మిగిలింది నీ జ్ఞాపకాలే!

ఏళ్ల కిందట.. ఓ పూట సెలవుపెట్టి మా బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లా. అది మిట్ట మధ్యాహ్నం. భోజనం చేసే చోట విపరీతమైన జనం. నిలబడటానికీ చోటు లేదు. ఇంతలో నా ఫోన్‌ మోగింది.

Updated : 18 Feb 2023 07:49 IST

మనసులో మాట

కొత్త సంవత్సరాలు కాలాన్ని ముందుకు నడిపిస్తే.. కొన్ని జ్ఞాపకాలు మనసుని పాత రోజుల్లోకి లాక్కెళ్తాయి. తను నా నుంచి కనుమరుగై ఏళ్లు గడిచినా.. నాకు మిగిల్చిన జ్ఞాపకాల్ని రోజుకోసారైనా తడిమి చూసుకుంటూనే ఉన్నా.

ళ్ల కిందట.. ఓ పూట సెలవుపెట్టి మా బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లా. అది మిట్ట మధ్యాహ్నం. భోజనం చేసే చోట విపరీతమైన జనం. నిలబడటానికీ చోటు లేదు. ఇంతలో నా ఫోన్‌ మోగింది. ఒక చేత్తో విస్తరి పట్టుకొని, మరో చేత్తో మొబైల్‌ తీసి ‘హలో’ అన్నా. అవతలి వైపు సౌండ్‌ లేదు. కాల్‌ కట్‌ చేసి ముద్ద నోట్లో పెట్టుకుంటుంటే మళ్లీ మోగింది. ‘హలో ఎవరు?’ అన్నా ఈసారి కాస్త చిరాగ్గా. ‘నేను సర్‌.. నన్ను గుర్తు పట్టలేదా?’ అందో ఆడ స్వరం. గొంతు కోయిలలా ఉన్నా.. ఎంజాయ్‌ చేసే పరిస్థితుల్లో లేను. చేతిలో ప్లేటు, ఓవైపు ఎండ వేడి, చెమట్లు కారుతూ.. చికాకుగా ఉంది. తనేమో ‘నేనెవరో కనుక్కోండి’ అన్నట్టుగా పజిల్‌ పెట్టింది. నేనెంత విసుక్కున్నా.. తను మరో రెండుసార్లు ఫోన్‌ చేసింది. కార్యక్రమ వివరాలు, నా యోగక్షేమాలు అడిగింది.
ఆ అమ్మాయి నా కొలీగ్‌ అని తర్వాత అర్థమైంది. చేరి కొద్దిరోజులే అయ్యింది. ఆకట్టుకునే ముఖం.. అరవిరిసిన నవ్వు. ఆమెతో మాట్లాడే సందర్భం ఎప్పుడూ రాలేదు. కానీ ఓసారి అవసరం ఉండి తనుండే చోటికి వెళ్లా. పని పూర్తి చేసుకొని తిరిగొస్తుంటే.. ‘అయినా నాలాంటి వారితో ఎందుకు మాట్లాడతారు సార్‌?’ అంది వినబడేట్టు. నేను తనని చూడగానే చటుక్కున ముఖం తిప్పుకుంది. ఆ ఎత్తిపొడుపుల ఆంతర్యమేంటో ఆలోచిస్తూ.. అడుగులో అడుగేసుకుంటూ బయటికొచ్చా.
ఆఫీసులో తనదీ నా సమాన హోదానే. అవసరం, సందర్భం రాక మాట కలపలేదు. దానికే నొచ్చుకుందేమో! ఇంకా అదే భావనలో ఉండొద్దని ఓసారి నేనే వెళ్లి పలకరించా. అప్పట్నుంచి తన ప్రవర్తనలో విపరీతమైన మార్పు. ఆఫీసుకి రాగానే విష్‌ చేసేది. మధ్యమధ్యలో ఓరచూపులు, కొంటె నవ్వులు. నేను వేరే ఎవరితోనైనా మాట్లాడితే తను ఇబ్బందిపడటం గమనించా. దీంతో నాలోనూ భావోద్వేగాలు వెల్లువెత్తాయి. ‘అసలు నాపై నీ ఉద్దేశమేంటి? నా గురించి ఏమనుకుంటున్నావ్‌?’ అన్నానోసారి. రెండ్రోజులయ్యాక నా చేతిలో ఓ కాగితాల కట్ట పెట్టింది. దాదాపు ఇరవై పేజీలుంటాయేమో! తెరిచి చూస్తే.. ముత్యాల్లాంటి అక్షరాలు. తన భావాలన్నీ వ్యక్తీకరిస్తూ.. మనసంతా పరిచేసింది. ‘నువ్వు అందరికన్నా ప్రత్యేకంగా ఉంటావు. నీ పనితనం, పద్ధతి నాకు తెగ నచ్చేశాయి. అందుకే నువ్వు కనబడితే కన్నార్పకుండా చూస్తాను’ అంది. నాకోసం తెల్లవార్లూ మేల్కొని రాసిందట. చివర్లో ‘బంగారం’ అని సంబోధించింది. అవన్నీ చదివాక నా మనసుకి రెక్కలొచ్చాయి. అమ్మాయిలే కాదు.. పొగడ్తలకు అబ్బాయిలూ పడిపోతారని అర్థమైంది.
అప్పట్నుంచి మా ప్రేమనంతా అక్షరాల్లోనే తర్జుమా చేసుకునేవాళ్లం. లెటర్లలోనే మూటగట్టి బట్వాడా చేసుకునేవాళ్లం. ‘సీతారామమ్‌’ సినిమాలో నాయికానాయకుల్లా. ఆరేళ్లలో మేం ఫోన్లలో ఐదారుసార్లే మాట్లాడుకున్నాం. నా హృదయంలో తనకి చోటుందని తేలాక.. నాకోసం ఎన్నో చేసేది. అందరికన్నా ముందే వచ్చి నా పని చేసిపెట్టేది. గేటు దగ్గర నిల్చొని నా రాక కోసం ఎదురు చూస్తుండేది. ఏమాత్రం ఆలస్యమైనా.. అలిగేది. నాకోసం ఎందుకిలా శ్రమిస్తున్నావ్‌? అంటే.. ‘నువ్వు చూపే ప్రేమ ముందు.. నేను చేసే పని ఆవగింజంత’ అనేది. నేనేదైనా కొత్త పని తలపెట్టినా, పైస్థాయి ఉద్యోగ పరీక్షలు రాసినా.. మంచి జరగాలని కోటి దేవుళ్లకు మొక్కుకునేది. ఒకమ్మాయి ఇంతలా ప్రేమిస్తుందా? అని ఒక్కోసారి నాకే ఆశ్చర్యమేసేది. ప్రతి కథలో మలుపులున్నట్టే మా ప్రేమకథ సైతం ఓ టర్న్‌ తీసుకుంది. అది మేం చేసే వృత్తి కారణంగా. అది నన్నో దరిని తననో చోటికి విసిరేసింది. మళ్లీ మేం ఒకర్నొకరం కలుసుకోలేనంత ఎడబాటు కలిగించింది. రోజుకో కొత్త బహుమానంతో కనువిందు చేసిన ఆ వెలగ పువ్వుల సోయగం నాకు దూరమై అర్ధ దశాబ్దమైంది. అయినా తను మిగిల్చిన జ్ఞాపకాల నిధి నన్ను నిత్యం తనని స్మరించుకునేలా చేస్తూనే ఉంది.

పండు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని