Updated : 28 Jan 2023 07:01 IST

నా వెనక తిప్పుకొని తప్పు చేశానా?

నా భావాలకు నిలువుటద్దం లాంటి వ్యక్తి. నా మనసుని కనికట్టు చేసిన మాంత్రికుడు తను. మొదటిసారి ఎదురుపడ్డాడు. అయినా ఎందుకో నోరు పెగల్లేదు. మరింత దగ్గరికొచ్చాడు. నా గుండె వేగం పెరిగింది. నన్ను సమీపించి ‘హలో.. ఆర్యూ హియర్‌’ అన్నాడు. ‘ఔను.. ఇక్కడే ఉన్నా’ అన్నా. మేం కలుసుకున్నప్పుడు కోటి భావాలు కలబోసుకోవాలనుకున్నాం. మాటల కెరటాలలో ఈదాలనుకున్నాం. కానీ మౌనమే మా మధ్య అడ్డుతెరలా నిలిచింది. క్షణాలు కరిగాయి. నిమిషాలు గడిచాయి. మా మాటలు ముందుకు సాగలేదు. చేసేదేం లేక మేమే ముందుకు కదిలాం. తను మళ్లీ కనపడితే బాగుండు అనిపించేది. నేను పెదవి విప్పితే చూడాలని ఉబలాట పడేవాడు తను. ఆన్‌లైన్‌లో ఎన్నెన్నో అభిప్రాయాలు కలబోసుకున్నాం. బోలెడు ఊసులు చెప్పుకున్నాం. అదేంటో.. ఎదురుపడగానే ఇలా డీలా పడిపోయాం. అయినా.. అతడి రూపం.. ఆ నవ్వు.. నాకోసం ఆతృతగా ఎదురుచూసే కళ్లు.. నన్ను మరీమరీ మురిపిస్తుండగా ఆ రాత్రి నా కంటికి నిద్రే కరవైంది.

మర్నాడు ఉదయమే మళ్లీ కనిపించాడు. ఒక్కసారి గుండె జల్లుమంది. హృదయం అక్కడే ఆగమన్నా... మెదడు కదలి వెళ్లమంది. మాట్లాడితే ఏం జరుగుతుందోననే భయం. ఎవరైనా చూస్తారేమోననే జంకు. ఆఖరికి మెదడు చెప్పిన మాటకే ఓటేశా. అతడ్ని తప్పించుకొని తిరుగుతున్నా.. అతడి ఆలోచనలు మాత్రం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేవి. నాకు తెలియకుండానే తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అనే ఫీలింగ్‌లో పడిపోయా. ఆ విరహం భరించలేక ఒక్కోసారి నేనే వెళ్లి ప్రేమిస్తున్నానని చెప్పనా? అనిపించేది. ఆ మాట చెప్పడానికి క్షణం చాలు. కానీ నా ప్రేమనెలా నిరూపించుకోను? మళ్లీ మనసుకి, మైండ్‌కి ఘర్షణ మొదలైంది. నాలో నేను.. నా గొడవలో నేను ఉండగా.. ఒకరోజు తను సడెన్‌గా వచ్చి ‘ఐ లవ్యూ’ అన్నాడు. నిర్ఘాంతపోయా. మనసుకి అదే కావాలేమో! లోలోపల కేరింతలు కొడుతోంది. ఆ సంతోషం ముఖంలో కనబడనీయకుండా... సీరియస్‌గా అక్కడినుంచి కదిలా.
ఇంటికి వెళ్లగానే తీవ్ర ఆలోచనలో పడ్డా. తను చెప్పిన విషయం గురించి కాదు.. నా మనసు చేస్తున్న హైరానా గురించి. తనంటే నాకూ ఇష్టమే. కానీ నేను సంప్రదాయ బందీని. ప్రేమ పెళ్లి తర్వాత భవిష్యత్తుపై బెంగ ఉన్న సగటు అమ్మాయిని. కుదిరితే మనసు విప్పి మాట్లాడుకోవడాలు.. వీలైతే కప్పు కాఫీ వరకు ఓకేగానీ ప్రేమ పేరుతో పార్కులు.. టూర్లు.. హమ్మో భయం తరుముకొచ్చేసింది. అయినా తనతో కొంతదూరం ప్రయాణిస్తేనే కదా.. ఏది తప్పో, ఏది ఒప్పో.. తనెలాంటివాడో పూర్తిగా తెలిసేది. మొత్తానికి ఎలాగో గొంతు పెగిల్చి ‘ఇప్పుడైతే ఫ్రెండ్షిప్‌ వరకు ఓకే.. మిగతాది తర్వాత ఆలోచిద్దాం’ అన్నాను.

నేను గీసిన గీత అంగుళమైనా దాటలేదు తను. నాపై కొండంత ప్రేమ ఉన్నా స్నేహితుడిలాగే ప్రవర్తించాడు. నిజం చెప్పాలంటే కొద్దిరోజుల్లోనే తన వ్యక్తిత్వం, మంచితనానికి ఫిదా అయ్యా. అయినా ‘ఐ టూ లవ్యూ’ అని చెప్పడానికి ఏదో మొహమాటం. కుటుంబం, సంప్రదాయం, భయం, కట్టుబాట్లు అడ్డొచ్చాయి. అలా మూడేళ్లు కొనసాగింది మా ప్రేమలాంటి స్నేహం. మెల్లమెల్లగా తన పట్ల నా అభిప్రాయాలు మారసాగాయి. తను మంచోడే.. కానీ ఏరికోరి చిక్కులు కొనితెచ్చుకొని ప్రేమ పెళ్లి చేసుకోవడం అవసరమా? అనిపించేది. మెల్లమెల్లగా మొదలెట్టి, ఒకానొక సమయంలో తన నుంచి పూర్తిగా దూరం వచ్చేశా.
సీన్‌ కట్‌ చేస్తే.. నాకు పెళ్లై ఇద్దరు పిల్లలు. భర్త లండన్‌లో ఉద్యోగం. చీకూచింతా లేకుండా హాయిగా గడిచిపోతోంది. అప్పుడప్పుడు తను, గతం గుర్తొచ్చినా.. తప్పు చేశానన్న భావన ఎప్పుడూ కలగలేదు, తను మళ్లీ నాకు ఎదురు పడేదాకా!
మన అభిప్రాయాలు, ఫీలింగ్స్‌ మార్చుకోవడంలో మనకొచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ మన ఫీలింగ్స్‌, అభిప్రాయాలు, నిర్ణయాలపైనే ఆధారపడి ఎవరైనా ఉన్నప్పుడే వస్తుంది చిక్కంతా. చాలాకాలం తర్వాత తను మళ్లీ కనబడ్డప్పుడు తెలిసింది ఇదంతా. తను నాలాగా అభిప్రాయం మార్చుకోలేదు. నేను వదిలేసినా తను ఎదురుచూస్తూనే ఉన్నాడు. నా ఊహల్లోంచి తను కనుమరుగైనా.. అతడి ఆలోచనల్లో నేనే ఉన్నాను. అదే ధ్యాసలో పడి ఆరోగ్యం, కెరియర్‌నీ అశ్రద్ధ చేశాడట. ఒక్కమాటలో చెప్పాలంటే.. తను నాకోసం ఎదురుచూసీ చూసీ జీవితాన్నే కోల్పోయాడు. అదంతా వింటుంటే నా కంటిలో చెమ్మ.
మొదట్లోనే నేను తన భావాలకు ఆకర్షితురాలిని కాకుండా ఉండాల్సింది. నన్ను కలవాలని ప్రయత్నించినప్పుడన్నా ఆపాల్సింది. గుండెల్నిండా ప్రేమ నింపుకొని నా మాట కోసం స్నేహితుడిలా మసలుతున్నప్పుడైనా చెప్పాల్సింది మనకు సెట్‌ కాదని. ఏదో ఒక సందర్భంలో నేను తనకి స్పష్టంగా చెప్పి ఉంటే.. బహుశా ఆ దుస్థితి వచ్చేది కాదేమో. తప్పు చేసింది నేనా? నా మనసా? నా మెదడా? ఏమీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం తను మా ఇంటి దగ్గరే అద్దెకు ఉంటున్నాడు. అతడు కనిపించినప్పుడల్లా.. వేల ప్రశ్నలు ఈటెల్లా నా మనసుని గుచ్చుతూనే ఉన్నాయి.  

 ఆర్కే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు