ఫాలోయింగే మీ ఫాలింగ్‌

బస్‌స్టాండుల్లో.. వీధి చివర్లో.. ప్రేమ కోసం రోమియోలు.. ఐ వాన్న ఫాలో.. ఫాలో.. యూ! పార్కుల్లో.. సినిమా థియేటర్లలో.. ప్రేమని పంచుతూ ప్రేమికులు... ఐ వాన్న ఫాలో.. ఫాలో.. యూ! ..

Updated : 31 Dec 2018 19:30 IST

బస్‌స్టాండుల్లో.. వీధి చివర్లో.. ప్రేమ కోసం రోమియోలు.. ఐ వాన్న ఫాలో.. ఫాలో.. యూ! 
పార్కుల్లో.. సినిమా థియేటర్లలో.. ప్రేమని పంచుతూ ప్రేమికులు... ఐ వాన్న ఫాలో.. ఫాలో.. యూ! 
మరి, బ్రేక్‌అప్‌ అయితే? ఇంకేముందీ మర్చిపోవడమేగా! అనుకునేరు! అదేం కాదు.. 
అప్పుడూ ‘ఫాలో.. ఫాలో..యూ!’ అంటూ మాజీ ప్రియురాలు లేదా ప్రియుడిని పదే పదే వెంటాడుతున్నారు నేటి తరం మిలీనియల్స్‌. అదెట్టా? అనేగా సందేహం? అందుకున్న మార్గమే సోషల్‌లైఫ్‌. ‘నమ్మకతప్పని నిజమైనా.. నువ్వు రావని చెబుతున్నా.. ఎందుకు వినదో నా మది ఇకనైనా..’ అని పాడుకుంటూ ఫేస్‌బుక్‌ లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌ తెరుస్తున్నారు. చెరిపేయాల్సిన జ్ఞాపకాల్ని సోషల్‌ మీడియా వేదికగా పోగేసుకుంటున్నారు. ఇలా మాజీల గురించి పదేపదే వెదకడం ఏ మాత్రం మంచిది కాదంటున్నారు మానసిక శాస్త్ర నిపుణులు. దీనివల్ల పరస్పరం గౌరవం కోల్పోవడంతో పాటు... ఒకరిపై ఒకరికి పగలు పెరిగి ప్రతీకారాల వరకూ తీసుకెళ్తుందని హెచ్చరిస్తున్నారు. మరైతే, అడుగులు, ఆలోచనలు అటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఫాలోయింగే మీ ఫాలింగ్‌

భానుని నిద్రలేపేది యాప్‌ల అలర్ట్‌లే. సెల్ఫీ పోస్ట్‌ చేయని సాయంత్రం ఉండదు. అలా పంచుకున్న ఓ స్వీయచిత్రానికి వచ్చిన వ్యాఖ్యతోనే వరుణ్‌ దగ్గరయ్యాడు. అది మొదలు వాట్సప్‌ తోడుగా.. ఫేస్‌బుక్‌ సాక్షిగా.. ఇన్‌స్టాగ్రామ్‌లతో చేసిన ప్రేమ సందడి అంతా ఇంతా కాదు. వాస్తవ ప్రపంచంలో కంటే సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువగా గడిపారు. ఎమోజీలు ఎన్ని భావనలు మోసుకెళ్లాయో! అయితే, వారి ప్రేమలోకి బగ్స్‌ ప్రవేశించడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కారణాలు ఏవైనా ఇద్దరూ బ్రేక్‌అప్‌ చెప్పుకొన్నారు. నీ దారి నీది.. నా దారి నాదంటూ లవ్‌ ఎకౌంట్‌ నుంచి సైన్‌అవుట్‌ అయ్యారు. సోషల్‌ మీడియా సాక్షిగా దగ్గరైన ఈ జంట విడిపోయాక అదే సామాజిక మాధ్యమాల వలలో గతించిన జ్ఞాపకాల్ని పదే పదే పోగేసుకుంటున్నారు. వరుణ్‌ లేవగానే భాను ఎవరికి గుడ్‌మార్నింగ్‌ చెప్పిందనో..? ఏ ఫొటో పోస్ట్‌ చేసిందనో..? ఎక్కడెక్కడికి వెళ్తుందో..? చెక్‌ చేస్తున్నాడు. భానూ పరిస్థితీ అంతే. గతంలో ట్విట్టర్‌లో చెప్పుకొన్న చిట్టిపొట్టి సంగతుల్ని మళ్లీ చూసుకుంటున్నారు. ఇద్దరికీ తాము మళ్లీ కలవడం అసాధ్యం అని తెలుసు. ఐనా.. ఫాలో.. ఫాలో.. యూ! అంటూ ఒకరినొకరు ఫొలో అవుతూనే ఉన్నారు. వరుణ్‌.. భానులే కాదు. నేటి తరం ఎక్కువమంది ఇదే చేస్తున్నారు. జీవిత ప్రయాణం ముందుకు సాగాలంటే. జ్ఞాపకాల గదుల్ని దాటుకుని బయటకి రావాల్సిందే. అందుకు గతించిన సామాజిక మాధ్యమాల తలుపులు మూయాల్సిందే. అందుకు ఈ నియమాల్ని ‘ఫాలో’ అవాల్సిందే.

మార్చేయాలి 
ఫోన్‌ చేతిలోకి తీసుకోగానే మునివేళ్లు ఐకాన్లపైకి పోకుండా చూసుకోవడం కష్టమే. అయినా, కొత్త ఐకాన్లపై దృష్టిమళ్లేలా చేసుకోవాలి. మ్యూజిక్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుని ఇష్టమైన సంగీతం వినండి. మీకు నచ్చిన ఏదైనా వెబ్‌ సిరీస్‌ని చూస్తూ గడిపేయొచ్చు. జీవన నైపుణ్యాలకు సాన పెట్టుకునే పుస్తకాల్ని చదవండి. మిమ్మల్ని మీరే ప్రేరేపించుకునేలా సందర్భానికి తగిన వాల్‌పేపర్లను ఉంచుకోండి. దీంతో ఫోన్‌ లేదా ల్యాపీని అన్‌లాక్‌ చేసిన ప్రతిసారి మీకో దర్పణంలా అది పని చేస్తుంది.

ఎందుకు మానుకోవాలి? 
నెట్టిల్లు పరిచయం కాక మునుపు ప్రేమలు.. బ్రేకప్‌లు ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. అయితే, అప్పటికీ ఇప్పటికీ మాధ్యమాలు మారాయి. ప్రేమలో ఉన్నా.. విడిపోయినా ఒకరినొకరు ఫాలో చేయడం చాలా కష్టమైన ప్రక్రియ. కానీ, ఇప్పుడు క్షణాల్లో ఇరువురి వివరాలు తెలిసిపోతున్నాయ్‌. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. సోషల్‌ లైఫ్‌లో పోస్ట్‌ చేసేవన్నీ నిజాలు కాదన్న విషయాన్ని గ్రహించాలి. వాటిని చూసి.. ‘ఏం కాలేదు అన్నట్టుగా ఎంత సంతోషంగా గడిపేస్తున్నారు. నేనెందుకు ఇలా? వారి గురించి ఆలోచిస్తున్నా..’ అనుకుంటూ మరింత వేదనకు గురవుతారు. అంతేకాదు.. ఇలా ఫాలో అవ్వడం వల్ల ఎప్పటికైనా మళ్లీ కలుస్తామనే భావనలు జీవన గమనాన్ని వెనక్కి తీసుకెళ్తాయి. వాళ్లే షాపింగ్‌కో వెళ్తున్నారని తెలియగానే మీరూ వెళ్లి వారికి ఎదురుపడే ప్రయత్నం చేస్తారు. దీన్ని ఎదుటివారు జీర్ణించుకోలేరు. వారి పక్కన మరెవరో ఉండొచ్చు. దీంతో ఇరువురి మధ్య కొత్త సమస్యలు రావొచ్చు. కొన్ని సార్లు హింసకూ ఇది దారి తీయొచ్చు.

‘ఫైన్‌’ వేసుకోండి 
అన్నీ మూటకట్టేసి మాజీల జోలికి వెళ్లకూడదు అనుకోవడం.. ఆతృత చంపుకోలేక ఏదోక బలహీన క్షణంలో మళ్లీ చెక్‌ చేస్తుంటారు. అందుకు మీకు మీరే మూల్యం చేసుకునేలా ‘ఫైన్‌ బాక్స్‌’ని పెట్టండి. కంట్రోల్‌ తప్పినప్పుడల్లా కొంత మొత్తాన్ని బాక్స్‌లో జమ చేయండి. దాంట్లో డిపాజిట్‌ అవుతున్న మొత్తాన్ని చూస్తున్న ప్రతిసారి మీ అంతట మీరే మరింత మానసిక క్షోభని డిపాజిట్‌ చేసుకుంటున్నది తెలిసిపోతుంటుంది. దీంతో నియంత్రించుకునేందుకు తగిన మార్గాల్ని వెతికే ప్రయత్నం చేస్తారు.

ఫాలోయింగే మీ ఫాలింగ్‌బ్లాక్‌ చేయాల్సిందే 
దూరం శాశ్వతం అని నిర్ణయించుకుంటే ఆలస్యం చేయొద్దు. వెంటనే మీ సామాజిక మాధ్యమాల నుంచి వారిని తొలగించండి. ప్రొఫైల్‌ని బ్లాక్‌ చేయడం ఒక్కటే అందుకు పరిష్కారం. అంతేకాదు.. ప్రియమిత్రులకు చెప్పి మాజీలను బ్లాక్‌ చేయమనాలి. దీంతో వారికి సంబంధించిన వివరాలు మీ వాల్‌పై చాలా వరకూ కనిపించవు. పంచుకున్న జ్ఞాపకాల్ని విధిగా తుడిచే ప్రయత్నం చేయాలి. వీలైనంత వరకూ పాత ఎకౌంట్ల్లోకి లాగిన్‌ కాకుండా కొత్తవి ఏర్పాటు చేసుకుని నెట్టింట్లో విహరిస్తే మంచిది. ఊహించని మలుపులతో విధి ఎప్పుడైనా మళ్లీ ఇద్దరినీ కలిపితే ‘అన్‌బ్లాక్‌’ చేసుకోవచ్చు.

‘ట్రీట్‌’ ఇచ్చుకోండి 
మొదట్లో రోజుకి ఓ పది సార్లు వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసిన మీరే ఏదోక రోజు ఐదు సార్లే ఫాలో అవుతారు. మీకే షాకింగ్‌గా అనిపిస్తుంది. ఆ రోజు మీకు మీరే ‘ట్రీట్‌’ ఇచ్చుకోండి. నచ్చిన సినిమా చూడొచ్చు. లేదంటే.. ఇష్టమైన రెస్టారెంట్‌కి వెళ్లి నచ్చినవి తినండి.

మీతో మీరే చెప్పుకోండి 
ఏదైనా విషయాన్ని మనతో మనమే బిగ్గరగా మాట్లాడుతూ చెప్పుకొంటే ఎక్కువ స్పష్టత వస్తుందంటారు. మదిలోకి మాజీల ధ్యాస వస్తే వెంటనే మీకు మీరే ఇలా చెప్పుకోండి.. ‘ఫ్రొఫైల్‌ క్లిక్‌ చేయడం.. ఫొటోలు చూడడం.. అప్‌డేట్స్‌ని తెలుసుకోవడం వల్ల ఏంటి ప్రయోజనం? బాధని పెంచుకోవడం తప్ప. గతాన్ని తవ్వుకుంటూ.. జ్ఞాపకాల్ని మోసుకుంటూ.. వాస్తవ ప్రపంచానికి దూరంగా  బతకడం ఓ భ్రమ. త్వరగా బయటపడి వాస్తవికతతో ముందుకు సాగాలి. తర్వాతేంటి? అనే ప్రశ్నకి సమాధానం వెతకాలి.’

స్నేహితుల సాయం 
అప్రయత్నంగానే మాజీల గురించి ఆలోచిస్తున్నట్లయితే ప్రియ మిత్రులతో మీరున్న స్థితిని పంచుకోండి. వారి గురించి తెలుసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు మీ ఫోన్‌ని ఫ్రెండ్స్‌కి ఇచ్చేయండి. కాస్త స్థిమితత్వం వచ్చాక తిరిగి తీసుకోండి. అలాగే, ఎక్కువ సార్లు పదే పదే నియంత్రణ తప్పి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే స్నేహితులతో ఎక్కువ సమయం గడపండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే... మీ బ్రేక్‌అప్‌ విషయాన్ని మిత్రులకు స్పష్టంగా చెప్పాలి. దీంతో ఎలాంటి సందర్భంలోనైనా మీ ప్రేమకి సంబంధించిన ప్రస్తావన రాదు.

‘నోట్స్‌’ రాయండి 
ఇప్పటి వరకూ సోషల్‌ మీడియాలో ప్రపంచంతో పంచుకోవడానికి ఏదో ఒకటి రాసుంటారు. ఇప్పుడు మీతో మీరు కొన్ని వాక్యాలు షేర్‌ చేసుకోండి. ఫోన్‌లో ఓ డైరీ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయండి. మీరున్న మానసిక స్థితిని విశ్లేషించుకొంటూ ఓ నాలుగు వాక్యాలు రాయండి. ఎలా మిమ్మల్ని అదుపు చేసుకోవాలి? మాజీలపై క్రేజీ ఆలోచనల్ని ఎలా వదిలించుకోవాలి? కొత్త లైఫ్‌లోకి ఎలా సైన్‌ఇన్‌ అవ్వాలి?... లాంటి విషయాల్ని డైరీల్లో రాయడం ద్వారా మిమ్మల్ని మీరే సంస్కరించుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని