Updated : 14 May 2022 06:42 IST

తను మంచిదైనా.. నచ్చట్లేదు!

మనలో మనం

నేనొక ప్రైవేటు ఉద్యోగిని. అమ్మానాన్న చిన్నప్పుడే చనిపోయారు. బంధువుల ఆసరాతో చదువుకొని, ఉద్యోగం సంపాదించాను. చుట్టాల బలవంతంతో మావయ్య కూతురిని పెళ్లి చేసుకున్నాను. తను మంచిదే.. కానీ కొన్ని విషయాల్లో నచ్చడం లేదు. నాతో పోలిస్తే అంత రంగూ ఉండదు. ఆమెతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఏం చేయాలి?

- ఎస్‌.ఎస్‌. ఈమెయిల్‌

మీరు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడం బాధాకరం. అయినా కష్టపడి పైకి రావడం అభినందనీయం. పెళ్లి అనేది మీ వ్యక్తిగత విషయం. బంధువుల బలవంతంతో ఒప్పుకోవడం మీ పొరపాటు. ఇప్పుడు  చేసేదేమీ లేదు. మీ చేతుల్లో ఉన్నదల్లా పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడమే. మీ భార్య మంచిదే అంటున్నారు.. సంతోషంగా లేనంటున్నారు. కారణాలు స్పష్టంగా చెప్పలేదు. ప్రఖ్యాత మానసిక నిపుణుడు జాన్‌ ఎం.గ్యాట్‌మ్యాన్‌ ‘స్నేహం, పరస్పర గౌరవం, ఒకరి సంతోషాన్ని మరొకరు కోరుకోవడం ద్వారానే వివాహ బంధం కలకాలం నిలిచి ఉంటుంది’ అన్నారు. అది అక్షర సత్యం. పెళ్లంటే ఇద్దరు మనుషులు ఒక్కటవటం కాదు.. రెండు మనసులు కలవడం. రెండు కుటుంబాల మధ్య అనుబంధం పెనవేసుకోవడం. ఒకరిపట్ల మరొకరిపై నమ్మకం, నిబద్ధత, భావ వ్యక్తీకరణ ద్వారానే బంధం నిలుస్తుందని అనేక పరిశోధనల్లో తేలింది. ఆ అమ్మాయి రంగు మీకన్నా తక్కువ అంటున్నారు. అది సమస్యే కాదు. తను మంచిదని మీరే అన్నారు. అందం కాదు.. వ్యక్తిత్వం శాశ్వతం అనే విషయం గుర్తుంచుకోవాలి. ఒకవేళ తనలో మీకు ఏవైనా నచ్చని విషయాలు ఉంటే ఓరోజు ఓపిగ్గా చెప్పండి. ‘నువ్వు మారితే మన బంధం బాగుంటుంద’ని సావధానంగా చెప్పండి. తనకి ఎక్కువ సమయం కేటాయించండి. ప్రేమగా మాట్లాడండి. మీలో మార్పు కనిపిస్తే.. తను కూడా మీ పట్ల ప్రేమ చూపిస్తుంది. అనవసర ఆలోచనలు మీ మనసు నుంచి తీసేసి జీవితాన్ని సంతోషంగా గడపండి. విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని