Updated : 27 Aug 2022 07:54 IST

ఆమె.. ఓ కన్నీటి జ్ఞాపకం

ఏంటీ.. అన్ని వివరాలూ అడుగుతున్నావ్‌. కొంపదీసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏంటి?’ విజ్జీ మాటతో బిత్తరపోయా. తను ఆఫీసులో చేరి వారమైంది. ఎప్పుడు చూసినా మూడీగా ఉండేది. అప్పుడప్పుడూ మాట కలిపి తన పెదాలపై చిరునవ్వులు పూయించాలని నా కోరిక. తనేకాదు.. నా చుట్టూ ఎవరు బాగా లేకపోయినా నాకు నచ్చదు. ఆ ఆలోచనల్లో ఉండగానే ‘సీరియస్‌గా అడుగుతున్నా. నిజంగానే చేసుకుంటావా?’ మరోసారి రెట్టించింది. ఏమనాలో తెలియక నవ్వుతూ అక్కడ్నుంచి కదిలా. తర్వాత కూడా నన్ను చూసినప్పుడల్లా తన కళ్లలో ఓ మెరుపు కదలాడేది.

‘ఏంటి ఆ అమ్మాయితో క్లోజ్‌గా ఉంటున్నావు. తను మన ఓనరు బంధువనే విషయం తెలుసా?’.. సీనియర్‌ హెచ్చరికతో నా గుండెలో రాయి పడింది. నాకు ఈ ఉద్యోగమే ఆధారం. అది ఊడితే అధోగతే. తనతో చొరవగా ఉన్నమాట నిజం. అదీ తను నాపై ఆసక్తి చూపించడం వల్లే. కానీ ఆమె ఓనరు బంధువని తెలియగానే గప్‌చుప్‌గా సైడైపోవాలనుకున్నా. తన పేరు వెనక కొత్తగా ‘గారూ’ చేర్చి పిలవడం మొదలుపెట్టా. అవసరమైతే తప్ప విజ్జీ క్యాబిన్‌వైపు వెళ్లడం మానేశా. సడెన్‌గా నా తీరు మారేసరికి తను గోల పెట్టింది. ‘తమాషా చేస్తున్నావా? ఎప్పట్లాగే ఉండకపోతే నీ వీపు పగిలిపోద్ది’ అని బెదిరించింది. ఆ క్షణం ‘ఊ’ కొట్టినా తనని తప్పించుకొనే తిరగసాగా.

కొన్నాళ్లయ్యాక అర్జెంటు పని మీద ఊరెళ్లా. ఐదురోజులయ్యాక వచ్చా. నేను కనపడగానే ‘ఏంట్రా ఎక్కడికెళ్లావ్‌? వెళ్తే చెప్పాలనే ఇంగితజ్ఞానం లేదా? పదా’ అంటూ దాదాపు బయటికి లాక్కెళ్లినంత పని చేసింది. కేఫ్‌లో ఓ మూలన కూర్చున్నాం. నిమిషంపాటు ఇద్దరి మధ్యా మౌనం. రెండు కన్నీటి చుక్కలు రాల్చాక.. మెల్లగా గొంతు విప్పింది. ‘సిద్ధూ క్లాస్‌మేటే కాదు.. నా సోల్‌మేట్‌ కూడా. చాలా తెలివైనోడు. బీటెక్‌లోనే భారీ జీతంతో జాబ్‌ కొట్టాడు. ఇంట్లోవాళ్లు మా పెళ్లికి ఒప్పుకుంటారనుకున్నా. కులం, ఆస్తిపాస్తులని నసిగారు. నేను తగ్గకపోవడంతో ముహూర్తం పెట్టిస్తామన్నారు. కానీ ఓ పదిరోజులయ్యాక సిద్ధూ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. అది మావాళ్లే చేయించారని నా అనుమానం’ అంటూ మరోసారి కళ్లు తుడుచుకుంది. నా మనసంతా ఏదోలా అయిపోయింది. తన గుండెలో ఇంత విషాదం ఉందనుకోలేదు. ‘అన్నట్టు తనదీ నీలాగే ఎడమ చేతివాటం. క్రాఫ్‌ అయితే మీ ఇద్దరివీ సేమ్‌. నిన్ను చూస్తుంటే తనని చూసినట్టే ఉంటుంది. అందుకే నువ్వు నాకు స్పెషల్‌’ తేరుకొని ఉత్సాహంగా అంది. అప్పుడర్థమైంది తను నాపై చూపించే అభిమానానికి కారణమేంటో.

ఆరోజు ఆఫీసు పనిలో తలమునకలై ఉన్నా. నా దగ్గరికొచ్చి చేయి పట్టుకొని ప్యాంట్రీకి తీసుకెళ్లింది విజ్జీ. అక్కడెవరూ లేరు. ఏమైందని అడుగుతుండగానే నన్ను గట్టిగా కౌగిలించుకుంది. ఓ పది క్షణాలు అలాగే ఉంది. మేం విడివడ్డాక నా పెదాలపై ముద్దు పెట్టి, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయింది. నాకు షాక్‌. సాయంత్రం మెసేజ్‌ పంపింది. ‘మా పేరెంట్స్‌ సంబంధాలు చూస్తున్నారు. నా మనసులో ఇప్పటికీ సిద్ధూనే ఉన్నాడు. నన్ను ప్రేమించిన పాపానికి తను బలయ్యాడు. వేరొకర్ని పెళ్లాడి తన ఆత్మని మోసం చేయలేను. ఇంక నేను నీకు కనపడను. సెలవ్‌’ అన్నది సారాంశం. తన ఆలోచనలతో ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మరుసటి రోజు నుంచే విజ్జీ కనుమరుగైంది. రోజులు.. నెలలు కరిగి ఏడాదిన్నరైంది. అసలు ఉందో, లేదో తెలియదు. వాళ్ల అమ్మానాన్నలూ వెతికివెతికి అలసిపోయారు.
ప్రేమలో ఇంత గాఢత ఉంటుందా? ప్రేమించుకుంటే తమని తామే అర్పించుకోవాలా? ఇవన్నీ ఇప్పటికీ నాకు సమాధానం దొరకని ప్రశ్నలే. ఏదేమైనా.. విజ్జీ గుర్తొచ్చినప్పుడల్లా అప్రయత్నంగానే నా కళ్లు తడి అవుతాయి. మనసు మూగగా రోదిస్తుంది.

 - ఓ పాఠకుడు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts