సోషల్‌ డైలమా..బద్దలు కొడదాం నేస్తమా

హద్దుల్లో ఉంటే సామాజిక మాధ్యమాలతో అద్భుతాలు చేయొచ్చు. వాడకం వ్యసనంలా మారితే అసలుకే ఎసరొస్తుంది. మీడియాని సమర్థంగా ఉపయోగించుకున్నవారి సంగతి సరే.. బానిసలా మారిపోతే ఒంటరితనం ఆవహిస్తుంది. ఒత్తిళ్లు, మానసిక రుగ్మతలు దరి చేరతాయి. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ వస్తాయి అంటారు నిపుణులు.

Published : 12 Dec 2020 01:20 IST

- ఫేస్‌బుక్‌ సమయమంతా తినేస్తోంది. ఇంకోసారి దాని మొహం చూడొద్దు!
- ఇంటర్‌ విద్యార్థి అసహనం. కానీ గంట గడవకముందే ఎఫ్‌బీ తెరిచి కూర్చుంటుంది.
- బాస్‌ చీవాట్లు భరించలేకపోతున్నా. పెండింగ్‌ పని పూర్తి చేసేయాలి!
- యువ ఉద్యోగి అంతర్మథనం. ఆఫీసుకి రాగానే వాట్సాప్‌ గ్రూపుల్లో చాటింగ్‌లు షురూ.

చాలామందిదీ ఇదే బాధ. వద్దనుకుంటారు. వదల్లేరు. చూడొద్దనుకుంటారు. చూపు తిప్పుకోలేరు. ఏంటి ఇదంతా? అంటే సోషల్‌ మీడియా డైలమా. యువత ఈ అనిశ్చితిని బద్ధలు కొట్టాలంటున్నారు మానసిక నిపుణులు.
హద్దుల్లో ఉంటే సామాజిక మాధ్యమాలతో అద్భుతాలు చేయొచ్చు. వాడకం వ్యసనంలా మారితే అసలుకే ఎసరొస్తుంది. మీడియాని సమర్థంగా ఉపయోగించుకున్నవారి సంగతి సరే.. బానిసలా మారిపోతే ఒంటరితనం ఆవహిస్తుంది. ఒత్తిళ్లు, మానసిక రుగ్మతలు దరి చేరతాయి. ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ వస్తాయి అంటారు నిపుణులు.

ఎందుకిలా?
అతి వాడటం అనర్థదాయకం అని తెలిసీ ఆ ఊబిలోంచి ఎందుకు బయట పడలేకపోతున్నారని సైకాలజిస్టు గీత చల్లాని అడిగితే ‘సామాజిక మాధ్యమాల వాడకం సౌకర్యంగా ఉంటుంది. శారీరక శ్రమ ఉండదు. అదే ఆట ఆడాలన్నా, గార్డెనింగ్‌ చేయాలన్నా కష్టపడాలి. సామాజిక మాధ్యమాలు, సినిమాల్లో తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటుంది. మనకు నచ్చినట్టుగా మాట్లాడటానికి అవతలివైపు వేలమంది ఉంటారు. స్థలం, రవాణా, ప్రాంతం.. హద్దులేం ఉండవు. వీటితోపాటు మనల్ని ఆ మార్గంలో మళ్లించడానికి పీర్‌ ప్రెషర్స్‌ ఉంటాయి. నీకు ఇన్‌స్టా ఖాతా లేదా? నీ ఫొటోకి కొన్ని లైక్‌లే వచ్చాయేంటి? యాక్టివ్‌గా ఉండటం లేదేంటి? ఇలాంటి కామెంట్లు గాఢంగా పని చేస్తాయి’ అంటారామె. ఇక యాప్స్‌ తెరపై తేలియాడే నోటిఫికేషన్లు, విజిళ్లు, బెల్‌ ఐకాన్లు... న్యూరో ట్రాన్స్‌మీటర్లలా పనిచేసి ఒకరకమైన మత్తులో ముంచేస్తాయి.


మనకు మనమే..

సమర్థంగా ఉపయోగిస్తే సామాజిక మాధ్యమాలతో బోలెడు ప్రయోజనాలు. దీన్ని వాడాలా? వద్దా? అనే డైలమాలో ఉండొద్దు. ఎంత సానుకూలంగా ఉపయోగించాలి? అనే ఆలోచించాలి. యువతలో ఉండే సమస్య ఏంటంటే సోషల్‌మీడియాని చెడు దారిలో ఉపయోగిస్తూ విలువైన సమయం, కెరీర్‌లో ఎదిగే అవకాశాలు కోల్పోతున్నారు. ఈ వ్యసనం నుంచి బయట పడాలని భావించే వాళ్లు ‘కాస్ట్‌ బెనెఫిట్‌ ఎనాలసిస్‌’ చేసుకోవాలి? అంటే వీటి వాడకంతో నాకొచ్చే లాభం ఎంత? నష్టం ఎంత? అని లెక్కలు వేసుకోవాలి. నష్టమే ఎక్కువని భావిస్తే అందులో నుంచి బయట పడాలని ప్రగాఢంగా నమ్మాలి. కోడిగుడ్డు బయటి నుంచి పగిలితే ప్రయోజనం ఉండదు. గుడ్డు వ్యర్థమవుతుంది. లోపలి నుంచి పగిలినప్పుడు కోడి పిల్ల బయటికొస్తుంది. కొత్త జీవితం మొదలవుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి అంతర్గత ప్రేరణ ఉండాలి.

- గీత చల్లా, మానసిక నిపుణురాలు


బయట పడదామిలా

తాళం వేద్దాం

1. చాలామంది నిద్ర లేవగానే చేసే మొదటి పని, రోజులో ఆఖరి పని గ్యాడ్జెట్స్‌తో గడపడమే. ఒక్కసారిగా ఇది మానుకోవడం కష్టమే. అందుకే ఫోన్‌ పట్టుకోవాలి అనుకుంటే ఓ అరగంటో, గంటో ముందే లేవాలి. ఫలానా సమయం తర్వాత అస్సలు ముట్టుకోకూడదనే నియమం పెట్టుకోవాలి. డైనింగ్‌ టేబుల్‌, పడకగది, కిచెన్‌, బాత్‌రూం, స్టడీరూంలను నెట్‌ ఫ్రీ జోన్లుగా ప్రకటించుకోవాలి. కుటుంబంతో గడిపేటప్పుడు, పడక ఎక్కేముందు గ్యాడ్జెట్లకు తాళం వేసేయాలి. వాటిని పక్కన పడేస్తే కొంతలో కొంత మేలు. అప్పుడైనా తెరని స్క్రోలింగ్‌ చేసే అలవాటు తప్పుతుంది.


లెక్కలు తీయండి

2. ఒకటి తర్వాత మరోటి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూస్తూనే ఉంటాం. చాటింగ్‌లో పడితే సమయమే మర్చిపోతాం. పనులన్నీ అటకెక్కుతాయి. ఇలా జరగకుండా అసలు రోజుకి ఎంత సమయం వృథా చేస్తున్నామో ఓసారి లెక్కేయండి. సమయాన్ని ట్రాక్‌ చేసే యాప్‌లు బోలెడన్ని ఉన్నాయి. ఓ వారం లెక్కలు తీస్తే విలువైన సమయం ఎంత వృథా చేస్తున్నామో తెలిసిపోతుంది. కొద్దిగా ఆలోచిస్తే ఎవరి ద్వారా మనం చెడు దారి పడుతున్నామో? ఎవరి కారణంగా సమయం వృథా అవుతుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాళ్లను దూరం పెట్టాల్సిందే.


ప్రత్యామ్నాయం

3. ఫోన్‌ నుంచి మెసేజ్‌లు, నోటిఫికేషన్ల శబ్దం రాగానే ఆటోమేటిగ్గా మన చూపు అటువైపు వెళ్లిపోతుంది. అదేంటో తెలుసుకోవాలనే ఉత్సుకత రేగుతుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌.. మాధ్యమం ఏదైనా సెట్టింగ్స్‌లోకి నోటిఫికేషన్స్‌కి అడ్డుకట్ట వేసే మార్గాలున్నాయి. ఆటో లాగిన్‌, ఆటో ప్లే కాకుండా చేయాలి. ఇదికాదు.. ఎంత ప్రయత్నించినా ఆన్‌లైన్‌కి దూరంగా ఉండలేకపోతే.. దాంట్లోనే పనికొచ్చే దారులు వెతకండి. మనలో చాలామందికి పుస్తకాలు చదవడం, వంట పని, వ్యాయామం, తోట పని లాంటి ఇష్టమైన వ్యాపకాలు ఏవేవో ఉంటాయి. మీ ప్రతిభ పెంచుకునేలా యూట్యూబ్‌ ఛానెల్‌ లేదా సృజనాత్మక బ్లాగ్‌ ప్రారంభిస్తే సమయం సానుకూలమవుతుంది.


ముందే అనుకుంటే...

4. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా, ఓటీటీ.. తెరిచే ముందే ఒక్క క్షణం ఆలోచించాలి. అసలు దీంతో నాకు కలిగే ప్రయోజనం ఎంత? అని ఒక్క నిమిషం నిజాయతీగా ఆలోచిస్తే మన వేళ్లు ఆ యాప్‌ని తెరవడానికి సంకోచిస్తాయి. లేదంటే 1:3 ఫార్ములా పాటించాలి. అంటే ఒక గంట సామాజిక మాధ్యమాలకు కేటాయిస్తే తప్పకుండా 3 గంటలపాటు ఏదైనా ప్రయోజనం కలిగించే పనులు చేయాలి. ‘సపోర్ట్‌ గ్యాడ్జెట్‌’ సూత్రం పాటించాలి. ఉదాహరణకు ఫోన్‌ అసలు వదల్లేకపోతున్నాం అనుకోండి. టోపీని సపోర్ట్‌ గ్యాడ్జెట్‌ అనుకోవాలి. టోపీ పెట్టుకున్నంతసేపు ఫోన్‌ ముట్టుకోనని ప్రమాణం చేసుకోవాలి.




 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని