ప్యార్‌ మే పడిపోతే..?

ప్రేమలో పడ్డవాళ్లు ‘పడ్డామండీ ప్రేమలో మరీ...’ అంటూ సంబరాలు చేసుకుంటారు. పడనివాళ్లు.. పడిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అంతేమరి... ప్రేమంటే ఓ మత్తు.. మైకం.. చెప్పాలంటే ఓ వ్యసనం. అంతేకాదు.. లవ్‌లో మునిగితే ఒంటికి బోలెడు

Updated : 12 Feb 2022 02:41 IST

ప్రేమలో పడ్డవాళ్లు ‘పడ్డామండీ ప్రేమలో మరీ...’ అంటూ సంబరాలు చేసుకుంటారు. పడనివాళ్లు.. పడిపోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అంతేమరి... ప్రేమంటే ఓ మత్తు.. మైకం.. చెప్పాలంటే ఓ వ్యసనం. అంతేకాదు.. లవ్‌లో మునిగితే ఒంటికి బోలెడు లాభాలు కూడా! ‘నిజ్జంగా అంత సీన్‌ ఉందా?’ అని నవ్వుకోవద్దు బాస్‌. ఇది నిండా ప్యార్‌లో మునిగిన ప్రేమికుల మాట కాదు.. వైద్య నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు బల్ల గుద్ది మరీ చెబుతున్న వాస్తవం. ఆ సంగతులు, వివరాలు ఏంటంటే...

నసు గెలిచిన ప్రేయసి కళ్లెదురుగా ఉంటే కుర్రాడి ముఖం వేయి వాట్ల బల్బులా వెలిగిపోతుంది. వలచిన చెలికాడు చేయందుకుంటుంటే ఆ అమ్మాయి తనువు గాల్లో తేలిపోతుంటుంది. ఏంటీ వింత భావన అంటే.. ఇది కెమికల్‌ చేసే మిరకిల్‌ అంటారు వైద్య నిపుణులు. ప్రేమాటలో ఉన్న యువతీయువకుల్లో డోపమైన్‌, ఆక్సిటోసిన్‌లాంటి నాడీ సమాచార వాహికలు అత్యధికంగా విడుదలవుతుంటాయట. ఇవి రొమాంటిక్‌ భావనలను ప్రేరేపిస్తాయి. మనసుకి నచ్చినవారిని పదేపదే స్పృశించాలనీ.. కౌగిలింతల్లో కరిగిపోవాలనీ.. అధర చుంబనాలతో అల్లుకుపోవాలని తెగ మారాం చేస్తాయి. ఆ ఊహలు తనువుని తీయని మత్తులో ముంచెత్తుతాయి. శరీరానికి చెప్పలేనంత హాయినిస్తాయి. ప్రేయసి/ప్రియుడి తలంపే ఓ కవ్వింతల టానిక్‌లా పని చేయిస్తాయి. ఫలితంగా ఆ ప్రేమికుల ఒంట్లో ఆనందం తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఒత్తిడి కనుమరుగవుతుంది. ఈ ప్రేమలు సుదీర్ఘకాలం కొనసాగితే రక్తపోటు, గుండెజబ్బుల ఊసే ఉండదన్నది యూ.ఎస్‌.డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ -2007 అధ్యయనంలో తేలిన వాస్తవం. అందుకే దీర్ఘకాలిక జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే ప్రేమలో పడిపోవాలని సలహా ఇస్తుంటారు వైద్య నిపుణులు.

ప్రేమలో ఉన్నప్పుడు లవర్‌తో చెట్టపట్టాలు, ముద్దూమురిపాలు, రొమాన్స్‌ సహజమే కదా! అప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. ఇది తనువుకి ఎనలేని హాయినివ్వడమే కాదు.. భాగస్వామి సమక్షంలో సురక్షితంగా, సంతోషంగా ఉన్నామనే భావన కలగజేస్తుంది. మానసిక ప్రశాంతతకు, సామాజిక అనుబంధాలకు, మాతృత్వపు మధురిమలకు, కామోద్దీపనలకూ.. ఇది కీలకం. దీంతోపాటు గాఢంగా ఇష్టపడే వ్యక్తి కళ్లెదురుగా ఉంటే కొందరిలో ‘కార్టిసాల్‌’ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా గుండె వేగం పెరుగుతుంది. అరచేతులు చెమట్లు పడతాయి. కడుపులో సీతాకోకచిలుకలు రెక్కలాడిస్తున్నట్టు వింతైన భావం కలుగుతుంది. అంటే వన్‌ సైడ్‌ లవ్‌లో ఈ ధోరణి అధికమన్నమాట. ఇదీ ఆరోగ్యానికి మంచిదేనన్నది వైద్యుల మాట.
ప్రేమలో శిఖరానికి చేరిన వారిలో మెదడు సంతోషకేంద్రాన్ని నియంత్రించే ‘డోపమైన్‌’ అనే న్యూరో ట్రాన్స్‌మీటర్‌ అధికంగా విడుదలవుతుంటుంది. దాంతో వారిలో సానుకూల భావోద్వేగాలు అధికమవుతాయి. అందరినీ ప్రేమిస్తారు. సానుకూల దృక్పథంతో చూస్తారు. ఈ ప్రపంచమంతా అందంగా, రంగులమయంగా కనిపిస్తుంది. ఇదేదో అల్లాటప్పాగా చెబుతున్న మాట కాదు. మానసిక నిపుణులు.. ప్రేమలో ఉన్న పదిహేడు మంది మెదళ్లని 2,500 సార్లు చిత్రీకరించి ఆ విషయం తేల్చారు. ఈ అధ్యయన వివరాలన్నీ 2005లో ‘ది జర్నల్‌ ఆఫ్‌ కంపరేటివ్‌ న్యూరాలజీ’లో ప్రచురితమయ్యాయి. పైన ప్రస్తావించిన విషయాలు, అంచనాలు, నిజాలు, నిరూపణలు.. క్రోడీకరిస్తే తేలిన విషయం ఏంటంటే.. ప్రేమ కూడా ఓ మత్తులాంటిదే.. ప్రేమలో పడితే ఆయుష్షు, రోగనిరోధకశక్తి పెరుగుతుంది. శారీరక నొప్పులు తగ్గుతాయి. మానసిక ఆనందాలు సరేసరి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమలో పడితే కలిగే మేలు అంతా ఇంతా కాదన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని