబెట్టి ఉండగానే నన్ను దాటుకుంటూ వెళ్లిపోతోంది. ‘అబ్బా.. ఫిదాలో సాయిపల్లవిలా భలే ఉంది కదరా’ అప్రయత్నంగానే నా నోట్లోంచి వచ్చిందామాట. తనకి వినపడిందేమో. వెనక్కి తిరిగి కొరకొరా చూసింది.. ఆ వెంటనే ముఖంలో చిరునవ్వు. ఆ నవ్వు తనతోపాటు నా మనసునీ లాక్కెళ్లిపోయింది. ఆ రాత్రి కళ్లు మూసినా, తెరిచినా తన రూపమే. ఆలోచనలతో నిద్ర పడితే ఒట్టు. తనెవరు? ఎవరింటికొచ్చింది? మళ్లీ కనిపిస్తుందా? సవాలక్ష సందేహాలతో ఏ తెల్లవారుజామునో రెప్ప వాలింది.
‘ఏమండీ.. నేను ఆ ఎదురింటికొచ్చా. మా పిన్ని మిమ్మల్ని కొద్దిగా పచ్చిమిర్చి అడిగి తీసుకురమ్మంది’ ఓ కోయిల స్వరంతో నిద్రాభంగమైంది. కళ్లు నులుముకొని చూస్తే.. ఆ అప్సరసే. నైట్‌డ్రెస్‌లో ఆధునికంగా ఉంది. వెళ్లిపోతుంటే వెనకాలే పరుగెత్తుకెళ్లి ‘హాయ్‌.. రాజేష్‌ వాళ్లింటికొచ్చారా. వాడు నా బెస్ట్‌ఫ్రెండ్‌ తెలుసా’ అన్నా. నా మాట తడబడటం చూసి నవ్వు ఆపుకుంటూ ‘ఓహో అలాగా.. తను మా అన్నయ్య’ అంటూ తుర్రుమంది.
ఏదో అవసరం కల్పించుకొని మరీ వాళ్లింట్లో దూరేవాణ్ని. వెళ్లగానే నా కళ్లు తన కోసం వెతకడం.. గమనిస్తూనే ఉండేది. నేనెందుకొచ్చానో వాళ్లకి చెప్పలేక గాబరా పడుతుంటే నవ్వుకునేది. మూడోరోజు.. రాజేష్‌ ఇంట్లో లేడని తెలిసే వెళ్లా. హాలులో కూర్చొని టీవీ చూస్తోంది. ‘ఏంటి పాపం.. మీ ఊళ్లో అమ్మాయిలే లేరా. అసలు అమ్మాయిలతో తమరెప్పుడూ మాట్లాడలేదా?’ పలకరిద్దామనుకునేలోపే అటాక్‌ మొదలెట్టింది. ఏమనాలో తెలీక నేలచూపులు చూడసాగా. ‘క్రికెట్‌ ఆడేటప్పుడు నన్ను కామెంట్‌ చేయడం.. మాటికిమాటికీ ఇక్కడికి రావడం.. ఏంటీ ఫాలోయింగా?’ దబాయించింది.. చెమట్లు పట్టాయి. లోపలకి తొంగి చూస్తే ఎవరూ లేరు. కొంచెం ధైర్యమొచ్చింది. ‘ఔనుమరి.. మీరసలే ఏంజెల్‌లా ఉన్నారు. నేనేం చేయను? పర్మిషన్‌ లేకుండానే నా కళ్లు, కాళ్లు ఇటువైపు వచ్చేస్తుంటే’ నా మాటకి నవ్వింది. దాంతో వణుకు పోయి ఒంట్లో హుషారు మొదలైంది. తనూ బీటెక్‌ ఫైనలియర్‌ అట. సిటీలో ఉంటామంది. పదిరోజులు మంచులా కరిగిపోయాయి.
తనెళ్తుంటే నన్ను నేను వదిలేస్తున్నట్టే బాధ అనిపించింది. ఆ బాధని తగ్గించుకోవడానికి అప్పుడప్పుడు సిటీకెళ్లేవాణ్ని. తన కాలేజీనో, ఏ రెస్టరెంటో మా అడ్డాగా మారేది. కొన్ని తీపి జ్ఞాపకాల్ని మూట కట్టుకొని తిరిగొచ్చేవాణ్ని. మా పరిచయమైన ఎనిమిది నెలలకు వేలంటైన్స్‌ డే వచ్చింది. ముందురోజు రాత్రే బైక్‌పై బయల్దేరా. అర్థరాత్రి 12కి తనముందు నిల్చున్నా. చేతిలో ఎర్ర గులాబీ పెట్టి నా మనసుని తనముందు పరిచా. ‘ఇది ముందే ఊహించా. కానీ.. గతంలో నాకో అబ్బాయి ప్రపోజ్‌ చేశాడు. నేనూ ఓకే చెప్పా. కొన్నాళ్లు బాగానే ఉన్నాం. తనకి అనుమానం. వేగలేక బ్రేకప్‌ చెప్పేశా. ఇప్పుడూ ఓకేనా?’ అన్న తన ప్రశ్న నా ప్రేమకి అడ్డు పడేంత విషయం కాదనిపించింది. మోకాళ్లపై కూర్చొని ‘ఐ లవ్యూ’ చెప్పా. సిగ్గులమొగ్గవుతూ తనూ చేయందించింది. చదువైపోగానే ఇద్దరికీ ఉద్యోగాలొచ్చాయి. తనకి బెంగళూరులో, నాకు పుణెలో. మామధ్య దూరం పెరిగాక మనసులు మరింత దగ్గరయ్యాయి. నెలకోసారి హైదరాబాద్‌లో కలుసుకునేవాళ్లం. ఇద్దరింట్లో అభ్యంతరం లేదు. మంచిరోజులు చూసి ముహూర్తం పెట్టిస్తామన్నారు.  
2020 జనవరి. ఇద్దరం హైదరాబాద్‌ బదిలీ ప్రయత్నాల్లో ఉన్నాం. అప్పుడేమైందో తెలియదు.. సడెన్‌గా నాతో మాట్లాడ్డం మానేసింది. నెంబర్‌ పని చేయదు. ఆన్‌లైన్‌కి రాదు. ప్రయత్నించి విసిగిపోయా. నెలయ్యాక నేరుగా వాళ్లింటికెళ్లా. అంతకుముందే ఫ్లాట్‌ ఖాళీ చేసి వెళ్లిపోయారన్నారు. జాబ్‌ కూడా మానేసిందట. తన జాడ తెలియక పిచ్చెక్కిపోయేది. లాంగ్‌లీవ్‌ పెట్టి ఊరొచ్చేశా. పరుగున వెళ్లి రాజేష్‌నడిగా. నాకూ ఏం తెలియదన్నాడు. ఖాళీగా ఉంటే ప్రతిక్షణం తనే గుర్తొచ్చేది. కొన్నాళ్లకి తాగుడు అలవాటైంది. గెడ్డం గీసుకోవడం మానేశా. అమ్మానాన్నలు బాధ పడసాగారు. ఆ పరిస్థితుల్లో రాజేష్‌ నా దగ్గరికొచ్చాడు. ఎందుకిలా అయ్యావని తిట్టాడు. వాడ్ని పట్టుకొని మీ చెల్లి మోసం చేసిందిరా అని ఏడ్చేశా. అప్పుడు చెప్పాడు నా గుండె పగిలే విషయం. ఆఫీసులో తను సహోద్యోగులతో సన్నిహితంగా ఉండేదట. ఓసారి ఓ ఇద్దరితో పార్టీ చేసుకుంటుంటే.. వాళ్లు బలవంతంగా మద్యం తాగించారు. తర్వాత అబ్బాయి తనపై అఘాయిత్యం చేశాడట. పక్కనే ఉన్న మరో అమ్మాయి ఉద్యోగి వీడియో తీసిందట.  ఆ సంఘటనతో నా ప్రియనేస్తం డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. విషయం తెలిస్తే నేను బాధ పడతానని దూరం పెట్టిందట. ఇదంతా విన్నాక నా కన్నీటి ప్రవాహానికి అంతే లేకుండా పోయింది. అయినా ఫర్వాలేదు తనని అక్కున చేర్చుకుంటానని చిరునామా అడిగా. ఉద్యోగం మానేసి యూఎస్‌ వెళ్లిపోయిందని చెప్పాడు. అక్కడే పార్ట్‌టైం జాబ్‌ చేస్తూ సైకాలజీ కోర్సు చేస్తోందట.
‘జో.. నిన్ను చూడగానే నా దానివి అనుకున్నా. ఏ కల్మషం లేకుండా నీ గతం చెప్పి నీపై మరింత ప్రేమ పెరిగేలా చేశావు. కానీ తర్వాత నువ్వు చేయని పాపానికి నీలో నువ్వే కుమిలిపోతూ నన్నూ బాధల అగాధంలోకి నెట్టేశావు. ఇప్పటికీ నీ చేయందుకోవడానికి నేను సిద్ధం. నీ చిరునవ్వు నాకు కావాలి. ఒక్కసారి నాతో మాట్లాడు.. ప్లీజ్‌.                           

 - విజయ్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని