Manasulo Maata: ప్రేమంటే ఇదేరా..

సినిమాలు, పార్కులో షికార్లు, ఒకే సీసాలో రెండు స్ట్రాలు వేసుకొని కూల్‌డ్రింక్స్‌ తాగడం.. అమ్మాయి కోసం ఏ అర్ధరాత్రో గోడ దూకి హీరోలా ఫీలైపోవడం.. ప్రేమంటే ఇంతేగా! అనుకునేదాన్ని గతంలో.

Updated : 27 May 2023 08:24 IST

మనసులో మాట

సినిమాలు, పార్కులో షికార్లు, ఒకే సీసాలో రెండు స్ట్రాలు వేసుకొని కూల్‌డ్రింక్స్‌ తాగడం.. అమ్మాయి కోసం ఏ అర్ధరాత్రో గోడ దూకి హీరోలా ఫీలైపోవడం.. ప్రేమంటే ఇంతేగా! అనుకునేదాన్ని గతంలో. ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాడు అభి.

అభి మా పెదనాన్న గారబ్బాయి. నాకన్నా మూడేళ్లు చిన్న. వాళ్లది స్థిరాస్తి వ్యాపారం. లెక్కలేనంత డబ్బు. వాడికేమో స్నేహితులంటే ప్రాణం. వాళ్ల కోసం మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు పెట్టేవాడు. ఎవరికి ఏ సమస్య వచ్చినా అక్కడ వాలిపోయేవాడు. ఈ అతి మంచితనంతో చదువునూ నిర్లక్ష్యం చేసేవాడు.

డిగ్రీలో వాడికి ఆయేషా పరిచయమైంది. ‘తనని చూస్తుంటే బొంబాయి సినిమాలో మనీషా కోయిరాలే గుర్తొస్తుందక్కా.. తను కనబడకపోతే ప్రాణం లాగేసినట్టు ఉంటుంది’ అంటుంటే.. నవ్వుకునేదానిని. ఎంతైనా వయసు ప్రభావం కదా! తన వెనకాల తిరిగీతిరిగీ మొత్తానికి ఎలాగోలా మాట కలిపాడు. ‘నా వెంటపడి టైం వేస్ట్‌ చేసుకోకు. మనకి కుదరదు. మావాళ్లు అసలు ఒప్పుకోరు’ అని ఆ అమ్మాయి ఓసారి చెప్పిందట. మావాడేమో ఒక్కసారి ఫిక్స్‌ అయితే తన మాట తానే వినని రకం. ఏం మాయ చేశాడో మొత్తానికి ఆ అమ్మాయితో ఆ మూడక్షరాల పదాన్ని పలికించాడు.

సెకండియర్‌లో.. వాళ్ల ప్రేమ సంగతి ఓరోజు ఆయేషా వాళ్లింట్లో తెలియడంతో, తనని చావబాదారు. అభి తన ఫ్రెండ్స్‌ని తీసుకెళ్లి గోలగోల చేశాడట. ఆయేషా వాళ్ల నాన్న మా పెదనాన్న దగ్గరికొచ్చి నోటికొచ్చినట్టు తిట్టారు. పోలీస్‌ కేసు పెడతానని బెదిరించారు. పరువు పోయిందని పెదనాన్న చాలా బాధ పడ్డారు. పైగా ఆయనకి కులం పట్టింపు ఎక్కువ. ‘ఇంకోసారి ఆ అమ్మాయి పేరెత్తినా, తనతో కనిపించినా.. ఇంట్లోకి రానివ్వను’ అని అభీని తిట్టారు. ముందే చెప్పానుగా.. మావాడు ఎవరి మాటా వినని రకం అని.

సీన్‌ కట్‌ చేస్తే.. ఈ రెండేళ్లలో చాలానే జరిగాయి. పెద్దలు ఎంత కట్టడి చేసినా వాళ్లు కలుసుకోవడం మానలేదు. దాంతో ఆయేషాకి వేరే అబ్బాయితో నిఖా ఫిక్స్‌ చేశారు. అప్పుడే మావాడు హీరోలా మారిపోయాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్లిపోయి, గుడిలో పెళ్లి చేసుకున్నాడు. స్నేహితులే పెళ్లి పెద్దలయ్యారు. అప్పటికి ఇద్దరి వయసూ 20 ఏళ్లే. సినిమాల్లో హీరోహీరోయిన్ల పెళ్లి తర్వాత శుభం కార్డు పడుతుంది. అభీకి మాత్రం కష్టాల టైటిల్‌ కార్డు పడింది. మావాడికి పంతం ఎక్కువ కదా! ఇంట్లోంచి బెంగళూరు వెళ్లిపోయేటప్పుడు ఇంట్లోంచి నయా పైసా తీసుకెళ్లలేదు. అక్కడే చిన్న గది తీసుకొని కాపురం పెట్టారు. కొద్దినెలలు ఫ్రెండ్స్‌ సాయం చేశారు. మావాడికి డిగ్రీ కూడా లేకపోవడంతో మంచి ఉద్యోగం దొరకలేదు. దాంతో టెలీకాలర్‌గా.. కంప్యూటర్‌ ఆపరేటర్‌గా.. ఏవో చిన్నాచితకా పనులు చేసేవాడు. ఆయేషా గర్భవతి అయ్యాక కష్టాలు రెట్టింపయ్యాయి. ఖర్చులు పెరగడమే కాదు.. ఆ అమ్మాయినీ చూసుకునేవాళ్లు లేరు. ఆ సమయంలో వాడి మంచితనమే కాపాడింది. తన స్నేహితుడి అక్క బెంగళూరులో ఉద్యోగం చేసేది. ఆయేషాకి తనే పెద్ద దిక్కుగా మారింది. కానీ వాళ్ల దగ్గర డబ్బుల్లేక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం చేయించారు. ఈ సంగతులన్నీ అభీనే అప్పుడప్పుడు ఫోన్‌ చేసి చెబుతుండేవాడు. నాకు ఏడుపొచ్చేది. వీలైనంతలో కొద్దిగా డబ్బులు సర్దుబాటు చేసేదాన్ని.

అభీ ఎలా ఉండేవాడు? కార్లలో తిరిగేవాడు.. ఏసీ రూమూల్లో నిద్రపోయేవాడు.. స్నేహితుల కోసం వేలు, లక్షలు ఖర్చు చేసే తను.. రూ.రెండు, మూడు వేలు చేబదుళ్లు తీసుకుంటూ.. జీవితం నెట్టుకు రావడం నాకాశ్చర్యమేసేది. ఇన్ని కష్టాల్లోనూ వాడు ముఖంపై చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఈ రెండేళ్లలో ఒక్కనాడూ ఇంటికొచ్చి వాళ్ల నాన్నను రూపాయి అడగలేదు. ఆ జంట మధ్య ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. ఇరవై రెండేళ్లకే.. ఎన్నో ఎత్తుపల్లాలు, వందేళ్ల జీవితాన్ని చవిచూసిన ఆ ఇద్దర్నీ చూస్తుంటే నాకు ఇప్పుడు ప్రేమపై గౌరవం రెట్టింపైంది.

అన్నట్టు అభీకి నేనో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నా. పెదనాన్న, నాన్న, బాబాయ్‌ మా ముగ్గురిళ్లలో నేనొక్కదాన్నే అమ్మాయిని. నేనంటే అందరికీ ప్రాణం. ఈమధ్యే నాకు పెళ్లి కుదిరింది. పెద్దనాన్న ఏం బహుమానం కావాలని అడిగారు. ‘అభీని ఇంటికి తీసుకురా. అలాగైతేనే పెళ్లి పీటలెక్కుతా’ అన్నా. మొదట్లో బెట్టు చేశారు. నేనూ అలక మానలేదు. ఆయన కొంచెం తగ్గారు. ‘మీకు మనవడు పుట్టాడు’ అనే శుభవార్త చెప్పా. పూర్తిగా కరిగిపోయారు. ఇక అభీని ఇంటికి రప్పించే బాధ్యత నేనే తీసుకున్నా. వాడికి ఇంకా ఈ విషయం తెలియదు. ఫోన్‌ చేసి కూడా చెప్పను. నేనే బెంగళూరు వెళ్లి తీసుకొద్దాం అనుకుంటున్నా. చూడాలి.. ఆ అపర ప్రేమికుడు ఎలా స్పందిస్తాడో!

ఆశ్రిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని