అప్పుడు వద్దన్నాడు.. ఇప్పుడు పెళ్లంటున్నాడు!

కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయిని గాఢంగా ప్రేమించా. తన సంతోషం కోసం ఎంతో చేశాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌ పెట్టుకొని నన్ను మోసం చేశాడు. చాలా

Published : 09 Oct 2021 01:23 IST

మనలో మనం

కాలేజీలో ఉన్నప్పుడు ఒకబ్బాయిని గాఢంగా ప్రేమించా. తన సంతోషం కోసం ఎంతో చేశాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ తను వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌ పెట్టుకొని నన్ను మోసం చేశాడు. చాలా బాధపడ్డాను. చివరికి బ్రేకప్‌ చెప్పేశాను. మూడేళ్ల తర్వాత తను మళ్లీ కాంటాక్ట్‌లోకి వచ్చాడు. తప్పు చేశాను క్షమించమనీ, పెళ్లి చేసుకుందామని అంటున్నాడు. మరోవైపు నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. ఆ అబ్బాయిని కాదనలేక, ఔననలేక ఎటూ తేల్చుకోలేకపోతున్నా. ఏం చేయమంటారు?

- కె.ఎల్‌., ఈమెయిల్‌

దురదృష్టవశాత్తు నేటి యువత మేం తెలివైనవాళ్లం అనుకుంటూనే సులువుగా మోసపోతున్నారు. వ్యామోహమో, ఆకర్షణో తెలియక దానికే ప్రేమ అనే రూపాన్ని ఊహించుకుని ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అందంగా ఉన్నా, ఆకట్టుకునేలా మాట్లాడినా, జల్సాగా తిరిగినా, ఎదుటివాళ్లపై జోకులేస్తూ గొప్పలకు పోయినా ప్రేమలో పడిపోయేవాళ్లను చూస్తున్నాం. ఒకరు మాది ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌’ అంటారు. ఇంకొకరు నిశితంగా పరిశీలించి ప్రేమించామంటారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. మోసం చేయాలనుకునేవాళ్లకు తాము చేస్తున్న తప్పేంటో తెలుసు. నిజాయతీగా ఉండేవాళ్లను కూడా వంచిస్తున్నారంటే.. అది కావాలని చేస్తున్న పనే. ప్రేమంటే బొమ్మలాట కాదు. మీరెంతో ఇష్టపడ్డ వ్యక్తి వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌ పెట్టుకున్నాడని మీరే చెబుతున్నారు. ఇప్పుడు తననీ కాదని మళ్లీ మీ వెంట పడుతున్నాడంటే తను ఒక్కరిని కాదు.. ఇద్దరినీ మోసం చేశాడని అర్థం. తన కోరిక తీర్చుకోవడానికి ఆడుతున్న నాటకమే. చంచల మనస్తత్వం ఉన్న ఇలాంటివాళ్లకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మాయమాటలతో మభ్యపెట్టే వ్యక్తితో  పెళ్లైతే మళ్లీ మోసం చేయడనే గ్యారెంటీ ఏంటి? ఇప్పటికైనా మించిపోయింది లేదు. సమస్యకు సమాధానం ఏంటో ఒక్కసారి మీ అంతరాత్మనే ప్రశ్నించుకోండి. తల్లిదండ్రులు ఏం చేసినా పిల్లల బాగు కోసమే. వాళ్ల అనుభవంతో.. ఏది మంచో, ఏది చెడో యోచించి మీకు సరైన భాగస్వామిని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. నిదానంగా ఆలోచించండి. ఏ నిర్ణయం తీసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటుందో మీకే బోధ పడుతుంది. ఆల్‌ ది బెస్ట్‌!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని