సైగలతో చంపేస్తోంది

ఆర్నెల్ల కిందట మా కింది పోర్షన్‌లో ఒక కుటుంబం అద్దెకు దిగింది. వాళ్లకో ఇంటర్‌ చదివే అమ్మాయి ఉంది. కొన్నాళ్ల నుంచి నన్ను చూసి నవ్వడం, సైగలు చేయడం చేస్తోంది

Updated : 22 Jun 2024 07:32 IST

ఆర్నెల్ల కిందట మా కింది పోర్షన్‌లో ఒక కుటుంబం అద్దెకు దిగింది. వాళ్లకో ఇంటర్‌ చదివే అమ్మాయి ఉంది. కొన్నాళ్ల నుంచి నన్ను చూసి నవ్వడం, సైగలు చేయడం చేస్తోంది. మొదట్లో నేనూ సరదాగా స్పందించేవాడిని. అయితే ఓసారి నేను దుస్తులు ఆరేస్తుంటే వెనక నుంచి వచ్చి హగ్‌ చేసుకొని వెళ్లిపోయింది. ఆ క్షణం నాలో ఏదో తెలియని ఫీలింగ్‌. అయితే బాగా ఆలోచించాక, అది తప్పు అనిపించింది. ఇంకోసారి అలా చేయొద్దని ఆమెతో చెప్పా. అయినా ఆ అమ్మాయి సైగలు ఆపడం లేదు. తన చేష్టలకు స్పందించకపోతే నేనే అల్లరి చేస్తున్నానని వాళ్ల పేరెంట్స్‌తో చెబుతానంటోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను.
- కె.ఎస్‌.ఎం, ఈమెయిల్‌

ఒకమ్మాయి మనపై ఆసక్తి చూపిస్తుంది అనగానే ఏ కుర్రాడికైనా ముందు సంతోషంగానే ఉంటుంది. గాల్లో తేలిపోతుంటాడు. అది సమస్యగా మారుతుందని తెలియగానే ఆలోచనలో పడిపోతాడు. కానీ ఇంటర్‌ చదివే అమ్మాయంటే పద్దెనిమిదేళ్ల లోపే ఉంటుంది. ఆ వయసులో ఎక్కువగా ఆకర్షణ, వ్యామోహాలకు లోనవుతుంటారు. మానసిక పరిపక్వత పెద్దగా ఉండదు. తనంతట తనే వచ్చి హగ్‌ చేసుకుంది అంటున్నారు. 

కేవలం మీరు తన సైగలకు స్పందిస్తే.. అంత చొరవ తీసుకుంటుందా? ఈ వయసులోనే తను అంతగా భయం లేకుండా ఉండటం, సహజంగా అమ్మాయిల్లో ఉండే సిగ్గును వదిలేయడం.. ఇవి ఎవరినీ లెక్క చేయని మనస్తత్వాన్ని సూచిస్తున్నాయి. అంతేకాకుండా నన్ను పట్టించుకోకపోతే మా అమ్మా నాన్నలకు ఫిర్యాదు చేస్తా అని బెదిరించే ధోరణి.. తన మోసకారి మనస్తత్వం, మొండి పట్టుదలను తెలియ జేస్తున్నాయి. ఇలాంటి అమ్మాయిని చాలా జాగ్రత్తగా డీల్‌ చేయాలి. మీరు మీ కుటుంబంతో కలిసి ఉంటుంటే, వెంటనే మీ అమ్మానాన్నలకు జరిగింది చెప్పండి. మీకు ఇబ్బంది కలగకుండా వాళ్లు చూసుకుంటారు. వాళ్లు మిమ్మల్ని ఒక మాట అన్నా ఫర్వాలేదు. ఒకవేళ స్నేహితులతో కలిసి ఉంటుంటే.. నేరుగా వెళ్లి ఆ అమ్మాయి పేరెంట్స్‌తో జరిగింది చెప్పండి. మీకు అలాంటి ఉద్దేశం లేదనీ.. ఇబ్బందిగా ఉందని వివరించండి. తను మరోసారి సైగలు చేయడం, మాట కలపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు గమనించేలా సాక్ష్యం చూపించండి. వాళ్లు ఆ పిల్లను ఎలాగైనా అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తారు. లేదా కొన్నాళ్లు తనకి కనిపించకుండా దూరంగా ఉండండి. కానీ ఏదైనా జరుగుతుందేమో అని నాన్చుతూ కూర్చుంటే.. మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. చివరగా ఓ సలహా. మీరు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నా అన్నారు. అలాంటప్పుడు కింది పోర్షన్‌లోని అమ్మాయి సైగలకు స్పందించడం.. తను కౌగిలించుకున్నప్పుడు అనుభూతికి లోనవడం.. మీ ప్రేమపై అనుమానాలు రేకెత్తిస్తోంది. ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు మనసా, వాచా, కర్మణా.. వారికే కట్టుబడి ఉండటం బంధం బలపడేలా చేస్తుంది. 

అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు