అప్పుడు ఔనని.. ఇప్పుడు కాదనేదెలా?

మా కుటుంబంలో పీజీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిని నేను. పెద్ద ఉద్యోగంలో ఉన్నా. బంధువులు, సమాజంలో మంచి పేరుంది. నాలుగేళ్ల క్రితం ఒకమ్మాయి పరిచయమైంది. తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఓసారి మాటల మధ్యలో ‘మీదీ మా కులమే కదా’ అంది.

Published : 02 Apr 2022 02:16 IST

మా కుటుంబంలో పీజీ పూర్తి చేసిన మొదటి వ్యక్తిని నేను. పెద్ద ఉద్యోగంలో ఉన్నా. బంధువులు, సమాజంలో మంచి పేరుంది. నాలుగేళ్ల క్రితం ఒకమ్మాయి పరిచయమైంది. తరచూ మాట్లాడుకునేవాళ్లం. ఓసారి మాటల మధ్యలో ‘మీదీ మా కులమే కదా’ అంది. కాదంటే స్నేహం చెడుతుందని ఔనన్నా. తక్కువ సమయంలోనే మా మనసులు కలిశాయి. నేనంటే విపరీతమైన ప్రేమ. ఇప్పుడు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అంటోంది. కానీ ఇప్పటికీ నా క్యాస్ట్‌ గురించి తనకి తెలియదు. మధ్యలో ఎన్నోసార్లు నిజం చెప్పాలని ప్రయత్నించినా ఏవో అడ్డంకులు వచ్చేవి. ఇప్పుడు నిజం చెబితే ఎలా స్పందిస్తుందోనని భయంగా ఉంది. మా ప్రేమని పెళ్లిదాకా తీసుకెళ్లేదెలా?

- హరి, ఈమెయిల్‌

మనిషి కాలంతో పోటీ పడే ఈ ఆధునిక యుగంలో కూడా ఇంకా కులాన్ని పట్టుకొని వేలాడటం దురదృష్టకరమే. ఏదేమైనా ఈ విషయం ఇన్నాళ్లూ దాచి ఉంచి మీరు పొరపాటు చేశారు. మీరంటే తనకి విపరీతమైన ఇష్టం అంటున్నారు. ఆ నమ్మకంతోనే మెల్లగా అసలు విషయం చెప్పి చూడండి. మీ కుటుంబానికి మంచి పేరుంది.. మీకు మంచి ఉద్యోగముంది. అంతకుమించి ఆ అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నారు. ఇవే విషయాలు తనతో చెప్పండి. చేసిన పొరపాటు మనస్ఫూర్తిగా ఒప్పుకోండి. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించండి. సమాజంలో ఉండే తల్లిదండ్రులందరూ విలన్లు కాదు. అర్థం చేసుకునేవాళ్లూ ఉంటారు. ఆ ఆశతో ప్రయత్నించండి.

సాధారణంగా పెద్దవాళ్లంతా పిల్లల క్షేమం కోరుకుంటారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎంత బాగా చూసుకోగలరో ఆమె పేరెంట్స్‌కి భరోసా కలిగేలా వివరించండి. ఒప్పుకుంటే సంతోషం. లేదంటే మీకు అండగా చట్టం, ఇతర సంఘాలు ఉండనే ఉన్నాయి. దీనికన్నా ముందు మీరు ఆ అమ్మాయిని ఒప్పించడం ముఖ్యం. మీరు మోసం చేశారని తను కూడా భావిస్తే.. ఇంక చేసేదేం లేదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. తను ఒప్పుకుంటేనే మీరు పెద్దలతో పోరాటం చేయగలరు. కుదరకపోతే.. ఆమెను జీవితంలో ఒక మధుర జ్ఞాపకంలా భావించి మర్చిపోవడమే మంచిది. కానీ తను మిమ్మల్ని అర్థం చేసుకుంటుందనీ.. పెళ్లికి అంగీకరిస్తుందనే ఆశిద్దాం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని