జీవితాంతం తోడుంటానని.. మాట మార్చాడు!

చుట్టూరా పచ్చని చెట్లు.. పక్కనే మనసుకి నచ్చే నేస్తాలు.. ఓయూ హాస్టల్‌ జీవితం హాయిగా సాగిపోతున్న రోజులవి. ఓసారి కాలేజీకి వెళ్తుండగా వెనక నుంచి ‘హాయ్‌.. మేడమ్‌’ అనే పిలుపు. ఎవరా అని వెనక్కి తిరిగా.

Updated : 25 Mar 2023 07:38 IST

చుట్టూరా పచ్చని చెట్లు.. పక్కనే మనసుకి నచ్చే నేస్తాలు.. ఓయూ హాస్టల్‌ జీవితం హాయిగా సాగిపోతున్న రోజులవి. ఓసారి కాలేజీకి వెళ్తుండగా వెనక నుంచి ‘హాయ్‌.. మేడమ్‌’ అనే పిలుపు. ఎవరా అని వెనక్కి తిరిగా. రొప్పుకుంటూ దగ్గరికొచ్చాడు ఒకతను. ‘మిమ్మల్నే మేడమ్‌.. నేను మీ క్లాస్‌మేట్‌ని’ అన్నాడు నా క్వశ్చన్‌మార్క్‌ మొహం చూసి. తరగతిలో ఎవర్నీ పెద్దగా గమనించను కాబట్టి తొందరగా గుర్తు పట్టలేదు. కళ్లతోనే అడిగా ఏంటన్నట్టు. ‘కొంచెం మీ నోట్‌బుక్‌ ఇస్తారా?’ అన్నాడు తత్తరపాటుతో. మౌనంగా ఉండేసరికి ‘ప్లీజ్‌.. మిస్సైన పాఠాలు రాసుకొని ఇస్తా’ అన్నాడు. జాలేసి తనడిగింది ఇచ్చా.

మర్నాడు అక్కడే కలిశాడు. నా నోట్‌బుక్‌తోపాటు చేతిలో చిన్న స్లిప్‌ పెట్టాడు. అందులో తన ఫోన్‌ నెంబర్‌ ఉంది. నాకది నచ్చక గబగబా అక్కడినుంచి కదిలా. మూడోరోజూ వదల్లేదు. ‘జస్ట్‌ మీతో స్నేహం చేయాలనుకుంటున్నా. మీ నెంబర్‌ ఇవ్వొచ్చుగా.. ఏదైనా అవసరం ఉంటేనే కాల్‌ చేస్తా’ అని బతిమాలాడు. ఆ అభ్యర్థనని కాదనలేకపోయా. ఆ సాయంత్రమే నా సెల్‌ఫోన్‌కి సందేశం పంపాడు. నేనూ స్పందించా. క్లాస్‌ సంగతుల నుంచి.. కాలేజీ గాసిప్‌ల దాకా.. ఎసెమ్మెస్‌లు తర్జుమా అవుతుంటే నాలోనూ ఏదో కొత్త భావన. కొద్దిరోజులకే తన మాటల వర్షంలో తడిసిపోసాగా.  

తను నాపై చూపించే ఇష్టం నన్ను కట్టిపడేసేది. పైగా ఆడవాళ్లంటే విపరీతమైన గౌరవం. ఒకమ్మాయి పడిపోవడానికి ఇంతకన్నా ఏం కావాలి? తను నాకే దక్కాలనే కోరిక రోజురోజుకీ బలపడేది. ప్రపోజ్‌ చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ఆడపిల్లననే మొహమాటం అడ్డొచ్చేది. ఈ సందిగ్ధం కొనసాగుతుండగానే ‘నాకు ఉద్యోగం వచ్చింది శ్రావ్స్‌’ అన్నాడోరోజు. తను బాగు పడతాడని సంతోషించాలా? దూరమవుతాడని ఏడవాలా? అంతా అయోమయం. కానీ ఊరెళ్లిన తర్వాత కూడా రోజూ ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడుగుతుంటే అప్పుడు నమ్మకం కుదిరింది తను నావాడేనని. అందుకే ఓ మంచిరోజు చూసుకొని ఆ మూడక్షరాల పదం పలకాలనుకున్నా. కానీ నా దురదృష్టం.. నా మనసులోమాట తనని చేరకముందే మదిని మెలిపెట్టే ఓ విషయం చెప్పాడు. తనకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని. ఆ బాధలో ఉండగానే ‘పెళ్లి సెట్‌ అయ్యింది’ అన్నాడు. ఆ వార్త వినగానే నా ఊపిరి ఆగినంత పనైంది. ఆశలు పూర్తిగా అడుగంటడంతో బాధ దిగమింగుకుని ‘కంగ్రాట్స్‌’ అన్నాను. ‘నాకు పెళ్లైనా మన స్నేహం, సాన్నిహిత్యం ఇలాగే కొనసాగుతుంది. నీకు జీవితాంతం శ్రేయోభిలాషిలా ఉంటా’ అనడంతో మనసు కొంచెం స్థిమితపడింది.

రోజులు గడుస్తున్నాయి. తను నావాడు కాదనే వాస్తవం జీర్ణించుకోవడం కఠినంగా తయారైంది. ఆ తర్వాత మొదలైంది అసలు కథ. మెసేజ్‌కి రిప్లై ఇవ్వడు. కాల్‌ చేస్తే కసురుకుంటాడు. కొద్దిరోజులు చేసుకోబోయే అమ్మాయి మురిపెంలో ఉంటాడులే అనుకున్నా. కాలం గడిచినకొద్దీ అదే తీరు. కొన్నాళ్లకి పూర్తిగా దూరం పెట్టసాగాడు. నేను తన నుంచి ఆశించింది ఒక మెసేజ్‌.. నాలుగు మాటలు. దానికీ నోచుకోనా? అసలు ఒకబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడమే నేను చేసిన తప్పా? హద్దుల్లో ఉంటూ అనుబంధం కొనసాగించాలనుకోవడమూ అపరాధమేనా? నా జీవితంలోకి పిలవకుండానే అడుగు పెట్టి.. ఇప్పుడు కావాలనే కాలదన్నడం ఎంతవరకు సమంజసం? ఏదేమైనా నా మనసులో స్థానం సంపాదించి తను గెలిచాడు. తన మనసులో చోటు దక్కించుకోలేక నేను ఓడిపోయాను. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే.. ప్రేమలో ఓటమిని జీర్ణించుకోలేనివాళ్లకు ప్రతి క్షణం ఒక నరకంలా ఉంటుంది. ఆ కూపంలోకి వెళ్లొద్దని కోరుతున్నా.

స్రవంతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు