పల్లె బంగారం

అమ్మ బీడీ కార్మికురాలు. నాన్న ప్రైవేటు టీచరు. పస్తులే ఆస్తులు. ఈ దుస్థితి మారాలంటే అక్షరమొక్కటే మార్గమని నమ్మాడు కామారెడ్డి జిల్లా కాచాపూర్‌ కుర్రాడు సుషాంత్‌ గౌడ్‌. చదువుల తపస్సు చేశాడు. మార్కుల్ని వశం చేసుకున్నాడు.

Updated : 31 Oct 2021 00:34 IST

మ్మ బీడీ కార్మికురాలు. నాన్న ప్రైవేటు టీచరు. పస్తులే ఆస్తులు. ఈ దుస్థితి మారాలంటే అక్షరమొక్కటే మార్గమని నమ్మాడు కామారెడ్డి జిల్లా కాచాపూర్‌ కుర్రాడు సుషాంత్‌ గౌడ్‌. చదువుల తపస్సు చేశాడు. మార్కుల్ని వశం చేసుకున్నాడు. ఎమ్మెస్సీ రసాయనశాస్త్రంలో ఏకంగా ఐదు స్వర్ణపతకాలు సాధించి, స్నాతకోత్సవంలో గవర్నర్‌ తమిళిసై చేతులమీదుగా పతకాలు అందుకొని పల్లె బంగారంగా నిలిచాడు.

ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో సీటు సాధించడమే యువతకి ఓ కల. అలాంటిది పీజీలో ఏకంగా ఐదు గోల్డ్‌మెడల్స్‌ అందుకున్నాడు సుశాంత్‌. ఇది రికార్డు. నా నేపథ్యమే నన్నలా మార్చివేసిందంటాడు తను. చిన్నప్పట్నుంచీ వాళ్ల కుటుంబానిది అరకొర సంపాదనే. తండ్రి చాలీచాలని సంపాదనతో ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తే ఈ బాధలన్నీ గట్టెక్కుతాయనుకున్నాడు. కష్టపడి చదివాడు. అధ్యాపకుడు రవికుమార్‌ ప్రోత్సాహంతో ఉస్మానియా పీజీ ప్రవేశ పరీక్షలో ఏడో ర్యాంకు సాధించాడు. ప్రతి సెమిస్టర్‌లోనూ అతడే ఫస్ట్‌. మొత్తమ్మీద 2017-2019 విద్యా సంవత్సరంలో సుషాంత్‌ ఒక్కడే ఐదు బంగారు పతకాలు సాధించాడు. కెమిస్ట్రీ విభాగంలో 79ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన కొద్దిమందిలో ఒకడిగా నిలిచాడు. ఇప్పటికే ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం సంపాదించిన సుషాంత్‌ ఓయూలోనే పీహెచ్‌డీ పూర్తి చేసి దేశానికి ఉపయోగపడే పరిశోధనలు చేస్తానంటున్నాడు.

- సంపత్‌ పెద్దబోయిన, నిజామాబాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని