వాళ్లకి దగ్గరవుతూ.. నాకు దూరమవుతోంది!

కాలేజీలో ఈమధ్యే ఒకమ్మాయి పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే నాకు సన్నిహితమైంది.  ప్రతి వ్యక్తిగత విషయం నాతో చెప్పుకుంటుంది. డ్రెస్‌, ఫోన్‌.. ఇలా ఏ వస్తువు కొన్నా నా అభిప్రాయం అడుగుతుంది. తన ఫొటోలు నాకు పంపుతుంది. ఇద్దరం కలిసి కొన్నిసార్లు రెస్టరెంట్లు, సినిమాలకు వెళ్లాం.

Updated : 23 Jul 2022 07:36 IST

కాలేజీలో ఈమధ్యే ఒకమ్మాయి పరిచయమైంది. కొద్దిరోజుల్లోనే నాకు సన్నిహితమైంది.  ప్రతి వ్యక్తిగత విషయం నాతో చెప్పుకుంటుంది. డ్రెస్‌, ఫోన్‌.. ఇలా ఏ వస్తువు కొన్నా నా అభిప్రాయం అడుగుతుంది. తన ఫొటోలు నాకు పంపుతుంది. ఇద్దరం కలిసి కొన్నిసార్లు రెస్టరెంట్లు, సినిమాలకు వెళ్లాం. కానీ ఈమధ్య తను వేరే అబ్బాయిలతో మాట్లాడుతోంది. సన్నిహితంగా ఉంటోంది. నేనది తట్టుకోలేకపోతున్నా. తను వేరేవాళ్లకి ప్రాధాన్యం ఇస్తే.. నాకు దూరం అవుతుందని భయమేస్తోంది. తనని చూడకుండా, మాట్లాడకుండా ఉండలేను. ఏం చేయాలి?

- షణ్ముఖ్‌, ఈమెయిల్‌

స్నేహం, ప్రేమకి మధ్య ఒక సున్నితమైన రేఖ ఉంటుంది. టీనేజీ, యుక్తవయసులో ఆ వ్యత్యాసం తెలుసుకోవడం కొంచెం కష్టమే. ఈ వయసులో అమ్మాయిలు, అబ్బాయిలు అపోజిట్‌ జెండర్‌కి ఆకర్షితులవడం సహజమే. దాన్ని స్నేహం, ప్రేమ, ఆకర్షణ.. అంటూ ఒక్కొక్కరు ఒక్కోలా పిలుచుకుంటారు. కొంతమంది స్నేహాన్ని ప్రేమగా పొరబడే అవకాశం కూడా ఉంది. మనకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి ఏమాత్రం మనపట్ల ఆసక్తి చూపించినా, ఇష్టం కనబరిచినా దాన్ని ప్రేమ అనుకుంటాం. మీ విషయానికొస్తే మీరెప్పుడూ ఆ అమ్మాయికి ప్రపోజ్‌ చేసినట్టు చెప్పలేదు. స్నేహంలో భాగంగానే మీరిద్దరూ దగ్గరయ్యారు. ఆ చొరవతోనే తను ఫొటోలు పంచుకుంటోంది. అభిప్రాయాలు అడుగుతోంది. మీకు తెలియకుండానే ఆమె ఆకర్షణలో పడిపోయారు. తను మీతోపాటు సినిమాలు, రెస్టరెంట్లకు రావడంతో కచ్చితంగా అది ప్రేమే అనే భావనలోకి వెళ్లిపోయారు. ఒకరి పట్ల అతి ఆపేక్ష, తను నా సొంతం అనే భావన ఉండకూడదు. అతి అభద్రతా భావానికి దారి తీస్తుంది. ఒకవేళ తను మిమ్మల్ని ప్రేమిస్తున్నా.. తను వేరేవాళ్లతో మాట్లాడితే తట్టుకోలేకపోవడం మంచి పద్ధతి కాదు. ఏదో అవసరంతో వాళ్లతో మాట్లాడి ఉండొచ్చు. దాన్ని మీరు వేరేలా భావిస్తే, అది అపనమ్మకానికి దారి తీస్తుంది. స్నేహం, ప్రేమ.. ఏదైనా ఒకరికోసం ఒకరు నిలబడటం.. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం. అవి లేకుండా ఏ బంధమూ నిలబడదు. అసలు మీది ప్రేమా? స్నేహమా? తేల్చుకోండి. ఒకవేళ ప్రేమిస్తుంటే తనకి చెప్పండి. స్పష్టత లేకుండా గందరగోళంలో ఉండొద్దు. తను వేరొకరికి దగ్గరైతే మీకు దూరమవుతుందనే ఆలోచననీ మనసులో నుంచి తీసేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని