ప్రపోజ్‌ చేశాకే..పెళ్లైందని తెలిసింది

ఏడాదిన్నర కిందట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాను. అక్కడ ఒక సీనియర్‌ పరిచయమయ్యాడు. అందరితో చనువుగా, చలాకీగా ఉండేవాడు.

Updated : 24 Mar 2023 15:41 IST

ఏడాదిన్నర కిందట సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాను. అక్కడ ఒక సీనియర్‌ పరిచయమయ్యాడు. అందరితో చనువుగా, చలాకీగా ఉండేవాడు. పైగా సాయం చేసే గుణం. నాకు బాగా నచ్చేశాడు. నామీద ఆసక్తి చూపిస్తున్నట్టు అనిపించడంతో నేనే ప్రపోజ్‌ చేసి ఐలవ్యూ చెప్పాను. తనూ ‘ఐటూ లవ్యూ’ అన్నాడు. తర్వాత తనతో సన్నిహితంగా మెలిగా. కానీ ఈమధ్యే నాకో షాకింగ్‌ విషయం తెలిసింది. అదేంటంటే.. తనకు ఇంతకుముందే పెళ్లైందట. ఏవో గొడవలు జరిగి ఆమెతో దూరంగా ఉంటున్నట్టు తెలిసింది. తను నన్ను మోసం చేశాడనిపిస్తోంది. అదే అంటే ‘తనతో విడాకులు తీసుకోబోతున్నా. డైవోర్స్‌ రాగానే నిన్ను పెళ్లి చేసుకుంటా’ అన్నాడు. కానీ మోసపోయాననే ఫీలింగ్‌ వెంటాడుతోంది. అయినా తనంటే ఇప్పటికీ ఇష్టమే. ఏం చేయాలో తెలియడం లేదు.
 ఓ పాఠకురాలు, ఈమెయిల్‌

కొందరు ఎప్పుడూ సరదాగా, చలాకీగా ఉంటారు. వాళ్ల తీరే అంత. వాళ్ల సమక్షంలో ఉన్నప్పుడు సంతోషంగానే ఉంటుంది. కానీ ఆ లక్షణాలే చూసి ఇష్టపడటం అంటే.. అది ఆకర్షణే. మీ విషయానికొస్తే వివరాలేం తెలుసుకోకుండా ప్రపోజ్‌ చేయడం తొందరపాటే అవుతుంది. ఏదేమైనా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా విడాకులకు దారి తీసిన కారణాలేంటో తెలుసుకోండి. అతడి వైపు నుంచి తప్పు లేదు అని భావిస్తేనే ముందుకెళ్లండి. పెళ్లి అంటే జీవితం.. ఇలాంటి విషయాల్లో అస్సలు తొందర పడొద్దు. కార్పొరేట్‌ సంస్కృతిలో ఆడా, మగా తేడా లేకుండా కలుపుగోలుగా ఉండటం సాధారణం. ‘లవ్యూ’ అనే పదాన్ని ఈ మధ్య ప్రతి ఒక్కరూ తేలికగా వాడుతున్నారు. మీరు అనుకునే ప్రేమ, తను చూపించే ప్రేమ ఒక్కటేనా? ఈ ఏడాదిన్నరలో తను మిమ్మల్ని సిన్సియర్‌గా ప్రేమించాడు అనే క్షణాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి.

అతడు మిమ్మల్ని మోసం చేశాడు అనుకోవడం సమంజసం కాదు. అసలు మీరు అతడి వివరాలు తెలుసుకునే ప్రయత్నమే చేయనట్టున్నారు. ఒకవేళ మీరు అడిగితే.. తను అబద్ధం చెబితే అప్పుడు మోసం అవుతుంది. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఉన్నది ఆకర్షణా, ప్రేమా? ముందు తేల్చుకోండి. చివరగా మీ సమస్యకి పరిష్కారం ఏంటంటే.. అతడికి విడాకులు సవ్యంగా వస్తాయా? పెళ్లైన వ్యక్తిని చేసుకోవడం మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటారా? కులమతాల ఇబ్బందులేం లేవు కదా.. ఇలాంటి ఇబ్బందులేం లేకపోతేనే.. అతడితో ఏడడుగులు వేయొచ్చు. దీంతోపాటు ఎందుకైనా మంచిది ఒక్కసారి శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోండి.
డా.అర్చన నండూరి కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని