బోర్‌ కొడుతున్నావని ఎలా చెప్పను?

మూడేళ్లుగా ఒకబ్బాయిని ప్రేమిస్తున్నా. తను నాపై విపరీతమైన ప్రేమ చూపిస్తాడు. ఖరీదైన బహుమతులిస్తాడు. మేం కలిసి పార్టీలు చేసుకున్నాం. దూరప్రయాణాలకు వెళ్లాం. మొదట్లో ఇదంతా బాగానే

Updated : 26 Feb 2022 06:09 IST

మూడేళ్లుగా ఒకబ్బాయిని ప్రేమిస్తున్నా. తను నాపై విపరీతమైన ప్రేమ చూపిస్తాడు. ఖరీదైన బహుమతులిస్తాడు. మేం కలిసి పార్టీలు చేసుకున్నాం. దూరప్రయాణాలకు వెళ్లాం. మొదట్లో ఇదంతా బాగానే ఉండేది. ఇప్పుడెందుకో నచ్చట్లేదు. మేం పెళ్లి చేసుకున్నా అదే మొహం, అదే ప్రేమ.. ఇంతేగా? ఇంకేం కొత్తదనం ఉంటుంది అనిపిస్తోంది. నా జీవితంలోకి వేరే భాగస్వామి వస్తే బాగుండు అనే ఆలోచన కలుగుతోంది. ఈ విషయం తనకి చెబితే ఎలా స్పందిస్తాడోనని భయంగా ఉంది. ఏం చేయను?

- గ్రేసీ, హైదరాబాద్‌

మీ సమస్య చదివాక.. మీకు జీవితం, ప్రేమ పట్ల సరైన అవగాహన లేదని తెలుస్తోంది. ప్రేమ, పెళ్లి, జీవితం అంటే బొమ్మలాట కాదు. ముఖ్యంగా ప్రేమ విషయంలో మీ ఆలోచనా ధోరణి సరిగా లేదు. మీ బాయ్‌ఫ్రెండ్‌ మీకు బోర్‌ కొడుతున్నాడు సరే.. అలా ఎందుకు జరుగుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? ఒకరిపై ఒకరికి నమ్మకం లేనప్పుడో, పద్ధతి నచ్చనప్పుడో, ఆశించినది దక్కనప్పుడో ఇలా జరుగుతుంది. మనసులో పుట్టి, మట్టిలో కలిసేంత వరకూ తోడుంటుంది ప్రేమ. పెళ్లికి ముందు, పెళ్లయ్యాక తర్వాత కూడా అది ఉండాలి. మీరు చెబుతున్న వివరాల ప్రకారం ఆ అబ్బాయి మీ కోర్కెలన్నీ నెరవేరుస్తున్నాడు. ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇంతకన్నా మీకు ఏం కావాలి? ఒకవేళ తనని కాదని మీరు మరొకర్ని పెళ్లి చేసుకున్నారనుకోండి. అతనూ బోర్‌ కొడితే ఏం చేస్తారు? తను చెడ్డవాడైతే మీ పరిస్థితి ఏంటి? అందుకే ఒక్కసారి తనతో మనసు విప్పి మాట్లాడండి. తనలో ఏం లోపించిందో చెప్పండి. అవసరమైతే స్నేహితుల సలహాలు తీసుకోండి. అయినా మీరు తనకి బ్రేకప్‌ చెప్పాలనే నిర్ణయానికొస్తే ఒక్కసారి తన గురించి కూడా ఆలోచించండి. మీరు మోసం చేశారని తను భావిస్తే తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడకుండా ఒప్పించండి. ఇవన్నీ జరిగిన తర్వాతే ఇరువురూ ఇష్టపూర్వకంగా విడిపోండి. నన్ను అడిగితే అంత మంచి అబ్బాయిని వదులుకోకపోవడమే మంచిదంటాను.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని