తెలియక తప్పు చేశాను

అక్క అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పుడు తను లేకుండా ఇంట్లోంచి బయటికే వచ్చేవాడిని కాను. అక్కకు నాకూ ఆరేళ్లు తేడా. చాలాకాలం తర్వాత పుట్టిన మగసంతానమని నన్ను కాస్త

Published : 20 Oct 2018 09:00 IST

తెలియక తప్పు చేశాను

అక్క అంటే నాకు ఎంతో ఇష్టం. చిన్నప్పుడు తను లేకుండా ఇంట్లోంచి బయటికే వచ్చేవాడిని కాను. అక్కకు నాకూ ఆరేళ్లు తేడా. చాలాకాలం తర్వాత పుట్టిన మగసంతానమని నన్ను కాస్త ఎక్కువ ముద్దు చేశారు అమ్మానాన్నలు. నాన్న కాంట్రాక్టరు, అమ్మ ఉద్యోగి. ఇద్దరూ ఎప్పుడూ బిజీ. మాతో మాట్లాడటానికే వారికి సమయం ఉండదు. అక్కే నాకు సంబంధించి అన్ని వ్యవహారాలు చూసుకొనేది. స్కూల్‌బ్యాగ్‌ సర్దడం దగ్గర నుంచి స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చాక డ్రెస్‌ మార్చేంత వరకూ అంతా అక్క బాధ్యతే. నాకు ఏం తెచ్చి ఇచ్చినా అక్కతో పంచుకునే వాడిని. హోంవర్క్‌, ఆటలు, పాటలు, అల్లరి అంతా అక్కతోనే. నేను ఏడో తరగతి చదువుతున్నా. అప్పుడు క్రికెట్‌లో సీనియర్లు నన్ను కొడితే... అక్క వచ్చి వారితో గొడవపడి... నాలుగు ఇచ్చింది. అందుకే అక్కంటే నాకు భరోసా. అప్పటి నుంచి ఫ్రెండ్స్‌ ‘రే..వాడిని ఏమీ అనొద్దు... వాళ్ల అక్క వస్తుంద’ని అని భయపడేవారు. 2013లో తను ఇంజినీరింగ్‌లో చేరింది. నేను ఏడో తరగతికొచ్చాను. రవి అని మా వీధిలో అబ్బాయే... అక్క కోసం ఇంటిచుట్టూ తిరుగుతుండేవాడు. తనని అక్క ఎన్నోసార్లు నాముందే తిరస్కరించింది.

తెలియక తప్పు చేశాను అయినా అతను ఆపకుండా వెంటపడేవాడు. నన్ను బుజ్జగించడానికి డెయిరీమిల్క్‌లు, లేస్‌ తెచ్చిచ్చేవాడు. ఒక రోజు నాన్న చాలా సీరియస్‌గా ఇంటికొచ్చి అక్కను కొట్టాడు. ఎవరో అబ్బాయితో అక్క సినిమాకి వెళ్లిందని... అది నాన్న చూశాడని నాకు తెలిసింది. ఆ అబ్బాయి రవే. వాళ్లిద్దరు ప్రేమించుకున్నారని నాకు ఇప్పుడర్థమైంది. ఇప్పుడర్థమైందని ఎందుకు చెప్పానంటే... అప్పట్లో దాని విలువ తెలియదు. ఒకరోజు అక్కా, రవి ఇంట్లోంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ విషయం అక్క నాతో చెప్పింది. తను, రవి తిరుపతికి వెళ్లి పెళ్లిచేసుకుంటామని, ఇంక ఎప్పుడూ తిరిగి రామని చెప్పింది. నన్ను పట్టుకొని ఏడ్చింది. ఆ రోజే రాత్రే వెళ్లిపోతున్నామంది. నాకు భయం వేసింది. అక్క అలా వెళ్లగానే... నేను వెళ్లి నాన్నకు విషయం చెప్పాను. అంతే కోపంతో ఇంట్లోంచి వెళ్లిన నాన్న... రైల్వేస్టేషన్‌ నుంచి అక్కని కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చాడు. గదిలో పెట్టి తాళం వేశాడు. వీధిలో మళ్లీ రవి కన్పించలేదు. 2015 మార్చి 2న అక్క పెళ్లి వేరే అతనితో జరిగిపోయింది. నాన్నకు విషయం చెప్పానని అక్క నాతో మాట్లాడటం మానేసింది. నాకు కొంచెం ప్రపంచం తెలిశాక... అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో...! అప్పటి నుంచి అక్కకు క్షమాపణ చెబుతూనే ఉన్నా. అయినా నాతో మాట్లాడం లేదు. ఇప్పుడు అక్క హైదరాబాద్‌లోనే ఉంటోంది. నేనూ ఇక్కడే చదువుతున్నా. అయినా వాళ్లింటికి వెళ్లలేకపోతున్నా. అక్క ప్రేమను దూరం చేసిన పాపం నాదే. అయితే అది నాకు తెలిసీతెలియని వయస్సు. నేను ప్రేమ విలువ తెలుసుకొనే సరికే.. పూడ్చలేని నష్టం జరిగిపోయింది. ‘అక్కా... నాన్నతోనే మాట్లాడుతున్నావే... నాతో ఎందుకు మాట్లాడ లేవు? నాకు అమ్మ కన్నా నువ్వే ఎక్కువ. అలాంటిది నువ్వు దూరంగా ఉంటుంటే తట్టుకోలేకపోతున్నా. నన్ను క్షమించి మాట్లాడు ప్లీజ్‌.’

- నీ తమ్ముడు విమల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని