ఫెయిలయ్యా.. నమ్మకం పోతోంది

నేనో ఉన్నతోద్యోగిని. మంచి హైక్‌ ఇవ్వడంతో కొన్నాళ్ల కిందట వేరే కంపెనీకి మారా. అక్కడికెళ్లాక ఊపిరి సలపనంత పని. ఎక్కువమంది ఉద్యోగులను సమన్వయం చేయాలి.

Updated : 15 May 2021 04:42 IST

మనలో మనం

నేనో ఉన్నతోద్యోగిని. మంచి హైక్‌ ఇవ్వడంతో కొన్నాళ్ల కిందట వేరే కంపెనీకి మారా. అక్కడికెళ్లాక ఊపిరి సలపనంత పని. ఎక్కువమంది ఉద్యోగులను సమన్వయం చేయాలి. మొదటి రెండు ప్రాజెక్టులు అనుకున్నంత సక్సెస్‌ కాలేదు. ‘మీపై చాలా నమ్మకం పెట్టుకున్నా. ఇలా ఫెయిల్‌ అవుతారనుకోలేదు’ అన్నారు బాస్‌. అప్పట్నుంచి భయం పట్టుకుంది. గతం కన్నా రెట్టింపు పని చేస్తున్నా సక్సెస్‌ కావడం లేదు. నాపై నాకే నమ్మకం పోతోంది. మళ్లీ కంపెనీ మారాలా?

- ఎస్‌.దేవి, హైదరాబాద్‌

‘కష్టే ఫలి’, ‘హై రిస్క్‌ హై రిటర్న్‌.. లో రిస్క్‌ లో రిటర్న్‌’ అనేవి వినే ఉంటారు. మంచి వేతనంతో వేరే ఉద్యోగంలో చేరినప్పుడు తప్పకుండా మీ పని కూడా మారుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. దానికి ముందుగానే సిద్ధమై ఉండాలి. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే పని ఒత్తిడి పెరిగింది అని అర్థమవుతోంది. అలవాటు లేని కొత్త వాతావరణం, అత్యధిక పని మూలంగా మీరు అనుకున్న ఫలితం సాధించలేకపోయి ఉండొచ్చు. అదే సమయంలో మీ బాస్‌ అన్న మాటలు మరింత బాధ పెట్టొచ్చు. దాన్ని సీరియస్‌గా తీసుకొని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అవే మాటల్ని కసిగా తీసుకొని మీ బెస్ట్‌ ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరేంటో నిరూపించుకోండి. ఆత్మవిశ్వాసాన్ని మించిన ఆయుధం లేదనే విషయం మర్చిపోవద్దు. హోదా, సంపాదన పెరిగినకొద్దీ బాధ్యతలు, సవాళ్లు పెరగడం సహజం. వృత్తిగత అనుభవాన్ని ఊతంగా చేసుకొని మరింత ముందుకెళ్లాలే తప్ప అధైర్యపడొద్దు. ఈ క్రమంలో మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవడానికి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలి. మీ రంగంలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. ఒక్కసారి మీ కెరీర్‌ మొదలుపెట్టినప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకోండి. అప్పట్లో ఇంతకన్నా ఎక్కువగా కష్టపడి ఉంటారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎలా పైకి వచ్చారో మననం చేసుకోండి. అప్పుడైనా మీమీద మీకు నమ్మకం పెరుగుతుంది. జీవితంలో ఏం సాధించాలన్నా ముందు మనపై మనకు నమ్మకం ఉండాలి. దీన్నే ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకు వెళ్లండి. ఆల్‌ ది బెస్ట్‌.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని