ఎప్పుడూ అనుకోలేదు..ఆ నవ్వు వెనక విషాదముందని..
‘రేయ్ రామ్ జీవితం చాలా చిన్నది.. ప్రతిక్షణాన్నీ జీవించాలి..’ అని నాకు తరచూ చెప్పే వసు (పేరు మార్చాం) ఇలా చేస్తుందనుకోలేదు.
మా ఆఫీసులో నేను చేరిన ఏడాదిన్నరకి ఒకమ్మాయి వచ్చింది. చారడేసి కళ్లు.. పొడవాటి జడ.. చామనఛాయ అయినా కళగా ఉండే మొహం. ఎప్పుడైనా నవ్వితే బుగ్గల్లో సొట్టలు పడేవి. వచ్చినప్పటి నుంచి తనని గమనిస్తూనే ఉన్నా. ఎప్పుడూ మూడీగా ఉండేది. ఎవరితోనూ కలవదు. ‘హాయ్ అండీ.. ఇవి ఊరి నుంచి తెచ్చా. చాలా బాగుంటాయి. ఓసారి రుచి చూడండి’ అంటూ ఓరోజు కాజాలు ఇచ్చి, మాట కలిపా. కళ్లు చక్రాల్లా తిప్పి.. కనురెప్పలు టపటపలాడించింది. ‘థాంక్స్’ అన్నట్టుగా. ఓ వారంలోపే నా చేతిలో చిన్న స్వీట్‌బాక్స్ పెట్టింది. అలా మా పరిచయం మొదలై, సాన్నిహిత్యం కుదిరింది. దగ్గరయ్యాకగానీ తెలియలేదు.. తనెంత దూకుడో. అందరిముందే భుజం మీద చేయేసి మాట్లాడేది. గారు, మీరు కాస్తా.. ‘ఏరా’ అనేదాకా వచ్చింది. అంత హుషారైన అమ్మాయి ఎందుకో.. ఒక్కోసారి మూగనోము పట్టి ఒంటరిగా ఉండిపోయేది.
మేం కలిసి టీలు తాగడం, క్యారేజీలు పంచుకోవడం.. జోకులేసుకోవడం.. ఆఫీసులో కొందరికి నచ్చలేదు. ‘తను సర్ వాళ్ల బంధువట. తేడా వస్తే ఉద్యోగం ఊడుతుంది. జాగ్రత్త’ వార్నింగ్ ఇచ్చాడో సీనియర్. ‘తనకి ఆల్రెడీ ఓ బోయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. ఆమె మోజులో పడి కెరియర్‌ని నిర్లక్ష్యం చేసుకోకు’ హితవు పలికాడో సహోద్యోగి. ఎవరెన్ని చెప్పినా.. ఆమె సాహచర్యం నన్ను పరవశంలో ముంచెత్తేది.
ఆరోజు భోజనం చేస్తుండగా ఊరి నుంచి చెల్లి ఫోన్. నాన్నకి యాక్సిడెంట్ అయ్యిందంటూ ఏడుస్తూ చెప్పింది. హడావుడిగా బయల్దేరా. చలాకీగా ఉండే నాన్న ఆసుపత్రిలో బెడ్‌మీద అచేతనంగా ఉన్నారు. తాగిన మైకంలో ఒకడు బైక్‌తో వెనక నుంచి ఢీకొట్టాడట. ఐదురోజులు ఆసుపత్రిలోనే ఉన్నాం. ఆ సమయంలో రోజుకి నాలుగైదుసార్లు ఫోన్ చేసింది వసు. ఖర్చులకని నా ఖాతాలో రూ.ముప్ఫై వేలు వేసింది. ఆ గడ్డు సమయంలో తన మాటలు నిజంగానే నాకు బలాన్నిచ్చాయి. తిరిగి రాగానే ముందు తన దగ్గరికే వెళ్లా. ఎలా థాంక్స్ చెప్పాలో అర్థం కాక.. చిన్నగా హగ్ చేసుకున్నా. ‘ఏంట్రా ఇది చిన్నపిల్లాడిలా..’ అంటూ తల నిమిరింది. ఆ సంఘటనతో తనపై ప్రేమ రెట్టింపైంది. నన్ను ఇంతలా అర్థం చేసుకునే అమ్మాయి దొరకదనుకొని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని అక్కడే అడిగా. తన మొహంలో ఓ నిర్జీవమైన నవ్వు. అది నా ఇష్టానికి రెడ్‌సిగ్నల్. దాంతో గుండె బరువెక్కి అక్కణ్నుంచి కదిలా.
నాల్రోజులయ్యాక ఇంటికి రమ్మంటే వెళ్లా. పెద్ద బంగ్లా వాళ్లది. బీరువాలోంచి ఒక ఆల్బమ్ తీసి నా చేతిలో పెట్టింది. తెరిచి చూస్తే.. వసు, ఇంకో అబ్బాయి రకరకాల పోజుల్లో దిగిన ఫొటోలున్నాయి. ‘నీకీపాటికి అర్థమయ్యే ఉంటుంది. వాడు నా క్లాస్‌మేట్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. తను జీనియస్. స్టార్టప్ పెట్టాలనుకునేవాడు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేసేవాడు. ఓరోజు నాకు చెప్పకుండానే ఇంటికొచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని నాన్నని అడిగాడు. ఈడ్చి చెంప మీద కొట్టారు నాన్న. అయినా తను తిరగబడలేదు. ‘మిమ్మల్ని ఒప్పించే చేసుకుంటాం’ అని నవ్వుతూనే వెళ్లిపోయాడు. అదే ఆఖరి చూపు. తర్వాత నేనెన్నోసార్లు నాన్నని బతిమాలా. వాడి కులం నచ్చలేదో.. ఆస్తి తక్కువనో.. అస్సలు ఒప్పుకోలేదు. ‘వాడికి డబ్బులు పడేశా. తన దారి తను చూసుకుంటానన్నాడు. నిన్ను మర్చిపోతానన్నాడు’ అన్నారోరోజు నాన్న. నేనామాటలు నమ్మలేదు. తర్వాత వాడూ కనిపించలేదు. అయినా ఎప్పటికైనా తిరిగొస్తాడనే నమ్మకం మాత్రం ఉండేది..’ వసూ చెబుతుంటే నాకు కన్నీళ్లాగలేదు.
ఆ బాధలోంచి తేరుకోవడానికే మా ఆఫీసులో చేరిందట. తన మొహంలో మళ్లీ చిరునవ్వుకి నేను కారణమయ్యానంది. వసు గతం తెలిశాక మంచి మిత్రుడిగానే ఉండిపోవాలనుకున్నా. తర్వాత మేం ఎప్పట్లాగే ఉండేవాళ్లం. వాళ్లింటికి అప్పుడప్పుడు వెళ్లేవాణ్ని. ఓసారలాగే పిలిస్తే వెళ్లా. ఇంట్లో ఎవరూ లేరు. నాకు సన్నిహితంగా వచ్చి.. ‘రేయ్.. నువ్వు నన్ను ప్రేమించా అన్నావ్ కదా.. సారీరా. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను కానీ జీవితాంతం గుర్తుంచుకునేలా నీకో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. ఏం కావాలి? ముద్దు పెట్టనా? ఇంకేదైనా కావాలా? దేనికీ కాదనను’ అంది. నాకు షాక్. వసూ నాతో ఎంత క్లోజ్‌గా ఉన్నా ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. ‘నిన్ను ప్రేమించిన మాట వాస్తవం. నువ్వు వేరే అబ్బాయిని ఇష్టపడ్డావని తెలియగానే నీకు మంచి ఫ్రెండ్‌గానే ఉండాలనుకున్నా. నీ నుంచి ఏమీ ఆశించడం లేద’ని చెప్పి అక్కడ్నుంచి తిరిగొచ్చా.
ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. తను ఎందుకిలా ప్రవర్తించిందో అర్థం కాక రకరకాలుగా ఆలోచించసాగా. తెల్లవారుతుండగా తన నుంచి ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. నా మనసెందుకో కీడు శంకించింది. ‘రామ్.. నేను నా ప్రాణం అనుకున్నవాడి ప్రాణం ఎప్పుడో పోయిందని రెండ్రోజుల కిందటే తెలిసిందిరా. తను తిరిగొస్తాడనుకున్న నా ఆశ తీరదిక. అందుకే నేనూ వాడి దగ్గరికే వెళ్లిపోతున్నా. వెళ్లిపోయేముందు నన్ను ప్రేమించిన నీకు ఏదైనా గిఫ్ట్ ఇద్దామనుకున్నా. నేను చేసింది తప్పైతే క్షమించు. సెలవ్’.. మెసేజ్ చదవగానే ఫోన్ విసిరేసి బైక్‌ని వాయువేగంతో ఉరికించా. వాళ్లింటి దూరం నుంచే ఏడుపులు వినిపించసాగాయి. విషయం అర్థమైంది. చేసేదేం లేక వెనక్కి తిరిగొచ్చా. పొగిలిపొగిలి ఏడ్చా.
చాలా సరదాగా ఉంటూ.. ఎన్నోసార్లు జీవితం పట్ల నాకు ధైర్యం చెప్పిన తను.. ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని కలలో కూడా ఊహించలేకపోయా. ఇందులో తప్పెవరిదని నేను తీర్పు ఇవ్వలేనుగానీ.. తన ఎడబాటు మాత్రం నాకు జీవితాంతం పెద్ద లోటే.
రామ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు