విడిపోనా? కలిసి ఉండనా?

నేనోకార్పొరేట్‌ కంపెనీలో పని చేస్తా. నా సహోద్యోగి నాపై విపరీతమైన ప్రేమ కురిపిస్తాడు.

Updated : 20 Mar 2021 09:47 IST

నేనో కార్పొరేట్‌ కంపెనీలో పని చేస్తా. నా సహోద్యోగి నాపై విపరీతమైన ప్రేమ కురిపిస్తాడు. బాగోగులన్నీ చూస్తాడు. నన్ను ఇంప్రెస్‌ చేయడానికి చిన్నచిన్న బహుమతులు ఇస్తుంటాడు. కేరింగ్‌ మనస్తత్వం అనే ఉద్దేశంతో అతడితో పెళ్లికి ఒప్పుకున్నా. మావాళ్లూ ఓకే చెప్పారు. ఇప్పుడు సమస్య ఏంటంటే.. నేను వేరేవాళ్లతో మాట్లాడితే తనకి నచ్చదంటాడు. నన్ను ఎక్కువగా పట్టించుకోవాలి అంటాడు. ఏదైనా కొంచెం గట్టిగా చెబితే బాధ పడతాడు. తన తీరు నచ్చడం లేదు. బ్రేకప్‌ చెబుదామా అంటే.. తనెక్కడ అఘాయిత్యం చేసుకుంటాడేమో అని భయంగా ఉంది. మరోవైపు తన ప్రేమలో నిజాయతీ ఉందనే నమ్మకముంది. ఏం చేయాలి?   - కావ్య, హైదరాబాద్‌ 

తను మీ పట్ల చూపించే ప్రేమకి ఆకర్షితురాలై ప్రేమించారా? లేదా అతడంటే మీకూ ఇష్టమేనా? ఈ విషయం తేల్చుకోండి. ఎందుకంటే కేవలం తను మీపై చూపే ఇష్టం, మీకు ఇచ్చే అటెన్షన్‌ నచ్చి ప్రేమిస్తే భవిష్యత్తులో అతడిని భరించటం కష్టమవుతుంది. అలా కాకుండా మీరూ అతడిని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే అప్పుడు మీరు దేనికీ భయపడకుండా ప్రతి సమస్యకి పరిష్కారం వెతకగలుగుతారు. మీరు చెబుతున్న విషయానికొస్తే మీరు వేరేవారితో మాట్లాడటం అతనికి నచ్చట్లేదు అంటున్నారు. అది మీమీద అతి ప్రేమా? లేక అనుమానమా? అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఉద్యోగరీత్యా మీరు ఇతరులతో తరచూ మాట్లాడుతుంటే, సన్నిహితంగా ఉంటే తను మరింతగా కుంగిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అతడిది మీపై అతి ప్రేమే అయితే తనని కూర్చోబెట్టి అసలు ఎందుకిలా అనిపిస్తుందో కనుక్కోండి. నేను ఇతరులతో మాట్లాడటం నీకు ఎందుకు నచ్చదని అడగండి. ఎక్కువగా ప్రేమిస్తే పొజెసివ్‌నెస్‌ ఉండటం సహజం. కానీ ఆ అమ్మాయి/అబ్బాయి నాకు దక్కదు అనే అభద్రతాభావంగా మారినప్పుడే సమస్య ఉత్పన్నం అవుతుంది. నీపై నాకు ప్రేమ ఉంది అని నమ్మకంగా చెప్పండి. ఇంత చెప్పినా తన ప్రవర్తనలో మార్పులేదు, అర్థం చేసుకోవడం లేదు, అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అంటే ఒక మానసిక నిపుణుడిని సంప్రదించి ప్రి మారిటల్‌ కౌన్సెలింగ్‌ తీసుకోండి. ఇందులో భయపడాల్సిన, బాధ పడాల్సిన పనేం లేదు. ఎటువంటి బంధంలో అయినా కొన్ని సర్దుబాట్లు తప్పవు. ఒకరి అభిప్రాయాలు మరొకరు అర్థం చేసుకొని, గౌరవించుకుంటే ఇలాంటి సమస్యలు కౌన్సెలింగ్‌ ద్వారా తేలికగా పరిష్కారం అవుతాయి.- అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని