స్నేహం.. ప్రేమగా మారితే తప్పా?

ఏడాది క్రితం. ఎప్పటిలాగే ఆఫీసుకెళ్లడానికి ఎంజీబీఎస్‌లో మెట్రో ఎక్కా. అమీర్‌పేటలో ఆగింది రైలు.

Updated : 27 Apr 2024 06:48 IST

డాది క్రితం. ఎప్పటిలాగే ఆఫీసుకెళ్లడానికి ఎంజీబీఎస్‌లో మెట్రో ఎక్కా. అమీర్‌పేటలో ఆగింది రైలు. గేట్లు తెరుచుకోగానే వెన్నెల నింపుకున్న ఓ జాబిలి ఎంటరైంది. సరాసరి వచ్చి నా పక్కనే కూర్చుంది. తనని చూస్తూ నా కళ్లు రెప్ప వేయడం మరిచాయి. రైలు వేగం అందుకోగానే ‘ఎక్స్‌క్యూజ్‌మీ’ అంది తను. అటూఇటూ చూశా.. పిలుస్తోంది నన్నే. ‘ఏంటండీ..’ అంటూ తన కళ్లలోకి చూశా. అమృతం తాగినట్టుగా ఉన్న ఆ కళ్లు నా మనసుకి మైకం తెప్పించాయి. నేను నా ఊహా లోకంలో ఉండగానే చేతిలో ఓ లెటర్‌ పెట్టింది. ‘ఈ అడ్రస్‌ ఎక్కడో.. మీకు తెలుసా?’.. ఆ మాటలతో మత్తు వదిలించుకొని లెటర్‌లోకి తొంగిచూశా. ఈసారి నా కళ్లు మరింత మెరిశాయి. తను మా ఆఫీసులోనే కొత్తగా చేరుతోంది.

అలా ఆఫీసు బయటే మొదలైన మా పరిచయం.. కొద్దిరోజుల్లోనే పరుగులు పెట్టింది. రాగానే మా చూపులు కరచాలనం చేసుకునేవి. నవ్వులు పలకరించుకునేవి. మేమూ ఊరుకుంటామా! క్యాంటీన్లో మాటలు.. వారాంతాల్లో సినిమాలు.. శాలరీ వచ్చినరోజున షాపింగ్‌. కలుసుకునే ఏ అవకాశం వదులుకునేవాళ్లం కాదు. తను పక్కనుంటే గంటలు.. క్షణాల్లా కరిగిపోయేవి.

అప్పటికే తనకి నా మనసులో ఫ్రెండ్‌.. గాళ్‌ఫ్రెండ్‌.. దాటేసి అర్ధాంగి స్థానం ఇచ్చేశా. మరి తను నా గురించి ఏమనుకుంటోంది? ఈ ఊహ రాగానే నాలో ఎక్కడాలేని టెన్షన్‌. ‘నో’ చెబుతుందేమో అని చాలా భయపడ్డా. ఆలస్యం చేయకుండా నా మనసులో మాట చెప్పి.. తన మనసులో ఉన్నదేంటో కనుక్కోవాలనుకున్నా. అందుకు తన పుట్టినరోజే సరైందనుకున్నా. ‘ఐ లవ్యూ డార్లింగ్‌’ అని రాసి, ఓ పెద్ద కేకు తన చేతిలో పెట్టా. బాక్సు తెరవగానే భద్రకాళిలా మారింది. ‘ఏంటిది? పిచ్చిపిచ్చిగా ఉందా?’ అంటూ నిప్పులు కురిపించింది. ఇంకా ఏదో చెప్పబోతుంటే చెంప ఛెళ్లుమనిపించింది. నాతోపాటు అక్కడున్నవాళ్లంతా షాక్‌. ఇంత భయంకరంగా స్పందిస్తుందనుకోలేదు. అయినా తను కొట్టినందుకు బాధ లేదు గానీ.. ఎక్కడ నాతో మాట్లాడ్డం మానేస్తుందో భయం! చివరికి అదే జరిగింది. ఆఫీసులో నేను కనిపిస్తే తల పక్కకి తిప్పుకునేది. క్యాంటీన్లో మాటలు కట్‌. వీకెండ్స్‌లో వినోదాల్లేవు. నో చాటింగ్‌.. నో కాలింగ్‌. పిచ్చి పట్టినట్టుగా ఉండేది నాకు. రోజులు.. వారాలు.. నెలలు ఇదేవరుస. ఎన్ని ప్రయత్నాలు చేశానో! క్షమాపణ అడిగితే కనికరించలేదు. బుజ్జగింపులకు దిగి రాలేదు. చివరికి ఆశలు వదిలేసుకుంటున్న దశలో.. కనికరించింది. ఓరోజు స్వయంగా నా దగ్గరికొచ్చింది. ‘నిన్నెప్పుడూ ప్రేమికుడి దృష్టితో చూడలేదు. మంచి ఫ్రెండ్‌గానే భావించా. అలాగే ఉందాం’ అంది. వెళ్తుండగా.. అడిగితే చిన్న హగ్‌ కూడా ఇచ్చింది. అది చాలదా.. నా ఆశలు మళ్లీ చిగురించడానికి!

స్నేహితులు ప్రేమికులు కారాదనే నియమం ఎక్కడైనా ఉందా? తనెందుకలా సినిమా డైలాగులు చెబుతోంది? ఇప్పటికీ నాకు అర్థం కాని విషయాలవి. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత తను నా చెంతకొచ్చింది. ‘మనం మనసులో గట్టిగా కోరుకుంటే.. ప్రపంచమంతా ఏకమై మనకి సాయంగా వస్తుందట’ ఎవరో మహానుభావుడు చెబితే విన్నా. మరి నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే.. ఎందుకు తిరిగి ప్రేమించదు? ఇప్పుడు అదే నమ్మకంతో ఎదురు చూస్తున్నా. అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా.

పవన్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని