అరచేతిలో ఫిట్‌నెస్‌ గురూలు

కండలు పెంచాలన్నా.. ఫిట్‌నెస్‌ సాధించాలన్నా.. జిమ్‌కి వెళ్లాల్సిందే. కనీసం ఓ శిక్షకుడైనా కావాల్సిందే. ఆ రెండూ లేకుండానే ఓ కోచ్‌లా దారి చూపే కొన్ని యాప్స్‌ ఉన్నాయి. కుర్రాళ్లూ.. ఓ చూపు చూడండి.

Published : 19 Feb 2022 01:22 IST

కండలు పెంచాలన్నా.. ఫిట్‌నెస్‌ సాధించాలన్నా.. జిమ్‌కి వెళ్లాల్సిందే. కనీసం ఓ శిక్షకుడైనా కావాల్సిందే. ఆ రెండూ లేకుండానే ఓ కోచ్‌లా దారి చూపే కొన్ని యాప్స్‌ ఉన్నాయి. కుర్రాళ్లూ.. ఓ చూపు చూడండి.

గూగుల్‌ ఫిట్‌ రోజువారీ కసరత్తులను విశ్లేషించి ఎన్ని కేలరీలు కరిగాయో చెబుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా ఈ యాప్‌ని తయారు చేశారు. రోజులో ఎంతదూరం నడిచారు? ఎన్ని మెట్లెక్కారు? ఈ సమయంలో గుండె కొట్టుకునే వేగం, కరిగిన కేలరీలు.. విశ్లేషిస్తుంది.

రన్‌టాస్టిక్‌ అడిడాస్‌ సంస్థ తయారు చేసిన యాప్‌ ఇది. ఈత, పరుగు, సైక్లింగ్‌.. వీటిని దినచర్యలో భాగం చేసుకునేవారికి బాగా అక్కరకొచ్చే అప్లికేషన్‌. గ్రాఫిక్‌ల రూపంలో మనం అప్పటిదాకా చేసిన వ్యాయమామాలు, చేరాల్సిన లక్ష్యాలు వివరిస్తుంది.

మ్యాప్‌ మై ఫిట్‌నెస్‌ చేసిన కసరత్తులతో ప్రయోజనం.. కరిగిన కేలరీలు.. ఇదే స్థాయిలో చేస్తే ఎప్పటికల్లా లక్ష్యం చేరతాం? ఇవన్నీ ట్రాక్‌ చేసే యాప్‌ మ్యాప్‌ మై ఫిట్‌నెస్‌. పరుగు, నడక, సైక్లింగ్‌, ఈత, యోగ, క్రాస్‌ ట్రైనింగ్‌.. ఇలా 600 రకాల వ్యాయామాలు పొందుపరిచారు.

నైక్‌ ట్రైనింగ్‌ క్లబ్‌ ఈ యాప్‌ మన సెల్‌ఫోన్‌లో ఉందంటే ఒక శిక్షకుడు వెంట ఉన్నట్టే. ఇందులో 185 రకాల వర్కవుట్లు, చేయాల్సిన పద్ధతులు ఉన్నాయి. ఎలాంటి పరికరాలు లేకుండా, జిమ్‌కి వెళ్లాల్సిన అవసరమే లేకుండా.. ఫిట్‌నెస్‌ లక్ష్యాలు చేరేలా తీసుకెళ్తుంది.

రన్‌కీపర్‌ ఈ యాప్‌ని దాదాపు ఐదుకోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. నడక, పరుగు.. ప్రతీదీ ట్రాక్‌ చేస్తుంది. కొత్తగా వ్యాయామం ప్రారంభించిన వారి దగ్గర్నుంచి, వ్యాయామాలపై పట్టు ఉన్న వారి దాకా.. అందరికీ ఉపయోగపడేలా భిన్న స్థాయిల్లో రూపొందించారు.

కెలోరీ కౌంటర్‌ బరువు తగ్గాలి.. ఫిట్‌నెస్‌ పెంచుకోవాలి అనుకునేవాళ్లకి ఇది ప్రత్యేకం. ఈ లక్ష్యం చేరడానికి ఎన్నిరకాల పద్ధతులు అందుబాటులో ఉన్నాయో వివరిస్తుంది. ఈ వ్యాయామాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంది. డైట్‌కి సంబంధించి 600లకు పైగా ఆహార పదార్థాల వివరాలు అందిస్తోంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని