నేను మంచిదాన్నా.. చెడ్డదాన్నా?

‘నిన్ను ప్రేమిస్తున్నా.. నువ్వంటే ప్రాణం’ అంటూ గతంలో ఒకబ్బాయి వెంట పడేవాడు. నేను ‘ఎస్‌’, ‘నో’ ఏదీ చెప్పలేదు. బెదిరించో, బతిమాలో బయటికి తీసుకెళ్లేవాడు. ఈలోగా ఇంట్లోవాళ్లు నాకో సంబంధం

Published : 11 Dec 2021 00:21 IST

‘నిన్ను ప్రేమిస్తున్నా.. నువ్వంటే ప్రాణం’ అంటూ గతంలో ఒకబ్బాయి వెంట పడేవాడు. నేను ‘ఎస్‌’, ‘నో’ ఏదీ చెప్పలేదు. బెదిరించో, బతిమాలో బయటికి తీసుకెళ్లేవాడు. ఈలోగా ఇంట్లోవాళ్లు నాకో సంబంధం కుదిర్చారు. ఆ పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. భయపడి ఆ విషయం కాబోయే భర్తకి చెప్పి పెళ్లి క్యాన్సిల్‌ చేయాలని అడిగా. తర్వాత ప్రేమిస్తున్నానన్నవాడూ హ్యాండిచ్చాడు. దాంతో నిశ్చితార్థం అయిన వ్యక్తినే బతిమాలి మావాళ్లు వివాహం జరిపించారు. తర్వాత కొద్దిరోజులకే ఆ అబ్బాయి మేం గతంలో కలిసి దిగిన ఫొటోలు పంపుతూ కలవాలంటూ బెదిరింపు మెసేజ్‌లు పంపసాగాడు. ఓసారి ఆ ఫొటోలు, మెసేజ్‌లు మా ఆయన చూశారు. అప్పట్నుంచి నేను తనని మోసం చేశానని బాధ పడుతున్నారు. నువ్వు నాకు వద్దంటున్నారు. మా ఆయన మంచివారు. తనని వదులుకోవడం నాకిష్టం లేదు. ఇదంతా నావల్లే జరిగిందని రోజూ కుమిలిపోతున్నా. ఇంతకీ నేను మంచిదాన్నా? చెడ్డదాన్నా? ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి?

- ఆర్‌.ఎం., ఈమెయిల్‌

జీవితంలో తప్పులు అందరూ చేస్తారు. వాటిని సరిదిద్దుకున్నవారే ఆనందంగా జీవిస్తారు. నేను మంచిదాన్నా? చెడ్డదాన్నా? అని మీరడిగినప్పుడే మిమ్మల్ని మీరు పరిశీలించుకోగలరని అర్థమైంది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే ముందు మీ భర్తతో మనసు విప్పి మాట్లాడండి. తనని మీరెంతగా ప్రేమిస్తున్నారో వివరించండి. దూరం పెట్టడం వల్ల మీరెంత క్షోభ అనుభవిస్తున్నారో తెలియజేయండి. భార్యాభర్తల మధ్య విభేదాలొస్తే ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. సమస్యకు కారణం మీరే కాబట్టి సహనం, ఓపిక, సమయస్ఫూర్తితో మీ భర్తని ఆకట్టుకునే ప్రయత్నం చేయండి. పెళ్లంటే నచ్చినప్పుడు దగ్గరకు తీసుకుని నచ్చకపోతే దూరమయ్యే బొమ్మలాట కాదు. ముందు నుంచీ ఆ అబ్బాయి మిమ్మల్ని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు కూడా. ఆ విషయాలన్నీ మీ ఆయనకు తెలియజేయండి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫొటోలు, ఎసెమ్మెస్‌లు సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని సెల్‌ఫోన్‌లో ఉంచానే తప్ప ఆ కుర్రాడిపై మరెలాంటి ఉద్దేశం లేదని స్పష్టంగా తెలియజేయండి. మిమ్మల్ని తప్ప వేరొకరిని ప్రేమించే ప్రసక్తే లేదని భరోసా ఇవ్వండి. ఆఖరి ప్రయత్నంగా మీ పరిస్థితిని పెద్దలకి చెప్పి వారి సమక్షంలోనే సమస్య పరిష్కరించుకోండి. మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా ఆ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడండి. అప్పటికీ వినకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ వెనకాడొద్దు. ఇన్ని జరిగినా మీ ఆయన అర్థం చేసుకోకపోతే ఓసారి ఇద్దరూ మానసిక నిపుణులను సంప్రదించండి. చివరిగా ఒక మాట. కోరుకున్నవారి మనసులో చోటు సంపాదించడం సినిమాల్లో చూపించినంత తేలికేం కాదు. నమ్మకమనే పునాది బలంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. భార్యాభర్తలిద్దరూ ఈ సూత్రాలు పాటిస్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది.

- టీఎస్‌ రావు, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు