నాతో ప్రేమ.. వాడితో చనువా?

నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే బిడియం. వాళ్లకి ఎప్పుడూ దూరంగా ఉండేవాడిని. బీటెక్‌ థర్డియర్‌లో ఒక క్లాస్‌మేట్‌ తనే చొరవ తీసుకొని నాకు దగ్గరైంది.

Updated : 06 Jul 2024 06:48 IST

నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే బిడియం. వాళ్లకి ఎప్పుడూ దూరంగా ఉండేవాడిని. బీటెక్‌ థర్డియర్‌లో ఒక క్లాస్‌మేట్‌ తనే చొరవ తీసుకొని నాకు దగ్గరైంది. కాలేజీ బస్‌లో నా పక్కనే కూర్చోవడం.. తాకుతూ మాట్లాడటం.. నాకిష్టమైన వంటలు తెచ్చి పెట్టడం చేసేది. చాలాసార్లు సినిమాలు, రెస్టరంట్లకూ వెళ్లాం. కొన్నాళ్లకే తను లేకుండా ఉండలేని పరిస్థితికొచ్చా. అయితే ఏమైందో తెలియదుగానీ కొన్నాళ్లుగా నన్ను దూరం పెడుతోంది. వేరే అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే ‘ముందులా నాకు వీలవడం లేదు’ అంటోంది. నన్ను దూరం పెట్టడం కన్నా తను వేరేవాళ్లకి దగ్గరవడమే తట్టుకోలేకపోతున్నా. తనని ఏమైనా చేయాలన్నంత కోపం వస్తోంది. నా బాధ తీరేదెలా?

ఆర్‌.ఎస్‌.కె, ఈమెయిల్‌

ఎప్పుడైనా.. కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉంటాయి. కొన్ని ఉండవు. లేని వాటి గురించి ఆందోళన, నిరాశ చెందడం కన్నా.. సమస్య నుంచి బయట పడే మార్గం వెతకడం ఉత్తమం. అమ్మాయిలంటేనే దూరంగా ఉండే మీరు.. ఆమె చొరవతోనే దగ్గరయ్యానంటున్నారు. ఇందులో మీ తప్పు ఏంటంటే.. తను ఎందుకు అలా చొరవ తీసుకుంటోంది? ఎందుకు హద్దులు మీరి ప్రవర్తిస్తోంది? అని తెలుసుకోకపోవడం. ఒకమ్మాయి కొంచెం సన్నిహితంగా ఉంటే మీలాగే చాలామంది అబ్బాయిలు ప్రేమ అనుకుంటారు. తర్వాత వాళ్లు దూరం పెట్టగానే మానసిక ఒత్తిడికి గురవుతారు. అసలు తనది కలివిడి మనస్తత్వం కావచ్చు. అలా కాకుండా మీతోనే సన్నిహితంగా ఉండి.. మీ సమయం, డబ్బు ఖర్చు పెట్టించి ఇప్పుడు వేరొకరికి దగ్గరవుతుంటే మాత్రం ఆమె కావాలనే మిమ్మల్ని దూరం పెడుతుందని అర్థం. ఏదేమైనా ఆమె నిర్ణయమేంటో  తెలిసిపోయింది. వీలు కావడం లేదంటూ మిమ్మల్ని అవాయిడ్‌ చేస్తోంది. ఇంకా తన వెంట పడటంలో అర్థం లేదు. మీరు బతిమాలి, ఒప్పించి తనకి దగ్గరైనా ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు. జీవితంలో ఇది ఒక పాఠం అనుకోండి. 

మీదింకా చిన్న వయసే కాబట్టి పెద్దగా కోల్పోయేదేమీ లేదు. ఇప్పుడు కీలకమైన దశలో ఉన్నారు. చదువుమీద దృష్టి పెట్టి మంచి ఉద్యోగంలో స్థిరపడితే మిమ్మల్ని చాలామంది అమ్మాయిలు ఇష్టపడతారు. ఆ ప్రయత్నంలో ఉండండి. తను ఎదురుపడకుండా చూసుకోండి. ఆ ఆలోచనలు రాకుండా మిమ్మల్ని మీరు తీరిక లేకుండా ఉంచుకోండి. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్‌లాంటివి ప్రారంభించండి. కాలం ఎలాంటి గాయాన్నైనా మాన్పుతుంది. ఇంకో విషయం.. కోపం చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఆమెను ఏమైనా చేస్తే మీరే ఇబ్బందుల్లో పడతారు. చట్టం ముందు దోషిగా నిలబడతారు. మీ కన్నవాళ్ల ఆశల్ని కూల్చేసిన వాళ్లు అవుతారు. అందుకే ఆమెకి దూరంగా ఉంటే.. సమస్య నుంచి దూరంగా వెళ్తున్నట్టే. ఆల్‌ ది బెస్ట్‌.

డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌ 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని