Published : 03 Apr 2021 13:34 IST

పదే పదే అవే ఆలోచనలు!

నా వయసు 22 సంవత్సరాలు. ఒక ఫ్రెండ్‌ ప్రోద్బలంతో పోర్న్‌ సినిమాలు చూడటం అలవాటైంది. ఈమధ్య నాకు అందంగా ఉన్నవాళ్లు కనిపిస్తే చాలు వాళ్లతో సెక్స్‌ చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి. కొన్నిసార్లు వరసలు సైతం మర్చిపోయి అలా చెడుగా ఆలోచిస్తున్నాను. ఒక్కోసారి నాకే ఇది సిగ్గుగా అనిపిస్తోంది. దీని నుంచి ఎలా బయటపడాలి?- కే.ఎస్‌., ఈమెయిల్‌
మన మెదడు దేనికి ఎక్కువగా భయపడుతుందో, ఏది వద్దనుకుంటుందో.. దానికే ఎక్కువగా ఆకర్షితులవడం మానవ నైజం. అదేపనిగా పోర్న్‌ చూసినప్పుడు చెడు ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? ముందు ఆ వీడియోలు చూడటం ఆపేయండి. అవసరమైతే కొద్దిరోజులు స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉండండి. అయితే ఇది చెప్పినంత సులువేం కాదు. అందుకోసం ముందు మీరు ప్రతి నిమిషం బిజీగా ఉండటానికి ప్రయత్నించండి. రోజూ ఏదైనా వ్యాపకం పెట్టుకోండి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ఒక టైంటేబుల్‌ తయారు చేసుకోండి. యోగా, ధ్యానం, జిమ్, పుస్తకాలు చదవడం, ఏదైనా పని.. ఎప్పుడూ తీరిక లేకుండా ఉండాలి. అలా చేస్తే మెదడులో చురుకుదనం వస్తుంది. చెడు ఆలోచనలు తగ్గుతాయి. మీ అంతట మీరే మీ ఆలోచనలు తప్పు అని తెలుసుకొని మారాలనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు మార్చుకోవడం అసాధ్యమేం కాదు. దీంతోపాటు కుదిరితే ఆడవాళ్లను గౌరవించే, పవిత్రంగా ఉంచే సినిమాలు, సీరియళ్లు ఎక్కువగా చూడండి. దీంతో మహిళల పట్ల మీ దృష్టికోణం మారుతుంది. ఇన్ని చేసినా మార్పు కనిపించడం లేదు అనుకుంటే.. ఒక సైకాలజిస్టుని సంప్రదించండి.- అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌      


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు