వయసు చూపి.. మనసు విరిచేశావు..

‘ఆర్‌ యూ మిస్టర్‌ ప్రవీణ్‌?’ పొద్దునే ఓ కోకిల స్వరం నా గుండెను మీటింది. ఎవరై ఉంటారబ్బా.. అనే ఆలోచనలో పడిపోయా. ‘హలో.. ప్రవీణ్‌ గారేనా...’ మళ్లీ రెట్టించడంతో  ఈ లోకంలోకి వచ్చి పడ్డా.

Updated : 10 Sep 2022 07:51 IST

‘ఆర్‌ యూ మిస్టర్‌ ప్రవీణ్‌?’ పొద్దునే ఓ కోకిల స్వరం నా గుండెను మీటింది. ఎవరై ఉంటారబ్బా.. అనే ఆలోచనలో పడిపోయా. ‘హలో.. ప్రవీణ్‌ గారేనా...’ మళ్లీ రెట్టించడంతో  ఈ లోకంలోకి వచ్చి పడ్డా. వాళ్ల సంస్థ నిర్వహించే ఆన్‌లైన్‌ కోర్సులో చేరమంటూ అడిగిందా కోయిల. మళ్లీమళ్లీ వినాలపించే ఆ గొంతు కోసమే కోర్సులో చేరిపోయా. రిజిస్ట్రేషన్‌ అప్పుడు ఏవేవో సమస్యలు తలెత్తేవి. తను లైన్‌లోకి వచ్చేది. ఓపిగ్గా వివరిస్తూ పరిష్కరించేది. తన మాట నన్ను చేరితే మనసు మబ్బుల్లో తేలిపోయేది. రోజూ సమస్య వస్తే బాగుండని ప్రార్థించేవాణ్ని.

కొద్దిరోజులకే మేం పరిధులు దాటి పర్సనల్‌ విషయాలు పంచుకునేదాకా వచ్చేశాం. అర్ధరాత్రుళ్ల దాకా చాటింగ్‌.. వారాంతాల్లో వాయిస్‌ కాల్స్‌ పరిపాటైంది. నా ఆతృత, గాబరా, ఆనందం.. కనిపెట్టేసిందేమో.. ‘నువ్వు అందరిలాంటివి అబ్బాయివి కాదు. ఏం చెప్పినా వింటావు. నిన్ను ప్రోత్సహించడానికే నీతో మాట్లాడుతున్నా’ అందోసారి. నన్ను హద్దుల్లో ఉండాలి అని చెప్పడానికా.. అన్నట్టు. అయినా నా పట్ల తను తీసుకుంటున్న కేరింగే కనిపించేది. ఆమె తీయని మాటలకి ఓ అందమైన రూపాన్ని ఊహించుకొని ఆరాధిస్తుండేవాణ్ని.

ఆమెని కలవాలని, పక్కనే కూర్చొని కబుర్లు చెప్పాలని ఉబలాటంగా ఉండేది. అదే అడిగితే.. పనిలో ఉన్నానని బదులిచ్చేది. నాకేమో ఆరాటం రోజురోజుకీ ఎక్కువయ్యేది. ‘సరే ఎలాగూ నీకు కుదరడం లేదు కదా.. కనీసం చిరునామా అయినా ఇవ్వు. నేనే వచ్చి కలుస్తా’ అన్నానోసారి. ‘ఏదో ఒకరోజు సర్‌ప్రైజ్‌ ఇస్తూ నేనే నీ ముందుంటాలే’ అంది నవ్వుతూ. నెలలు గడిచాయిగానీ ఆ రోజు రాలేదు. ఇంక నావల్ల కాలేదు. ‘కలవడం మాట అలా ఉంచు. అసలు విషయం ఏంటంటే.. నీ మాటల్లో తీయదనం, మనస్తత్వం, కేరింగ్‌.. అన్నీ నాకు నచ్చాయి. అవి జీవితాంతం కావాలి. నా చేయి అందుకుంటావా?’ అన్నానోసారి సూటిగా. మౌనమే తన సమాధానం. అది అంగీకారమని మురిసిపోతుండగానే ‘నువ్వు నాకన్నా మూడేళ్లు చిన్న. నిన్నెప్పుడు ప్రేమ ఉద్దేశంతో చూడలేద’ంటూ బాంబు పేల్చింది. అమ్మాయి వయసులో పెద్దదైతే కలిసి జీవించడానికి అడ్డేముంది? ఆ మాటకొస్తే సచిన్‌ కన్నా అంజలి, విరాట్‌కన్నా అనుష్క పెద్దవాళ్లేగా! ఇదే వాదిస్తే ఫోన్‌ కట్‌ చేసి, బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అమ్మ తర్వాత నాపై అంత ఆదరణ, ఆపేక్ష చూపించింది తనే. అలాంటి తనని వదులుకోవడం నాకిష్టం లేదు. ఆన్‌లైన్‌లో ‘సారీ’ అని మెసేజ్‌ పెట్టా. నేనూహించినట్టే క్షమించేసింది. మాటలు మళ్లీ జోరందుకున్నాయి. కొన్నాళ్లయ్యాక మరోసారి పాత పాటే పాడా. ‘ఒక్కసారి చెబితే అర్థం చేసుకోవా? అయినా నీ కంటే ముందే నా లైఫ్‌లో మా మావయ్య ఉన్నాడు. అతడినే పెళ్లి చేసుకుంటా’ అని హెచ్చు స్వరంతో అంటుంటే నా కళ్లు జలపాతాలే అయ్యాయి.

తను నాకు దక్కదని తేలిపోయింది. ఒంటరినయ్యాననే బాధ. నాలో నేనే కుమిలిపోయేవాణ్ని. ఆ విషయం తెలిసిందేమో. ‘నువ్వు నాకన్నా చిన్నవాడివి. కాకపోయుంటే మరో రకంగా ఆలోచించేదాన్నేమో..’ కొద్దిరోజులయ్యాక తన నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. జతగా కన్నీటి చుక్క ఎమోజీ. అంటే.. బహుశా నేనంటే తనకీ ఇష్టమే. కాకపోతే నా వయసే తనకి అడ్డంకి అయ్యింది. ఏదేమైనా ఆ మెసేజ్‌ నాకు ఓదార్పులా పని చేసింది. ఆ బాధ నుంచి బయటపడి తన అభిప్రాయాన్ని ఎలా మార్చాలా అని ఆలోచిస్తుండగానే వాట్సప్‌లో శుభలేఖ పంపింది. అంతటితో నా ఆశలు అడుగంటిపోయాయి. నా దరిద్రం ఏంటంటే.. ఆఖరికి తన పెళ్లికి కూడా వెళ్లలేకపోయా. అప్పుడు లాక్‌డౌన్‌ సమయం. కొద్దిమంది అతిథులకే అనుమతి ఉండటంతో కనీసం తనని చూడాలనే చివరి కోరిక కూడా నెరవేరలేదు. పెళ్లయ్యాక ‘ఉద్యోగం మానేసి వెళ్తున్నా. బహుశా జీవితంలో మనం కలుసుకోలేమేమో’ అని తను పంపిన సందేశమే ఆఖరిది.

పక్కవాళ్లనే పట్టించుకోని ఈ సమాజంలో.. ఎక్కడో ఉంటూ నన్ను తన పక్కనే ఉన్నట్టు, తన సొంతమన్నట్టు కనికట్టు చేసింది. చిత్రంగా మనసుకి దగ్గరై.. ఒక అపరిచితురాలిలాగే మిగిలిపోయింది. తన ప్రేమ ఉద్యోగానికి నా వయసు అర్హత సరిపోదనే ఒక సిల్లీ నిబంధన విధించడమే నా బ్యాడ్‌లక్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని