ఎవరెస్టింగ్‌.. సాహసికుల కోసం

ఏం చేసినా నెంబర్‌వన్‌గా ఉండాలనుకునే వారి కోసం ఓ కొత్త ట్రెండ్‌ దూసుకొచ్చింది. అదే ‘ఎవరెస్టింగ్‌’. ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, సైక్లిస్ట్‌లకు ఇది ప్రత్యేకం.

Updated : 29 Jan 2022 05:39 IST

ఏం చేసినా నెంబర్‌వన్‌గా ఉండాలనుకునే వారి కోసం ఓ కొత్త ట్రెండ్‌ దూసుకొచ్చింది. అదే ‘ఎవరెస్టింగ్‌’. ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు, సైక్లిస్ట్‌లకు ఇది ప్రత్యేకం.

ఏంటీ ఛాలెంజ్‌?

ఎవరెస్ట్‌.. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం. దాని ఎత్తు 8,848 మీటర్లు. ప్రతి పర్వతారోహకుడికి దీన్ని అధిరోహించడం ఓ కల. ఈ అంశాన్నే సైక్లింగ్‌తో ముడిపెడుతూ ఎవరెస్టింగ్‌కి తెర తీశారు కొందరు ఔత్సాహికులు. అంటే దగ్గర్లోని ఏదైనా కొండ, ఎత్తైన ప్రదేశాన్ని ఎంచుకొని 8,848 మీటర్లు పూర్తయ్యేదాకా కిందికి, పైకి సైక్లింగ్‌ చేస్తూనే ఉండాలి. ఇది మామూలు విషయమేం కాదు. ఎగుడు ప్రాంతాలు, లోయలు, మలుపులు, దారి సరిగా లేకపోవడం.. ఇలాంటి కఠిన సవాళ్లన్నీ దాటాలి. పూర్తి చేయాలంటే ఎంతో ఓపిక, సత్తువ, కోర్‌ స్ట్రెంగ్త్‌ కావాలి. అయినా ఈ సవాల్‌ని ఇప్పటికి వందకుపైగా దేశాల్లో ఇరవై వేల మంది పూర్తి చేశారు. ఎవరెస్టింగ్‌ పూర్తవడానికి ఒక్కోసారి ఇరవై నాలుగు గంటల పైగానే సమయం పట్టొచ్చు. ముందు కొన్నినెలల పాటు సాధన చేస్తేగానీ ఇది సాధ్యం కాదు.

ఉపయోగాలేంటి?

ఎవరెస్టింగ్‌ పూర్తైతే.. గొప్ప విజయం సాధించినట్టవుతుంది. అంతేకాదు.. ఫిట్‌నెస్‌ పరంగా ఇది టోటల్‌ బాడీ వర్కవుట్‌ అంటారు వ్యాయామ నిపుణులు. సైక్లింగ్‌ సాధన చేస్తుంటే.. బరువు తగ్గుతారు. గుండె పనితీరు మెరుగవుతుంది. అధికంగా ఉన్న కొవ్వు కరిగి తీరైన శరీరాకృతి వస్తుంది. మోకాలు, తుంటి కదలికల్లో చురుకుదనం పెరుగుతుంది. ఈ సవాల్‌ని స్వీకరించే వాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని