Manasulo Mata: నా కంటిపాపవై.. నాలోనే ఉన్నావు

‘ప్రియా ప్రియా.. చంపొద్దే.. నవ్వీ నన్నే ముంచొద్దే...’ హర్ష నావైపే చూస్తూ పాడుతున్నాడు. అప్పుడప్పుడూ కొంటెగా కన్ను గీటుతున్నాడు.

Updated : 13 May 2023 09:31 IST

మనసులో మాట

‘ప్రియా ప్రియా.. చంపొద్దే.. నవ్వీ నన్నే ముంచొద్దే...’ హర్ష నావైపే చూస్తూ పాడుతున్నాడు. అప్పుడప్పుడూ కొంటెగా కన్ను గీటుతున్నాడు. తన చేష్టలకు నా బుగ్గలు ఎరుపెక్కాయి. ‘బై ది వే.. ఈ సాంగ్‌ అక్కడ మొదటి వరుసలో కూర్చున్న నా చెలికి అంకితం’ అనేసరికి దాదాపు సిగ్గుతో చచ్చిపోయా. వాడు ముందునుంచీ అంతే. ప్రేమని మనసులోనే దాచుకోవడం రాదు. ప్రపంచమంతా వినపడేలా గొంతెత్తి అరుస్తాడు. ఆ ప్రేమ జడివానలా ఉంటుంది. తడిసి ముద్దవ్వాల్సిందే. దీనికి ప్రారంభం మా స్కూలే. ఇద్దరిదీ ఒకే బెంచ్‌, ఒకేచోట లంచ్‌. మల్లెతీగకు మల్లే.. రోజురోజుకీ మా మధ్య స్నేహం అల్లుకుంది. మాకు తెలియకుండానే ప్రేమ పరిమళాలూ అద్దుకున్నాయి.
పది పూర్తైంది. నాలో భయం మొదలైంది. హర్ష వాళ్లది కలిగిన కుటుంబం. అమ్మానాన్నలు పని చేస్తేనే కడుపు నిండే స్థితి మాది. వాడి పేరెంట్స్‌ తనని ఏదో ఒక కార్పొరేట్‌ కాలేజీలో చేరుస్తారనుకున్నా. కానీ నాకోసం తను పంతం పట్టాడు. కన్నవాళ్లను ఒప్పించి నాతోపాటే లోకల్‌ కాలేజీలో చేరాడు. ఇంటర్‌ మాకు మర్చిపోలేని జ్ఞాపకాలను ఇచ్చింది. క్లాసు, క్యాంటీన్‌, లైబ్రరీ, సినిమా హాలు.. ప్రతిచోటా మేమే ఉండేవాళ్లం. ఓరోజు హర్ష నన్ను వాళ్లింటికి తీసుకెళ్లాడు. బెరుకుగా ఉన్న నన్ను హర్ష వాళ్లమ్మ అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయంగా మాట్లాడారు. అప్పట్నుంచి తరచూ వెళ్లేదాన్ని. ఇంటర్‌ చివరికొచ్చేశాం. ‘డాక్టరు చదివి మంచి కార్డియాలజిస్ట్‌ అనిపించుకోవాలి’ అనేవాడు. ‘అమ్మాయిల హృదయాలను బాగా అర్థం చేసుకుంటావుగా.. నీకు అది అయితేనే కరెక్ట్‌’ అంటూ ఆటపట్టించేదాన్ని. చదువు పూర్తవగానే మా ప్రేమ సంగతి ఇళ్లలో చెప్పి పెద్దల ఆమోదం పొందాలనుకున్నాం.

అదిగో.. అంతలోపే ఇంటర్‌ ఫేర్‌వెల్‌ డే వచ్చింది. నాపై ప్రేమనంతా పాట రూపంలో గుమ్మరించాడు హర్ష. తర్వాత కొద్దిరోజులకే ఎగ్జామ్స్‌. ఇద్దరం బాగా రాయడంతో సంతోషంతో పార్టీ చేసుకున్నాం. సినిమాకీ వెళ్లాం. అక్కడే నా మెడ చుట్టూ చేతులు వేసి.. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ చాలానే కబుర్లు చెప్పాడు. జోక్స్‌ వేశాడు. కానీ ఆ నవ్వులే చివరి నవ్వులు అవుతాయని అనుకోలేదు. పరీక్షలు కాగానే పెదనాన్న వాళ్లింటికి వెళ్లాలనుకున్నా. ఈలోగా ఓసారి హర్ష వాళ్లింటికెళ్లా. ఆంటీ తన చీరతో కుట్టించిన డ్రెస్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. దాన్ని తీసుకొని సంతోషంగా ఊరొచ్చా. అప్పట్లో నా దగ్గర సెల్‌ఫోన్‌ లేదు. ఓ వారం అయ్యాక కాయిన్‌ బాక్స్‌ నుంచి హర్ష వాళ్ల ల్యాండ్‌లైన్‌కు చేశా. ఎవరూ తీయలేదు. సాయంత్రం మరోసారి ప్రయత్నించినా నో రెస్పాన్స్‌. రెండ్రోజులూ అదే సీన్‌. నా మనసేదో కీడు శంకించింది. పెదనాన్నకు చెప్పి హుటాహుటిన బయల్దేరా. నేరుగా హర్ష వాళ్లింటికి వెళ్తే.. తాళం వేసి ఉంది. నాలో భయం మొదలైంది. పక్కింటివాళ్లు చెప్పిన మాట వినగానే గుండె బద్దలైనట్టు.. అక్కడే కుప్పకూలిపోయా.

నేను ఊరొచ్చిన మర్నాడే హర్ష వాళ్ల కజిన్స్‌తో కలిసి నాగార్జునసాగర్‌ వెళ్లాడట. ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడిపోయాడట. బాడీ దొరకడానికి రెండ్రోజులు పట్టిందన్నారు. అంటే నా హర్ష ఈ ప్రపంచాన్ని వదిలేసి అప్పటికే వారం రోజులైంది. ఇదంతా పీడకల అయితే బాగుండని ఎంతగా ఏడ్చానో. తను లేని లోకం నాకు శూన్యంలా అనిపించింది. ఆత్మహత్యా ప్రయత్నం చేశా. సమయానికి అమ్మ చూసి నన్ను ఆపింది. తర్వాత పదేళ్లు హర్ష జ్ఞాపకాల్లోనే బతికా. నాతోపాటు మావాళ్లనీ ఏడ్పించలేక చివరికి రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్నా. మా వారికి కూడా నా విషయం చెప్పా. ఇప్పుడు నాకొక పాప. హర్షిణి. ప్రస్తుతం నా లక్ష్యం తనని మంచి మనసున్న కార్డియాలజిస్టుని చేయడమే.

పావని (పేరు మార్చాం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని