ముచ్చటైన జంటకు మూడో ముడి

ఎట్టకేలకు రహస్యం బట్టబయలైంది. అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ భామ ఆలియాభట్‌, బాలీవుడ్‌ సోగ్గాడు రణ్‌బీర్‌ కపూర్‌ల పెళ్లి ముహూర్తం ఖరారైంది. వీళ్ల ప్రేమకథా చిత్రమ్‌ ఎలా మొదలైంది? ఇంతదాకా ఎలా వచ్చింది?....

Updated : 09 Apr 2022 04:36 IST

ఎట్టకేలకు రహస్యం బట్టబయలైంది. అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ భామ ఆలియాభట్‌, బాలీవుడ్‌ సోగ్గాడు రణ్‌బీర్‌ కపూర్‌ల పెళ్లి ముహూర్తం ఖరారైంది. వీళ్ల ప్రేమకథా చిత్రమ్‌ ఎలా మొదలైంది? ఇంతదాకా ఎలా వచ్చింది?

పదకొండేళ్లకే క్రష్‌

వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం. ఆలియాకి తను పదకొండేళ్లు ఉన్నప్పుడే రణ్‌బీర్‌పై ‘క్రష్‌’ మొదలైందట. పేరు బయట పెట్టకుండా చాలా ఇంటర్వ్యూలో ఈ విషయం పదేపదే చెప్పింది. ఆ వ్యక్తి పొడగరి అనీ.. ప్రముఖ సినీ కుటుంబానికి చెందిన వ్యక్తని క్లూ కూడా ఇచ్చింది.

కరణ్‌ ‘కాఫీ’ కలిపాడు

2014లో ఆలియా తెరంగేట్రం చేసింది. కొన్నాళ్లకే స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. ఆపై ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొంది. ‘నీకు పెళ్లి చేసుకునే అవకాశం వస్తే ఎవరిని చేసుకుంటావ్‌?’ అని అడిగాడు కరణ్‌. తడుముకోకుండా ‘రణ్‌బీర్‌ని’ అంది. అప్పటికే ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని గుసగుసలు మొదలయ్యాయి.

అయాన్‌ ముఖర్జీ రాయబారం

ఆలియా, రణ్‌బీర్‌ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ ఈనెలలోనే విడుదలవుతోంది. కానీ ఈ చిత్రం షూటింగ్‌ 2018లోనే మొదలైంది. దర్శకుడు అయాన్‌ ముఖర్జీ. ఈ ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపిన వ్యక్తి ఇతడేనంటారు. షూటింగ్‌ ప్రదేశమే ఆలియా, రణ్‌బీర్‌లకు లవ్‌ స్పాట్‌గా మారేది. సోనమ్‌కపూర్‌ పెళ్లికి ఇద్దరూ ఎంచక్కా సంప్రదాయ దుస్తుల్లో, భార్యాభర్తల్లా వచ్చారు.  

దీపావళి కాంతి

గత దీపావళికి ఆలియా ట్విటర్‌లో ఓ ఫొటో పెట్టి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తింది. అందులో రణ్‌బీర్‌, ఆలియాలు అతి సన్నిహితంగా నిల్చొని ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. ఈ ట్వీట్‌ చూడగానే ఇద్దరి బంధం గాఢంగా అల్లుకుందనే అంచనాకు వచ్చారంతా. తర్వాత వాళ్లు ముంబయిలో కొత్త బంగ్లా కొనుక్కోవడం, పెళ్లి ముహుర్తాలు కూడా పెట్టేసుకోవడంతో సంబరాల్లో ముగినిపోయారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని