చెప్పమంటోంది.. నా మనసు

నేనో కార్పొరేట్‌ కంపెనీలో పని చేసేవాణ్ని. గతేడాది లాక్‌డౌన్లో ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇవన్నీ దాచిపెట్టి మావాళ్లు నాకో సంబంధం ఫిక్స్‌ చేశారు.

Updated : 14 Aug 2021 05:33 IST

నేనో కార్పొరేట్‌ కంపెనీలో పని చేసేవాణ్ని. గతేడాది లాక్‌డౌన్లో ఉద్యోగం పోయింది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇవన్నీ దాచిపెట్టి మావాళ్లు నాకో సంబంధం ఫిక్స్‌ చేశారు. ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పారు. నవంబరులో పెళ్లి. ఇది వాళ్లని మోసం చేయడమే కదా అంటే ఈలోపు ఏదో ఒక జాబ్‌ దొరుకుతుందిలే అంటున్నారు మావాళ్లు. ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పాలా?

కె.ఎస్‌., కరీంనగర్‌

రోనా విపత్తు ప్రపంచ ముఖచిత్రాన్నే మార్చేసింది. మనుషుల జీవనశైలిపై శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ప్రభావం చూపించింది. ఆ మహమ్మారి మన జీవితాల్ని ప్రభావితం చేయడమే కాదు.. ఎన్నో జీవిత పాఠాలు నేర్పించింది కూడా.
మీ విషయానికొస్తే.. పెళ్లి చేయాలనే తొందరలో మీరు జాబ్‌ చేస్తున్నారని మీవాళ్లు అబద్ధం చెప్పడం సబబు కాదు. కానీ రెండు, మూడు నెలల్లో మీరు మరొక ఉద్యోగం సంపాదించగలరనే నమ్మకంతో అలా చెప్పి ఉండొచ్చు. పెద్దల నమ్మకాన్ని అంత తేలికగా తీసిపారేయలేం! పెళ్లైన తర్వాతే జీవితంలో స్థిరపడ్డవాళ్లు చాలామంది ఉన్నారు. అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న సమస్యని కాబోయే జీవిత భాగస్వామితో తప్పకుండా చెప్పండి. ఇద్దరూ చర్చించుకుంటే మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. దాపరికాలు ఉండొద్దు. పైగా పెళ్లయ్యాక సంసార బాధ్యతలు మొదలవుతాయి. మీరిద్దరూ ఆనందంగా ఉండాలంటే ఆర్థిక ఇబ్బందులు రాకూడదు. ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఆమెను పెళ్లి చేసుకుంటే మీరు ఇబ్బంది పడతారు. మిమ్మల్నే నమ్ముకుని మీ జీవితంలోకి వచ్చిన తనూ కష్టాలు పడాల్సి ఉంటుంది. ముందే అన్ని విషయాలూ ఓపెన్‌గా మాట్లాడుకొని, మీ సమస్యకు పరిష్కారం దొరికిన తర్వాతే పెళ్లి చేసుకోవడం మంచిది. నిజాన్ని నిర్భయంగా చెబితే మీలోని నిజాయతీ ఆమెకు నచ్చి మీకో మంచి పరిష్కారం కూడా సూచించవచ్చు. ఒక్కోసారి ఎదుటి వాళ్లతో చర్చిస్తే అద్భుతమైన ఆలోచనలు వచ్చి మన జీవితం కూడా మారిపోతుంటుంది. వీటన్నింటికన్నా ముందు మీరు నిశ్చింతగా ఉండండి. మీకు ఉద్యోగం చేసిన అనుభవం ఉంది. ఉరకలేసే వయసు, కాలంతో పోటీపడగల సామర్థ్యం ఉన్నాయి. కొత్త ఉద్యోగం సంపాదించడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు. నమ్మకంతో అడుగేస్తే విజయం సొంతమవుతుంది. జీవిత భాగస్వామిని మోసం చేయకూడదనే మీ మంచి ఆలోచనే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఆల్‌ ది బెస్ట్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని