Updated : 19 Feb 2022 08:40 IST

కచ్చా బాదమ్‌తో.. కవ్వించేస్తోంది

బాదామ్‌ బాదామ్‌.. దాదా కచ్చా బాదామ్‌...’ ఈ పాట మోగని సెల్‌ఫోన్‌ లేదు. అదిరిందంటూ ఊగిపోని కుర్రకారు లేరు. ఈమధ్యకాలంలో అంతగా వైరల్‌ అయిపోయింది మరి. నిన్నటిదాకా ఈ పాట పాడిన భుబన్‌ బద్యకర్‌కి తెగ పేరొస్తే.. తాజాగా ఈ పాటకి స్టెప్పులు రూపొందించిన అంజలీ అరోరాకి జనం ఫిదా అయిపోతున్నారు. ఎందుకంతా క్రేజ్‌? తనేమైనా మైఖేల్‌ జాక్సన్‌లా స్టెప్పులేసిందా? ప్రభుదేవాలా ఒంటిని మెలికలు తిప్పిందా? అంటే అబ్బే.. అంత సీన్‌ లేదండి. కవ్వింపుగా నడుముని తిప్పింది. కైపెక్కించేలా కళ్లతోనే నిషాని ఒలకబోసింది. అందరూ ఆడిపాడేలా తేలిగ్గా డ్యాన్స్‌ రూపొందించింది. అంతే.. జనం ఫిదా అయిపోయారు. కచ్చా బాదమ్‌ స్టెప్పులు కుర్రకారు గుండెల్ని ఎంతలా గుచ్చేశాయంటే.. అక్కడా ఇక్కడా అనకుండా.. గల్లీ నుంచి పెళ్లి బారాత్‌ దాకా పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఈ మైకం ఎంతమందిని కమ్మేసిందంటే.. మన    స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా కూతురుతో కలిసి చిందేశాడు. నటి సురేఖవాణి వాళ్ల అమ్మాయితో ఆడిపాడింది. అక్కడెక్కడో పోర్చుగల్‌ దేశంలో కూడా తండ్రీ కూతుళ్లు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. అంతెందుకు ఒక విమానంలో ఎయిర్‌ హోస్టెస్‌ కూడా ఇదే పాటకి మైమరిచి ఆడింది. ఇక సామాన్యుల సంగతి చెప్పాలా? అందుకే భుబన్‌లాగే అంజలీ కూడా వైరల్‌ స్టార్‌ అయింది. అన్నట్టు ఈ పాటతో యువతకి మరింత దగ్గరైంది కానీ.. తను ఇంతకుముందే టిక్‌టాక్‌ స్టార్‌. డ్యాన్సర్‌, వ్లోగర్‌, యూట్యూబర్‌ కూడా. సొంత రాష్ట్రం పంజాబ్‌.  ప్రస్తుతం దిల్లీలో ఉంటోందీ భామ. గతంలో సెలెబ్రెటీలతో కలిసి యాభైదాకా వీడియో సాంగ్స్‌ చేసింది. కచ్చా బాదామ్‌ తర్వాత ఈ అమ్మడి పాపులారిటీ అమాంతం పెరిగిపోవడంతో ఫాలోయర్ల సంఖ్య 10.2 మిలియన్లు దాటింది. ఇన్‌స్టా రీల్స్‌లో ఈ వీడియోని రెండు కోట్ల మంది చూశారు. 16 లక్షల లైక్‌లు, 33 వేల కామెంట్లు పోటెత్తాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని