విడిపోయినా.. వాడిపోని స్నేహం

ప్రేమించి పెళ్లాడటం.. మనసులు కలవక విడిపోవడం.. సెలెబ్రెటీల్లో మామూలైపోతోంది. అయినా వాళ్లు ఒకరిపై ఒకరు కారాలు నూరుకోవడం లేదు. మూతి ముడుచుకోవడాలు అస్సలు లేవు. బంధానికి బై చెప్పినా.. స్నేహితుల్లా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు.

Updated : 12 Mar 2022 04:44 IST

ప్రేమించి పెళ్లాడటం.. మనసులు కలవక విడిపోవడం.. సెలెబ్రెటీల్లో మామూలైపోతోంది. అయినా వాళ్లు ఒకరిపై ఒకరు కారాలు నూరుకోవడం లేదు. మూతి ముడుచుకోవడాలు అస్సలు లేవు. బంధానికి బై చెప్పినా.. స్నేహితుల్లా చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. అదీ కొత్త ట్రెండ్‌. ఈమధ్య కాలంలో అలాంటి జంటలు ఎవరున్నారని ఆరా తీస్తే.. ఇదిగోండి వీళ్లు లెక్క తేలారు.


హృతిక్‌ రోషన్‌-సుజాన్నే ఖాన్‌

ఏడేళ్ల కిందట సుజాన్నేతో విడిపోతున్నాను అని హృతిక్‌ ప్రకటించినప్పుడు అభిమానుల గుండెలు మండిపోయాయి. కొన్నాళ్లయ్యాక ఈ ఇద్దరూ అప్పుడప్పుడు కెమెరాలకు చిక్కుతుండటం.. కొంత ఊరట. పిల్లల పుట్టినరోజు వేడుకలు, పండగల్లో కలుసుకుంటున్నారు. ఖాళీ సమయాల్లో సరదాగా విహారాలు చేస్తున్నారు. ఈ తీరు చూడముచ్చటగా ఉందంటున్నారు ఫ్యాన్స్‌.తి


ఫర్హాన్‌ అఖ్తర్‌-అధునా భబానీ

ఈమధ్యే ఫర్హాన్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. అధునా దగ్గరి స్నేహితురాలిలా శుభాకాంక్షలు చెప్పింది. ‘మేం విడిపోయినా మా స్నేహం వాడిపోదు’ అనే డైలాగూ చెప్పింది. కూతుళ్లు షక్యా, అకీరాల కోసం జీవితాంతం మంచి స్నేహితులుగానే ఉంటామంటోంది.


అమీర్‌ఖాన్‌- కిరణ్‌రావు

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ఖాన్‌.. కిరణ్‌రావుతో 15 ఏళ్ల బంధాన్ని తెగతెంపులు చేసుకున్నాడు. ఆ సంసారం ముగిసినా స్నేహం సజావుగానే సాగుతోంది. ఇద్దరూ కలిసి లాల్‌సింగ్‌చద్దా సినిమాని నిర్మిస్తున్నారు. స్నేహితుల్లా ఫొటోలకు పోజులిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు.


మలైకా అరోరా- అర్బాజ్‌ ఖాన్‌

పెళ్లై, ఇరవై ఏళ్లు అయ్యాక.. మలైకా, అర్బాజ్‌లు వేరేవాళ్లతో ప్రేమలో పడిపోయారు. ఇదేం చోద్యమని అంతా అనుకునేలోపే.. విడాకులూ తీసేసుకున్నారు. ఇప్పుడు ఎవరి జీవితాలు వారివి. అయినా ఈ జంట ఇప్పటికీ స్నేహం కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా పిల్లల కోసం.. తప్పనిసరిగా నెలకి రెండురోజులైనా కలుసుకోవాలనే నియమం పెట్టుకున్నారట.


అనురాగ్‌ కశ్యప్‌- కల్కీ కొచ్లిన్‌

ఏళ్లకొద్దీ సహజీవనం చేసిన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌- నటి కల్కీకొచ్లిన్‌ 2011లో పెళ్లిపీటలెక్కారు. నాలుగేళ్లు సవ్యంగానే కాపురం చేశారు. తర్వాత మనస్పర్థలొచ్చి విడిపోయారు. అయినా వారి స్నేహబంధం దృఢంగానే ఉంది. ఆమధ్య అనురాగ్‌పై లైంగిక వేధింపుల వివాదం వచ్చినప్పుడు తనకి అండగా నిలబడింది కల్కీ. తను అలాంటివాడు కాదని సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కి మరీ వాదించింది.


విడాకులు తీసుకున్నంత మాత్రాన శత్రువులైపోరు.. బంధం వదులుకుంటే స్నేహాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు.. అని ఈ జంటలు మాటల్లో, చేతల్లో చూపిస్తున్నారు. భార్యాభర్తలు విడిపోవాలని ఎవరూ కోరుకోరుగానీ.. విడిపోయినా స్నేహాన్ని కొనసాగించవచ్చు అని వీళ్లని చూసి చెప్పొచ్చు అన్నమాట.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని