Updated : 05 Feb 2022 05:05 IST

వాళ్లావిడకన్నా..నేనే ఇష్టమట!

నేనొక ఐటీ ఉద్యోగిని. ఏడాది కిందట ఒకబ్బాయి పరిచయమయ్యాడు. అతనితో స్నేహం ప్రేమగా మారడంతో అన్నిరకాలుగా దగ్గరయ్యా. తనకి పెళ్లై పిల్లలున్నారనే షాకింగ్‌ విషయం తర్వాత తెలిసింది. మోసపోయానని నిలదీశాను.. గొడవ చేశాను. అప్పట్నుంచి నన్ను దూరం పెట్టసాగాడు. కొన్నాళ్లయ్యాక నేనూ మాట్లాడ్డం మానేశా. అయితే కొద్దిరోజుల కిందట తను మరో అమ్మాయితో తిరగడం చూశా. కానీ ఏమైందో తెలియదు.. నాల్రోజుల కిందట నా దగ్గరకొచ్చి ‘నేను పెద్ద తప్పు చేశా. ప్రేమంటే ఏంటో నాకిప్పుడు తెలిసొచ్చింది. మా ఆవిడకన్నా నువ్వే ఇష్టం. మనిద్దరం గుళ్లో పెళ్లి చేసుకుందాం’ అంటున్నాడు. నాకంతా అయోమయంగా ఉంది. నేనతడ్ని నమ్మొచ్చా?

- ఎస్‌.ఆర్‌., హైదరాబాద్‌


విషయం, సమస్యని సవివరంగా చెప్పినందుకు అభినందనలు. గతంలో ఒకసారి మోసపోయిన మీరు మళ్ళీ గుడ్డిగా నమ్మకండా మిమ్మల్ని మీరు చెక్‌ చేసుకోవడం మంచి పరిణామం. మీకు వయసు, మంచి ఉద్యోగం ఉండటంతో పెళ్లి అనేది సమస్యే కాదు. మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి చాలామంది అబ్బాయిలు ముందుకొస్తారు. ముందు అతడి మైకం నుంచి బయట పడండి. కెరీర్‌, ఆర్థికంగా స్థిరపడటంపైనే మనసు పెట్టండి. మీతో బ్రేకప్‌ తర్వాత తను మరో అమ్మాయితో కూడా తిరగడం చూశానంటున్నారు.. దీన్ని బట్టి చూస్తే తన వ్యక్తిత్వం ఎలాంటిదో మీకు అర్థమై ఉండాలి. అతన్ని మర్చిపోవడం మాటల్లో చెప్పినంత తేలిక కాకపోవచ్చు. కానీ అతడి కోసం మీ భవిష్యత్తును పాడు చేసుకోవడం అవసరమా? పైగా పెళ్లైన వాడితో ఉండటం.. న్యాయపరంగానూ సమ్మతం కాదు. ఒకవేళ అతడు చెప్పినట్టే పెళ్లాడినా, మీపై వ్యామోహం తీరిన తర్వాత మొహం చాటేయడనే గ్యారెంటీ ఏంటి? ఇవన్నీ ఆలోచించండి. మంచి ఉద్యోగం సంపాదించి సొంతకాళ్లపై నిలబడినట్టే.. అతడి కబుర్లు, కల్లబొల్లి మాటలకు లొంగిపోకుండా ఓ మంచి నిర్ణయం తీసుకోండి. మీ భావి జీవితాన్ని మీరే నిర్మించుకోండి. ఆల్‌ ది బెస్ట్‌.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని