రోజూ చూసినా.. పట్టించుకోదే!

మాది పేద కుటుంబం. బీటెక్‌ చదువుతున్నాను. మా నాన్నకి ఆరోగ్యం బాగుండదు. అమ్మ పని చేస్తేనే పూట గడుస్తుంది. మా క్లాస్‌లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను.

Updated : 22 Apr 2023 07:20 IST

మనలో మనం

మాది పేద కుటుంబం. బీటెక్‌ చదువుతున్నాను. మా నాన్నకి ఆరోగ్యం బాగుండదు. అమ్మ పని చేస్తేనే పూట గడుస్తుంది. మా క్లాస్‌లో ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఆ విషయం తనకి చెప్పలేదు. రోజూ తనని చూసినా నన్ను అసలు పట్టించుకోవట్లేదు. కానీ ఆ అమ్మాయిని విడిచి ఉండలేకపోతున్నా. ప్రాణం పోతున్నట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి చనిపోవాలనిపిస్తుంది. నాకేమైనా మానసిక సమస్య ఉందేమోనని భయమేస్తుంది. ఏం చేయమంటారు? 

కేఆర్‌ఎస్‌, ఈమెయిల్‌

దువుకుంటున్నారు అంటే మీది చిన్నవయసే. ఈ వయసులో హార్మోన్లలో వచ్చే మార్పుల కారణంగా అమ్మాయిలు అబ్బాయిలతో.. అబ్బాయిలు అమ్మాయిలతో ఆకర్షణలో పడటం సర్వసాధారణమే. దాన్నే ప్రేమ అని అపోహ పడుతుంటారు. ఇక మీ పరిస్థితికి వస్తే ఆర్థికంగా, కుటుంబపరంగా ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇబ్బందికి గురవుతున్నారో మీ మాటల్లోనే తెలుస్తోంది. మీ ఆలోచనల విషయానికొస్తే ప్రతి విద్యార్థిలాగే మీరూ ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఉన్న పరిస్థితుల్లో ప్రవాహానికి కొట్టుకుపోవడం కన్నా ఎదురీదడం ముఖ్యం. ఎందుకంటే ప్రస్తుతం బాగా చదివితేనే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితి మెరుగు పడుతుంది. అమ్మాయి, ప్రేమ, సరదాలు.. వీటిలో పడి కొట్టుకుపోతుంటే భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. అమ్మాయి ఆకర్షణతో కలిగే భావోద్వేగాలు తాత్కాలికం. అదీకాకుండా తన నుంచి ఏ స్పందనా లేనప్పుడు, తనకి ఇష్టం లేనప్పుడు.. ఆమె వెంట పడటమూ వృథా ప్రయాసే. మీ చదువు, ఉద్యోగం, హోదా, వ్యక్తిత్వం నచ్చితేనే ఎవరైనా ఇష్టపడతారు తప్ప.. మీరు ప్రేమిస్తున్నారు అనే ఒకే కారణంతో తిరిగి ప్రేమించరు. మీరు బాగు పడ్డప్పుడు, ఉన్నత స్థానానికి చేరినప్పుడు ఎంతోమంది అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడతారు. ప్రస్తుతం మీరు మీ అమ్మ గురించి మాత్రమే ఆలోచించాల్సిన సమయం ఇది. ఇప్పుడైతే మీ భవిష్యత్తు, కుటుంబం పట్ల ఇష్టం పెంచుకోండి. మానసిక చికాకుల నుంచి బయట పడటానికి రోజూ ధ్యానం చేయండి. మీరు ఎదిగినప్పుడు కలిగే ఫలితాలను తరచూ ఊహించుకోండి. ఆ సానుకూల దృక్పథం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది.

డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని