గడప దాటిన నాకు కంటి వెలుగైంది

నాకే ఎందుకిలా జరుగుతోంది? నేనేం పాపం చేశాను? ఇలా ఎన్నిసార్లు అనుకునేదాన్నో.. ఎంతగా ఏడ్చానో! అలల తాకిడికి నడి సంద్రంలోకి వచ్చిపడ్డ నావలా ఒంటరైపోయానని ఎంతగా కుమిలిపోయానో.. కానీ నాకిప్పుడో ఆదరవు దొరికింది. తీరం చేరి జీవితాన్ని గెలుస్తాననే నమ్మకం కలిగింది.

Updated : 18 Dec 2021 03:26 IST

నాకే ఎందుకిలా జరుగుతోంది? నేనేం పాపం చేశాను? ఇలా ఎన్నిసార్లు అనుకునేదాన్నో.. ఎంతగా ఏడ్చానో! అలల తాకిడికి నడి సంద్రంలోకి వచ్చిపడ్డ నావలా ఒంటరైపోయానని ఎంతగా కుమిలిపోయానో.. కానీ నాకిప్పుడో ఆదరవు దొరికింది. తీరం చేరి జీవితాన్ని గెలుస్తాననే నమ్మకం కలిగింది.

నేను చదువులో మెరిట్‌ కాదు.. అందగత్తెని అంతకన్నా కాదు. అయినా క్లాస్‌మేట్స్‌ అంతా నాచుట్టే మూగేవారు. నాకన్నా నా అల్లరి అందంగా ఉండేది. పక్కవాళ్లని ఎలా హ్యాపీగా ఉంచాలో తెలిసినదాన్ని. గొప్పలు చెప్పుకోవడం లేదు.. ఇవన్నీ నా ఫ్రెండ్స్‌ చెప్పిన మాటలే. ‘నువ్వు బంగారం..’, ‘నువ్వే నా బెస్టీవే..’ ఇలాంటివెన్ని విన్నానో! ఫేర్‌వెల్‌ రోజైతే ఓ పదిమందైనా నన్ను పట్టుకొని ఏడ్చారు. అందరితో అలా మంచి అనిపించుకున్న నా జీవితం కారుచీకట్లలోకి జారుకుంటుందని ఊహించలేదు.

‘కన్నవాళ్లు ఏం చేసినా మనమంచికే’ అన్నది నా నమ్మకం. అదే నిజం కూడా. చదువైపోగానే నాకో సంబంధం తెచ్చారు అమ్మానాన్నలు. బుద్ధిగా తలొంచుకొని తాళి కట్టించుకున్నా. కొత్త జీవితం గురించి కోటి కలలు కన్నా. కానీ.. కన్నీళ్లే ఎదురొచ్చాయి. ‘అసలు నాకీ పెళ్లే ఇష్టం లేదు. అమ్మకోసం నిన్ను చేసుకున్నా’ పారాణి ఆరకముందే చెప్పేశాడాయన. ఎలా స్పందించాలో కూడా తెలియలేదు.

చిలకాగోరింకల్లా ఉండాల్సిన సమయంలో మా మధ్య చిటపటలు, అలకలు, కోపతాపాలు. అయినా ఓపిక పట్టా. తనని ఎలాగైనా మార్చుకోవాలనుకున్నా. కానీ సహకరిస్తేగా! విషయం తెలిసి మావాళ్లు కుమిలిపోయారు. తెలియక నీ గొంతు కోశామని ఏడ్చారు. పంచాయతీ పెద్దల ముందుకెళ్లింది. ‘ఊరు మారితే తను మారొచ్చేమో’ అంటూ మమ్మల్ని వేరేచోటికి పంపారు. అక్కడికెళ్లాక ‘పెనం మీంచి పొయ్యిలోకి పడ్డట్టుగా’ తయారైంది నా పరిస్థితి. అడిగేవాళ్లు లేరు. ‘నువ్వేం అందంగా ఉండవు’, ‘నిన్ను చేసుకోవడం నా ఖర్మ’ తెల్లారితే ఇదే సణుగుడు. ‘మరలాంటప్పుడు నన్నెందుకు చేసుకున్నావ్‌?’ ఓసారి గట్టిగానే నిలదీశా. చేతల్లోకి దిగాడు. అప్పట్నుంచి తిట్టడం, కొట్టడం.. మామూలైంది. ఈ కలహాల కాపురంలోనే మాకో పాప పుట్టింది. అయినా మారడే!

అమ్మానాన్నలతో చెబితే సర్దుకుపోవాలన్నారు. సమాజం, కట్టుబాట్లని నసిగారు. వాళ్ల కోసం ఎంత భరించానో! ఇంక నావల్ల కాలేదు. విసిగిపోయాను. తెగించాను. ఆరునెలల చంటిదాన్ని చంకనేసుకొని పుట్టింటికొచ్చా. ఎవరో చెప్పినట్టు.. ‘చితిమంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది.. పతి విడిచిన సతి గమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది’ అన్నది నా విషయంలో నిజమైంది. కూతురు బాగు చూడాల్సినవాళ్లు ఎవరేం అనుకుంటారో అని వణికిపోయేవాళ్లు. బంధువులు రాబందుల్లా ప్రశ్నలతో వేధించేవారు. ఏం చెప్పను? రోజూ చావులాంటి బతుకే. ఓరోజు దృఢమైన నిర్ణయం తీసుకున్నా. సమాజం.. కట్టుబాట్లు.. బంధుత్వాలు.. అన్నింటినీ వెలేశాను. నాకు నేను.. నాకు పాప.. అంతే.. గడప దాటాను.

నిశీధి కనుమరుగైతే ఉషోదయం వస్తుంది.. జగతికి వెలుగులు పంచుతుంది. బతికేదెలా? అని ఆలోచిస్తున్న నా జీవితంలోకి వెలుగులా వచ్చింది అన్నపూర్ణ. నాకన్నా వయసులో పెద్ద. నేను ‘అక్కా’ అని పిలిస్తే అమ్మలా ప్రేమ పంచింది. నా కష్టాలు కనిపెట్టి నాన్నలా భరోసా ఇచ్చింది. ఇప్పుడు నాకు తోడు, నీడ, బలం, ధైర్యం, నమ్మకం.. అన్నీ తనే. రాక్షసుల్లాంటి మనుషులున్న ఈ సమాజంలోనే అన్నపూర్ణక్కలాంటి దేవతలుంటారా? అని ఒక్కోసారి అనుమానం వచ్చేది. అంత నిస్వార్థంగా ఉంటుంది తను. జీవితంలో తిరిగి రావనుకున్న రోజుల్ని వెనక్కి తెప్పించింది. ‘ఇన్ని చేస్తున్న నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోను అక్కా’ అని అడిగానోసారి. ‘నువ్వెప్పుడూ సంతోషంగా ఉంటానని మాటివ్వు’ అంది. తను కోరినట్టే ఉంటున్నా. ఇప్పుడు మీముందుకు ఎందుకొచ్చానంటే.. జీవితంలో అన్నీ కోల్పోయాం.. చావు తప్ప వేరే దిక్కు లేదు అని భావించేవాళ్లు ఎంతోమంది. అలాంటివాళ్లు ఒక్కసారి ప్రయత్నిస్తే అన్నపూర్ణ లాంటివాళ్లు ఎక్కడో ఒకచోట తారసపడకపోరు. మోడువారిన జీవితాల్లోకి మళ్లీ వసంతం పూయిస్తారు. ప్రయత్నించండి.

- జె.ఎస్‌.ఎల్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని