అదంతా రొమాన్సేనట..

ఆన్‌లైన్‌లో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. ఆరునెలల్లో బాగా దగ్గరయ్యాం. నా ప్రతి అవసరం తీర్చుతాడు. విపరీతమైన ప్రేమ చూపిస్తాడు. కానీ ఈ మధ్య.. న్యూడ్‌ ఫొటోలు పంపమంటున్నాడు. వీడియో కాల్స్‌ మాట్లాడమంటాడు. ఇదంతా రొమాన్స్‌లో భాగం అంటున్నాడు. తనది నిజమైన ప్రేమా? నన్ను మోసం చేయాలనుకుంటున్నాడా? అర్థం కావడం లేదు?

Updated : 17 Jul 2021 04:01 IST

మనలో మనం

ఆన్‌లైన్‌లో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. ఆరునెలల్లో బాగా దగ్గరయ్యాం. నా ప్రతి అవసరం తీర్చుతాడు. విపరీతమైన ప్రేమ చూపిస్తాడు. కానీ ఈ మధ్య.. న్యూడ్‌ ఫొటోలు పంపమంటున్నాడు. వీడియో కాల్స్‌ మాట్లాడమంటాడు. ఇదంతా రొమాన్స్‌లో భాగం అంటున్నాడు. తనది నిజమైన ప్రేమా? నన్ను మోసం చేయాలనుకుంటున్నాడా? అర్థం కావడం లేదు?

- జీఎస్‌ఆర్‌, ఈమెయిల్‌

నం ప్రేమించే వ్యక్తిపై మనకు చాలా నమ్మకం ఉంటుంది. వారు మనల్ని మోసం చేయరని, ఎప్పటికీ మనతోనే కలిసి ఉంటారని నమ్ముతుంటాం. అందరి జీవితాలు ఇలా ఉండవు. కొంతమంది మోసపోతుంటారు. ఇది జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి రిలేషన్‌లో ఉన్నామో గుర్తించాలి. టాక్సిక్‌ రిలేషన్‌షిప్‌ అనిపిస్తే వెంటనే బయటపడాలి.

మీ విషయానికొస్తే మీ భాగస్వామికి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉంటే ముందే గుర్తించవచ్చు. తన సామాజిక మాధ్యమ ఖాతాలను ఓసారి గమనించండి. తన స్నేహితులు, పోస్ట్‌లు, ఎలా ఉన్నాయో పరిశీలించండి. వీటన్నింటి ఆధారంగా ఓ అంచనాకు రావచ్చు. సోషల్‌ మీడియాలోనే కాదు.. బయట అతడు ప్రవర్తించే పద్ధతితో కూడా మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చు. మీరు ఎంత దగ్గరైనా న్యూడ్‌ ఫోటోలు పంపించమంటున్నాడంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే! వయసు చేసే అలజడితో తను అలా అడిగి ఉండొచ్చు. కాబోయే జీవిత భాగస్వామే కదా అని మీరు పంపించడానికి సిద్ధపడి ఉండొచ్చు. కానీ అంతకంటే ముందు మీ సందేహాన్ని మాతో పంచుకొని మంచి పని చేశారు. అలాంటి ఫొటోలు పంపుకోవడం మన సంస్కృతే కాదు. పైగా ఇది చాలా సమస్యలకు దారి తీస్తుంది. ప్రమాదకరం. ఈమధ్య సామాజిక మాధ్యమాల్లో కొందరు సైబర్‌ నేరగాళ్లు ఇలాగే అమ్మాయిలతో ముందు మంచిగా పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత న్యూడ్‌ చిత్రాలు పంపమని అడుగుతున్నారు. తీరా పంపించిన తర్వాత వారి నిజస్వరూపం బయట పెడుతున్నారు. వాటిని అమ్మాయి పేరెంట్స్‌కి పంపిస్తామని, ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరిస్తారు. డబ్బులు ఇవ్వమనీ లేదా కోరిక తీర్చమని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. మీ బోయ్‌ఫ్రెండ్‌ అలాంటి వాడు అయినా, కాకపోయినా జాగ్రత్తగా ఉండటం అవసరం.

తనలా ఎందుకు అడుగుతున్నాడో నిలదీయండి. అది తప్పని అర్థమయ్యేలా నచ్చజెప్పండి. నిజంగా మీరిద్దరూ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందు పెద్దవాళ్లని ఒప్పించమనండి. పెళ్లయ్యాక ఇద్దరూ మానసికంగా, శారీరకంగా నచ్చినట్టుగా దగ్గరవడం పద్ధతైన విషయం. ఇలా అతడ్ని ఒప్పించినప్పుడే మీ వ్యక్తిత్వం నిలబడుతుంది. అతడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడో, లేదో తెలిసిపోతుంది. ఇది మీ జీవితం. మొహమాటానికి పోయి సైబర్‌ నేరగాళ్లకు చిక్కి దాన్ని చేజేతులా నాశనం చేసుకోవద్దు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని