Updated : 19 Nov 2022 07:09 IST

మా గెలుపు.. మీ భిక్ష

మనసులో మాట

బస్సెక్కి కూర్చున్నాకగానీ తెలియలేదు పర్సు ఖాళీగా అయిందని. ఇంతలో కండక్టర్‌ రానే వచ్చాడు. ‘సర్‌.. నా దగ్గర డబ్బుల్లేవు. ఫోన్‌పే లేదా గూగుల్‌పే చేస్తా. ఫర్లేదా..?’ నా మాటకి వింతగా చూశాడు. నేను అయోమయంగా అటూఇటూ చూస్తుండగా ‘ఫర్లేదండీ.. తన టికెట్‌ నేను తీసుకుంటాను’ అంది పక్కసీట్లోని అమ్మాయి. కృతజ్ఞతగా ఆమెవైపు చూశా. కళ్లతోనే నవ్వింది.
బస్సు కదిలింది. మా పరిచయ కార్యక్రమం మొదలైంది. ‘నా పేరు శ్రీ. వైద్యారోగ్య శాఖలో పని చేస్తా’ అంది. ‘నేను శ్యాం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ని’ గొప్పగా పరిచయం చేసుకున్నా. గుంటూరు నుంచి హైదరాబాద్‌ వచ్చేలోపు బస్సు నాలుగైదుచోట్ల ఆగిందిగానీ.. మా మాటలకు బ్రేక్‌ పడలేదు. తన ఒద్దికైన రూపం, తీయని స్వరం, మాటల్లో హుందాతనం.. నన్నాకట్టుకున్నాయి. ‘మంచీచెడూ పంచుకోవడానికి మీలాంటి ఫ్రెండ్‌ ఉంటే బాగుండు’ అన్నా బస్సు దిగుతున్నప్పుడు. నా భావం అర్థం చేసుకుంది. ఒక పేపరుపై ఫోన్‌నెంబర్‌ రాసిచ్చింది. ఏదో సాధించానన్న ఫీలింగ్‌. ఆ సాయంత్రమే తనకి ఫోన్‌ కలిపా. అటునుంచి నుంచి తేనెల జల్లు కురిసింది.

నా అభిప్రాయాలు, అభిరుచులకు జిరాక్స్‌ తను అని కొద్దిరోజుల్లోనే తేలిపోయింది. నాతో జీవితం పంచుకోవడానికి ఇంతకన్నా సరైన వ్యక్తి ఎవరుంటారనిపించింది. అదేమాట చెప్పా. సిగ్గుల మొగ్గైంది. కానీ తర్వాతే మొదలైంది అసలు కథ. మా మనసులు కలిశాయిగానీ.. మేం కలవడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. మేం బాగా చదువుకొని.. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డవాళ్లం.. మనసులు, అభిప్రాయాలు కలిసినవాళ్లం.. అయినా ఇవేవీ మేం కలిసి బతకడానికి సరిపోలేదు. కారణం.. మా మతాలు, కులాలు వేరు. మేం పెళ్లి చేసుకుంటే పరువు, మర్యాదలు మంట గలుస్తాయన్నారు పెద్దలు.  పెద్దమనసుతో మమ్మల్ని ఒక్కటి చేయమని కాళ్లావేళ్లా పడ్డాం. కనికరించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో గుట్టుగా పెళ్లి చేసుకున్నాం. తర్వాత మా పరిస్థితి మరింత దిగజారింది. మాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు. ఏదో తప్పు చేసినట్టు చూసేవారు. కష్టాల్లో ఉన్నా కనీసం పలకరించేవాళ్లు లేరు. అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. మేం నచ్చనివాళ్లు కుళ్లుకునేలా ఎదగాలనుకున్నాం. లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకెళ్లాం. అనుకున్నది సాధించాం. ఇప్పుడు మాకో బాబు కూడా.

వైద్యారోగ్యశాఖలో తన హోదా పెరిగింది. నేనూ ప్రభుత్వోద్యోగం సంపాదించా. ఆర్థికంగానూ స్థిరపడ్డాం. ఇప్పుడిప్పుడే మా కన్నవాళ్లు, బంధువులు మమ్మల్ని చేరదీయడం మొదలుపెట్టారు. మాకూ సంతోషమే. మేం కలిసి బతకాలనుకున్నాం గానీ.. తల్లిదండ్రుల్ని ఎదిరించి ఉండాలనుకోలేదు. ఇప్పటికీ వాళ్లంటే గౌరవమే. ప్రస్తుతం శుభంకార్డు పడ్డ మా జీవితాల్లో తప్పకుండా స్మరించుకోవాల్సింది మా స్నేహితుల్ని. అందరూ దూరమైన సమయంలో వాళ్లే మాకు ఆప్తులయ్యారు. అన్నిరకాలుగా ఆదుకున్నారు. ముఖ్యంగా జెస్సీ, శాండీలు చేసిన సాయం మర్చిపోలేం. శాండీ దిల్లీలో ఉన్నాడని తెలిసింది కానీ చిరునామా లేదు. జెస్సీ అమెరికాలో స్థిరపడిందట. పూర్తి అడ్రస్‌ తెలియదు. ఈ స్నేహితులంటూ లేకపోతే మా జీవితాలు ఎలా ఉండేవో ఊహించలేం. అందరూ దూరమై, అనాథల్లా మారిన మా జీవితాల్లో వెలుగులు పంచిన మా స్నేహితులు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాం.
            

- శ్యామ్‌ శ్రీ..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts