Updated : 22 Jan 2022 06:10 IST

ఇన్‌స్టాలో... పైసా వసూల్‌

ఫొటో పెట్టి పోజు కొడతాం.. లైక్‌లు వస్తే మురిసిపోతాం. అప్పుడప్పుడు పోస్టులతో చెలరేగిపోతాం ఇన్‌స్టా అంటే ఇంతేనా? ఫాలోయర్లు ఎక్కువగా ఉండి,  పోస్ట్‌లు సృజనాత్మకంగా ఉంటే దీంతో కాసులు పోగేసుకునే మార్గమూ ఉంది బాస్‌! ఎలాగంటారా?


సమర్పణ

ఫాలోయర్లు ఎక్కువగా ఉంటే కొన్ని సంస్థలు, బ్రాండ్‌లు మిమ్మల్ని సంప్రదిస్తాయి. వాళ్ల ఉత్పత్తులకు సంబంధించిన పోస్ట్‌లు పెడితే డబ్బులిస్తాయి. లేదంటే మీరే వాళ్లని సంప్రదించవచ్చు. పేరున్న తారలైతే ఒక్కో పోస్ట్‌కి వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్నారు.


అఫిలియేట్‌ మార్కెటింగ్‌

ఇన్‌స్టాని అఫిలియేట్‌ మార్కెటింగ్‌ వేదికగా మార్చుకొని ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ప్రోమో కోడ్‌లు, లింక్‌లు పంచుకోవడం ద్వారా కూడా కొంత మొత్తం సంపాదించుకోవచ్చు. అమెజాన్‌ అసోసియేట్స్‌, సీజే అఫిలియేట్‌, షేర్‌ ఏ సేల్‌, స్కిమ్‌లింక్స్‌.. ఇలాంటివి ఈ తరహా మార్కెటింగ్‌ కంపెనీలు.


సొంతంగా..

కాస్త సృజనాత్మకత ఉండాలేగానీ ఇన్‌స్టాగ్రామ్‌నే ఓ ఈ-కామర్స్‌ సైట్‌లా మార్చేయొచ్చు. దుస్తులు, ఇతర ఉత్పత్తులు అమ్ముకోవచ్చు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమూ చేయొచ్చు. వేలు, లక్షల్లో ఫాలోయర్లు ఉంటే.. అందులో కొంతమందినైనా వినియోగదారులుగా మార్చుకోగలిగితే ఆ వ్యాపారమే వేరుగా ఉంటుంది.


రాయబారిగా..

ఒక సర్వే ప్రకారం మిలీనియల్స్‌లో 80శాతం మంది ఏదో ఒక బ్రాండ్‌ని ఇష్టపడుతున్నారట. అలాంటి యువత ఆసక్తిని క్యాష్‌ చేసుకోవడానికి.. ఏదైనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోవచ్చు. అత్యధిక ఫాలోయర్లున్న ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఈ బ్రాండ్‌లు ఎర్ర తివాచీ పరచడం మామూలే.


సలహాదారు మీరే

ఇన్‌స్టాలో ఎన్నిరకాలుగా సంపాదించవచ్చో తెలిసిపోయాక ఎంచక్కా మార్కెటింగ్‌ సలహాదారుగా కూడా మారిపోవచ్చు. ఇతరులకు సలహా ఇచ్చి ఫీజు తీసుకోవచ్చు. ‘ఫైవర్‌’, ‘అప్‌వర్క్‌’లాంటి వేదికలూ ఇన్‌స్టాగ్రామ్‌లాంటివే.


రివ్యూ రాస్తూ..

సెల్‌ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఆటోమొబైల్‌... ఇలా కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాటిపై రివ్యూలు రాయొచ్చు. వీటిని యూట్యూబ్‌తో అనుసంధానిస్తే వీక్షణల ద్వారా ఆదాయం. రివ్యూలు ఎంత సృజనాత్మకంగా, ఎంత నిష్పక్షపాతంగా ఉంటే అన్ని వ్యూస్‌ అన్న సంగతి మరవొద్దు.


అమ్మేద్దాం..

మంచి ఫాలోయర్లున్నా.. నిర్వహించే ఓపిక, తీరిక లేదనుకోండి. మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు. ఆశ్చర్యపోకండి! ప్రారంభ దశలో ఉన్న ఈ ట్రెండ్‌ భవిష్యత్తులో ఊపందుకోబోతోంది అంటున్నారు.


పోస్ట్‌లకూ ధర

మీ ఫోటోలు బాగుంటే లైక్‌లు వెల్లువెత్తుతాయి. పోస్ట్‌లు కిరాక్‌ అయితే కామెంట్లు పోటెత్తుతాయి. ఆ లైక్‌లు, కామెంట్లతోనే సర్దుకుపోయే తత్వం మీది కాకపోతే మీ పోస్ట్‌లను ఐ స్టాక్‌, షట్టర్‌ స్టాక్‌, బిగ్‌ స్టాక్‌, గెట్టీ.. లాంటి ఫొటోగ్రఫీ ప్రొవైడర్లకు అమ్ముకోవచ్చు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని